‘మీ రుద్రాక్షలకు ప్రత్యేక పూజలు చేస్తాం’

Swamiji Thiefs Cheated Farmers And escaped With Money, Gold in In chittoor - Sakshi

‘‘మీ రుద్రాక్షలకు ప్రత్యేక పూజలు చేస్తాం.. మేం  హిమాలయాల్లో పొందిన జ్ఞానంతో వాటిని శక్తివంతం చేస్తాం.. అంతే! ఆ తర్వాత మీరు ఎనలేని సిరి సంపదలతో మీరు తులతూగుతారు.. పూజలో బంగారు నగలు కూడా పెడితే ధన, కనకలక్ష్మి అనుగ్రహం మీకు ప్రాప్తిస్తుంది..’’ అని ఊదరగొట్టడంతో ఆ ఇద్దరు అన్నదమ్ములు వారి చెప్పినట్లే అన్నీ చేశారు. చివరకు పూజాఫలంతో రాజస్థానీయులు అదృశ్యమయ్యారు. తాము మోసపోయామని లబోదిబోమంటూ పోలీస్‌ స్టేషన్‌కు పరుగులు తీయడం బాధితుల వంతైంది.

సాక్షి, మదనపల్లె : రూరల్‌ సీఐ శ్రీనివాసులు, ఎస్‌ఐ దిలీప్‌ కుమార్‌ కథనం .. తిరుపతి మారుతీ నగర్‌కు చెందిన అన్నదమ్ములు రామాయణం మురళి, విశ్వనాథ్‌ మదనపల్లె టమాట మార్కెట్లో రోజూ టమాటాలు కొని తీసుకెళ్తుంటారు. మంగళవారం వారిద్దరూ ఇదే కోవలో ఇక్కడికొచ్చి టమాటాలు లారీలలో తీసుకుని తిరుపతికి వెళుతుండగా బైపాసు రోడ్డులోని తట్టివారిపల్లె జంక్షన్‌ వద్ద ఆరుగురు రాజస్థానీ స్వామీజీల బృందం వారిని ఆపింది. 45–60 ఏళ్ల వయస్కులైన వారి ఆహార్యం చూడగానే పేరున్న స్వామీజీలనే లెవెల్లో ఉండటంతో అన్నదమ్ములు వారికి నమస్కరించారు. మెడలో ఉన్న రుద్రాక్షలు తీసి పూజలో పెడితే, హిమాలయాల్లో పొందిన జ్ఞానంతో వాటికి శక్తిని చేకూర్చి అష్టైశ్వర్యాలు సిద్ధించేలా చేస్తామని వారిని నమ్మించారు. దీంతో సమీపంలోని తమ బంధువుల ఇంటికి స్వామీజీలను తీసుకెళ్లారు.
( చదవండి: ఏకైక సంతానం: తల్లిదండ్రులు బైక్‌ కొనివ్వలేదని..)

వాళ్లు చెప్పిన ప్రకారం రూ.20వేలకు నెయ్యి, టెంకాయలు, కర్పూరం, నిమ్మకాయలు, కుంకుమ, అగరబత్తీలు ఇత్యాది పూజాసామగ్రిని తెచ్చి ఇచ్చారు. హోమగుండం ఏర్పాటు చేశారు. స్వామీజీల సూచన మేరకు అన్నదమ్ములిద్దరూ తమ మెడలోని 60 గ్రాముల బంగారు రుద్రాక్ష మాలలతోపాటు రూ.20వేలను వారికి ఇవ్వడంతో వాటిని పూజలో పెట్టారు. హిందీలో మంత్రాలు పఠిస్తూ హోమం చేశారు. మధ్య మధ్యలో టెంకాయలు కొడుతూ, కర్పూరం, సాంబ్రాణి కడ్డీలు వెలిగిస్తూ షో రక్తి కట్టించారు. ఇలా పూజ చేస్తూ..ఒక్కొరొక్కరే బయటకు వచ్చారు. అన్నదమ్ములు తేరుకునేలోపే స్వామీజీల ముఠా కారులో ఉడాయించింది. దీంతో అనుమానించిన అన్నదమ్ములు పూజస్థలాన్ని పరిశీలించారు. డబ్బు లేకపోవడం, తాము ఇచ్చిన బంగారు రుద్రాక్ష మాలకు బదులు నకిలీమాల ఉండడంతో బావురుమన్నారు. అక్కడే ట్రాఫిక్‌ విధుల్లో ఉన్న రూరల్‌ పోలీసుల ద్వారా సీఐ, ఎస్‌ఐలకు రాజస్తానీ ముఠా మోసాన్ని తెలియజేశారు. కేసు నమోదు చేశారు. నిందితులు బెంగళూరు వైపు వెళ్లినట్లు ప్రాధమిక దర్యాప్తులో తేలడంతో పోలీసు ప్రత్యేక బృందాలు వారి కోసం గాలిస్తున్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top