
చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయ్!.. మళ్లీమళ్లీ డెవలప్ చేయాలంటే.. ఇంకా నాకు ఓపికలేదు
నా మొదటి ప్రాధాన్యం వెనుకబడిన వర్గాలే
మిగిలిన వర్గాలు వస్తుంటాయ్.. పోతుంటాయ్
బీసీలకు చట్ట సభల్లో 33% రిజర్వేషన్ సాధిస్తాం
ముఖ్యమంత్రి చంద్రబాబు
సాక్షి, అమరావతి/మంగళగిరి: చాలా ఆర్థిక ఇబ్బందులున్నాయ్.. రూ.పదిలక్షల కోట్లు అప్పులున్నాయ్.. వా టికి వడ్డీలు, అసలు కట్టడానికే ఇబ్బందిపడుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి ఆటోనగర్ వీవర్స్ కాలనీలో గురువారం జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహించారు. సభలో సీఎం మాట్లాడుతూ.. మీ (బీసీలు) వల్లే అధికారంలోకి వచ్చానని, నా మొదటి ప్రాధాన్యం వెనుకబడిన వర్గాలేనని, కొన్ని వర్గాలు వస్తుంటాయి.. పోతుంటాయని పేర్కొన్నారు.
ఇంకా వైకుంఠపాళీ ఆడొద్దని, మళ్లీ మళ్లీ డెవలప్ చేయాలంటే ఇంకా నాకు ఓపిక లేదన్నారు. రాష్ట్రంలో బీసీల కోసం ఆదరణ–3 తెస్తామని, స్థానిక సంస్థల్లో 34శాతం రిజర్వేషన్లు సాధిస్తామని అన్నారు. నేతన్న భరోసా కింద ఏడాదికి రూ.25 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందిస్తామని ప్రకటించారు. ఈ నెల నుంచే చేనేత మగ్గాలకు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని సీఎం చెప్పారు.
అమరావతిలో హ్యాండ్లూమ్ మ్యూజియం
చేనేత ఉత్పత్తులపై విధించే 5 శాతం జీఎస్టీని మొత్తం రూ.15కోట్లను ప్రభుత్వమే రీయింబర్స్ చేస్తుందని సీఎం పేర్కొన్నారు. చేనేతలో 5,386 మందికి లబ్ధి కలిగేలా రూ.5 కోట్లతో పొదుపు నిధి(థ్రిఫ్ట్ ఫండ్) ఏర్పాటు చేస్తున్నామన్నారు. అమరావతిలో హ్యాండ్లూమ్ మ్యూజియం ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించారు. చేనేత సూర్యుడు ప్రగడ కోటయ్య కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తామని, మంగళగిరిలో పార్కుకు ఆయన పేరుపెట్టి, ఆయన జయంతిని అధికారికంగా నిర్వహిస్తామని సీఎం ప్రకటించారు.
బ్రాహ్మణి కట్టిన చీరనే 98 మంది కొన్నారు : లోకేశ్
రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు నడుస్తుంటే.. మంగళగిరిలో మాత్రం మోదీ, బాబు, లోకేశ్‌తో కూడిన ట్రిపుల్ ఇంజిన్ సర్కారు నడుస్తోందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ‘బ్రాహ్మణి మంగళగిరి చేనేత చీర కట్టిన తర్వాత ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అలాంటి చీరనే 98 మంది కొనుగోలు చేశారు’ అని లోకేశ్ పేర్కొన్నారు.
పేదరిక నిర్మూలన కోసమే పీ–4
సాయం చేస్తే సంతృప్తి కలుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విజయవాడలోని ఓ హోటల్లో గురువారం పీ–4పై పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు సమావేశమయ్యారు. పేదరిక నిర్మూలన కోసమే పీ–4 అని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రకాశం జిల్లాకు చెందిన మోహన్ రెడ్డి ఓ మండలంలో 729 కుటుంబాలను దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చారు.
నవ్వులపాలైన నారా లోకేశ్..
టాస్క్ ఫోర్స్ : ఎప్పటిలాగే మంత్రి నారా లోకేశ్ మరోసారి తప్పులో కాలేశారు. మంగళగిరిలో గురువారం చేనేత దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ఎక్కడలేని ఉత్సాహం ప్రదర్శించారు. ఆ మాటల ప్రవాహంలో పాపం నవ్వులపాలయ్యారు. ‘2019 ఎన్నికల్లో.. నేను మంగళగిరిలో 5,300 ఓట్ల తేడాతో ఓడిపోయానని, అయితే, నన్ను 2024 ఎన్నికల్లో 53 వేల ఓట్ల మెజారిటీతో గెలిపించి శాసనసభకు పంపించమని కోరాను.
కానీ, ఏకంగా 91 వేల నాలుగు వందల 13 వేల మెజారిటీతో గెలిపించార’ని నోరుజారి అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు. 91 వేల నాలుగు వందల 13 వేలు ఏంట్రా బాబూ అంటూ సభకు వచ్చిన వారు తలపట్టుకుని నవ్వుకున్నారు.