
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పార్టీ కార్యాలయ ఇన్‌చార్జ్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, దేవాంగ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సురేంద్రబాబు, ఆప్కో మాజీ చైర్మన్ చిల్లపల్లి మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా చేనేత రంగానికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మేలును వారు గుర్తు చేశారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత చేనేత రంగానికి చీకటి రోజులు వచ్చాయని మండిపడ్డారు. చేనేత కార్మికులకు ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ఈ ప్రభుత్వం పూర్తిగా అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎవరెవరు ఏం మాట్లాడారంటే..
ఐదేళ్లలో చేనేతలకు రూ.3700 కోట్లు లబ్ధి: ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి
గడిచిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్ల పాటు చేనేతలు సంతోషంగా జీవించారు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్న ఐదేళ్లలో వివిధ కార్యక్రమాల రూపంలో దాదాపు రూ.3700 కోట్లతో చేనేతలకు అండగా నిలబడ్డారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా నేతన్న నేస్తం పథకాన్ని తీసుకొచ్చి చేనేతల కుటుంబానికి వైఎస్ జగన్ అండగా నిలిచారు. 85 వేల కుటుంబాలకు రూ.1.20 లక్షల చొప్పున మేలు చేసిన ఘనత వైఎస్ జగన్‌కి దక్కుతుంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక సమాజానికి నాగరికత నేర్పి, దర్జా తెచ్చింది నేతన్నల జీవితాలు మళ్లీ చితికిపోతున్నాయి.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా ప్రతి ఏడాది ఇచ్చిన హామీలనే కొత్తగా ప్రచారం చేసుకుంటున్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా చేనేతల పక్షాన వైఎస్సార్‌సీపీ అండగా నిలబడి వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడుతుంది. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా గతేడాది ఆగస్టు 7న విజయవాడలో జరిగిన చేనేత దినోత్సవం కార్యక్రమంలో ఏవైతే హామీలిచ్చారో అవే హామీలను మళ్లీ ఈ ఏడాది కూడా ఇస్తున్నారే కానీ అమలు చేయకుండా సీఎం చంద్రబాబు చేనేతలను మోసగిస్తున్నారు.
జీఎస్టీపై చంద్రబాబు తిరకాసు హామీలు: సురేంద్రబాబు
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత చూస్తే చేనేతలకు ఎవరైనా నేరుగా సాయం అందించారంటే అది ఖచ్చితంగా సీఎంగా వైయస్ జగనే అని చెప్పక తప్పదు. ఐదేళ్లలో రూ.1.20 లక్షలు నేరుగా చేనేతల బ్యాంకు ఖాతాలో జమ చేసి మా కుటుంబాలకు వెన్నుదన్నుగా నిలిచారు. జీఎస్టీ అనేది కేంద్రం పరిధిలోని అంశమే అయినా యువగళం పాదయాత్రలో నారా లోకేష్ చాలా సందర్భాల్లో చేనేతలకు జీఎస్టీ ఎత్తివేస్తామని, లేదంటే రీయింర్స్‌మెంట్ చేస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన ఈ 14 నెలల్లో ఏనాడూ చేనేతల జీఎస్టీ గురించి లోకేష్ మాట్లాడిన పాపాన పోలేదు.
జీఎస్టీ కౌన్సిల్‌లోనూ టీడీపీ ప్రస్తావించలేదు. జీఎస్టీ తీసుకొచ్చినప్పుడు రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వమే అధికారంలో ఉంది. 15వ జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ లో ఒడిశా ప్రభుత్వం మాత్రమే చేనేతలకు జీఎస్టీని వ్యతిరేకిస్తే ఏపీలో ఆనాటి ఆర్థికశాఖ మంత్రిగా ఉన్న యనమల రామకృష్ణుడు మాత్రం జీఎస్టీకి అనుకూలమని చెప్పేసి వచ్చారు. చేనేతలకు జీఎస్టీ విధించడాన్ని మేం వ్యతిరేకిస్తున్నామని ప్రతిపక్షంలో ఉండగా వైఎస్ జగన్ జీఎస్టీ కౌన్సిల్‌కి లేఖ రాయడం జరిగింది. 2021లో జీఎస్టీని 5 శాంతం నుంచి 12 శాతం పెంచుతామని కేంద్రం చెప్పినప్పుడు రాష్ట్ర ఆర్థికశాఖ ద్వారా కేంద్రానికి లేఖ రాసి, దానిని అడ్డుకున్నారు.
