
రెండు వర్గాలను చెదరగొడుతున్న పోలీసులు
తాడిపత్రిలో రాళ్లు రువ్వుకున్న జేసీ, కాకర్ల వర్గం
వినాయక నిమజ్జనంలో గొడవ
పలు వాహనాలు ధ్వంసం
తాడిపత్రిటౌన్: అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఆదివారం వినాయక నిమజ్జన వేడుకల్లో టీడీపీ నేతలు జేసీ ప్రభాకర్‌రెడ్డి, కాకర్ల రంగనాథ్ వర్గీయుల మధ్య గొడవ చోటు చేసుకుంది. టీడీపీకి చెందిన రెండు వర్గాల వారు నువ్వెంతంటే నువ్వెంత అంటూ రాళ్లు రువ్వుకోవడంతో వినాయక శోభాయాత్రకు వచ్చిన పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. విగ్రహాలను చూసేందుకు వచ్చిన మహిళలు, పిల్లలు, ప్రజలు భయంతో పరుగులు పెట్టారు. వివరాల్లోకి వెళితే.. టీడీపీకి చెందిన మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డికి, అదే పార్టీకి చెందిన కాకర్ల రంగనాథ్‌కు మధ్య వైరం కొనసాగుతోంది.
వినాయక చవితి సందర్భంగా రెండు వర్గాల వారు పోటాపోటీగా గణేశ్ మండపాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆదివారం నిమజ్జన వేడుకల్లో భాగంగా పట్టణంలోని అన్ని వినాయక మండపాల నిర్వాహకులు స్థానిక సీబీ రోడ్డుపై శోభాయాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో ప్రజలు, మహిళలు, పిల్లలు పెద్దసంఖ్యలో పాల్గొని డ్యాన్స్‌లు చేస్తూ సందడి చేశారు. అయితే.. పోలీస్ స్టేషన్ సర్కిల్ నుంచి కాకర్ల రంగనాథ్‌కు చెందిన శోభాయాత్ర వాహనం ముందుకు వచ్చిన జేసీ ప్రభాకర్‌రెడ్డి పలుమార్లు తన అనుచరులతో కలసి వచ్చి.. త్వరగా ముందుకు వెళ్లాలంటూ రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు.
అశోక్ పిల్లర్ సమీపంలోకి రాగానే జేసీ, కాకర్ల వర్గీయుల మధ్య గొడవ మొదలైంది. రెండు వర్గాల వారు కర్రలు, ఇనుపరాడ్లు, పిడి గుద్దులతో తెగబడ్డారు. కొందరు అక్కడే ఉన్న నాపరాళ్ల బండలను పగులగొట్టి వాహనాలపైకి రాళ్లు రువ్వారు. దీంతో మహిళలు, పిల్లలు భయభ్రాంతులతో పరుగులు పెట్టారు. పోలీసులు వారించినా వినలేదు. రాళ్ల దాడిలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. కొందరికి గాయాలు కూడా అయినట్టు సమాచారం. దీంతో శోభాయాత్రకు బయలుదేరిన వినాయక విగ్రహాలు గంట పాటు రోడ్డుపైనే నిలిచిపోయాయి. చివరికి ఏఎస్పీ రోహిత్‌కుమార్ చౌదరి, సీఐ సాయిప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు రెండువర్గాల వారిని చెదరగొట్టి..పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. జేసీ, కాకర్ల ఇళ్ల వైపు ఎవ్వరూ వెళ్లకుండా బందోబస్తు నిర్వహించారు.