వైఎస్ జగన్ నేతృత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అడుగడుగునా చేనేతలకు అండగా నిలిచింది. నేతన్న నేస్తం ఇస్తామని చీరాల సభలో నారా చంద్రబాబు ప్రకటించి ఇంతవరకు దాని ఊసెత్తడం లేదు. చేనేతలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు ఇస్తామని జీవో జారీ చేసి 6 నెలలు గడిచినా ఇంతవరకు దానికి అతీగతీ లేదు. గతేడాది విజయవాడలో నిర్వహించిన చేనేత దినోత్సవం రోజున ఆరోగ్య బీమా కింద తక్షణమే రూ.10 కోట్లు రిలీజ్ చేస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. వాటికి ఇప్పటికీ మోక్షం లభించలేదు సరికదా ఈ ఏడాది దాన్ని రూ.5 కోట్లకు తగ్గించి మోసం చేస్తున్నాడు. జీఎస్టీ ఎత్తివేయడానికి రీయింబర్స్‌మెంట్ కింద ఏడాదికి రూ.67 కోట్లు ఖర్చవుతుందని అదే రోజు చంద్రబాబు చెప్పారు.
చేనేతకు అండగా నిలిచిన వైఎస్ జగన్: చిల్లపల్లి మోహన్‌రావు
వైఎస్ జగన్ 2019లో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి 2020 ఆగస్టు 7న చేనేత దినోత్సవ కార్యక్రమం జరుపుకొనే నాటికి రెండు విడతల్లో చేనేత నేస్తం ఇచ్చారు. చేనేత కార్మికుల సమస్యల మీద అధ్యయనానికి మమ్మల్ని నాటి సీఎం వైఎస్ జగన్ రాష్ట్ర పర్యటనకు పంపించి రిపోర్టు తయారు చేయించారు. రాష్ట్రంలో 87 శాతం చేనేతలంతా ప్రైవేట్ మాస్టర్ వీవర్స్ మీద ఆధారపడి ఉన్నారు. ఆ కారణం చేత అందరికీ మేలు జరిగేలా సొంత మగ్గం ఇంట్లో ఉండి పనిచేసుకుంటున్న వారికి కూడా అమలయ్యేలా 85 వేల కుటుంబాలకు ఐదేళ్లు వైఎస్ జగన్ నేతన్న నేస్తం ద్వారా రూ. 900 కోట్లు లబ్ధి చేకూర్చారు. కానీ ఇప్పుడు చంద్రబాబు సొసైటీలకు మాత్రమే మినహాయింపులు ఉంటాయని షరతులు విధిస్తున్నారు.
వైఎస్ జగన్ సీఎం అయ్యాక రూ.5 వేలుగా ఉండే చేనేతల తలసరి ఆదాయం ఏకంగా మూడు రెట్లు పెరిగిపోయింది. ఆప్కోకి పాత బకాయిలు రూ. 400 కోట్లు రద్దు చేసిన ఘనత వైఎస్ జగన్‌కి దక్కుతుంది. గత తెలుగుదేశం హయాంలో ఆప్కోకి పేరుకుపోయిన ముడి సరుకుకి సంబంధించి రూ.100 కోట్ల బకాయిలు కూడా వైఎస్ జగన్ ప్రభుత్వమే చెల్లించింది.
ఇప్పుడున్న సొసైటీలన్నింటికీ పాత బకాయిలు నాటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోనే తీర్చేశాం. కూటమి ప్రభుత్వం వచ్చాక చేనేతలు ఎవరూ సంతోషంగా లేరు. ఆప్కో సేల్స్ పెరిగితే సొసైటీలకు పని పెరుగుతుందని భావించి తిరుపతి, కడపలో మూడంతస్తుల సొంత భవనం, గుంటూరు, ఒంగోలు, గన్నవరం ఎయిర్‌పోర్ట్, రేణిగుంట ఎయిర్‌పోర్ట్, తదితర ప్రాంతాల్లో అత్యాధునిక షోరూమ్‌లను వైఎస్సార్‌సీపీ హయాంలోనే ఏర్పాటు చేశాం. గతంలో వైఎస్సార్ కూడా సీఎంగా ఉండగా కేంద్రంతో మాట్లాడి 11.3 శాతం ఎక్సైజ్ డ్యూటీని ఒక్క రోజులో రద్దు చేయించారు.