
మద్యం కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పును ఆక్షేపించిన సుప్రీంకోర్టు
నిందితుడి వాంగ్మూలానికి, సాక్షి వాంగ్మూలానికి తేడా ఉంది..
కృష్ణమోహన్‌రెడ్డి ముందస్తు బెయిల్ తీర్పులో సుప్రీం స్పష్టికరణ
సాక్షి, అమరావతి: మద్యం విధానంపై అక్రమ కేసులో కె.ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్ప ముందస్తు బెయిల్ పిటిషన్లను కొట్టివేసే సమయంలో సహ నిందితుల నేరాంగీకార వాంగ్మూలాలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోవడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. భారతీయ సాక్ష్యాల చట్టం 1872 సెక్షన్ 30 కింద తుది విచారణ (ట్రయల్) సందర్భంగా ఏ వాంగ్మూలాలను అయితే పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందో, వాటిని ముందస్తు బెయిల్, బెయిల్ మంజూరు సమయంలో కూడా పరిగణనలోకి తీసుకోవచ్చని హైకోర్టు చెప్పడాన్ని సుప్రీంకోర్టు ఆక్షేపించింది.
హైకోర్టు అభిప్రాయంతో తాము ఎంతమాత్రం ఏకీభవించలేమని స్పష్టం చేసింది. సహ నిందితుల వాంగ్మూలాలను ముందస్తు బెయిల్, బెయిల్ మంజూరు సమయంలో పరిగణనలోకి తీసుకోవడానికే వీల్లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. సీఆర్‌పీసీ సెక్షన్ 161 కింద వాంగ్మూలం ఇచ్చింది సాక్షా? లేక నిందితుడా? లేక నిందితుడిగా మారే వ్యక్తా? అన్న విషయాన్ని బెయిల్, ముందస్తు బెయిల్ మంజూరు సమయంలో కోర్టు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కొన్ని సందర్భాల్లో 161 వాంగ్మూలం ఇచ్చిన వ్యక్తి నిందితుడు కాకపోవచ్చు.. ఆ తరువాత నిందితుడు కావొచ్చని పేర్కొంది. నేర విచారణ ప్రక్రియలో ఓ నిందితుడి వాంగ్మూలాన్ని సహ నిందితుడికి వ్యతిరేకంగా ఉపయోగించరాదన్నది ప్రాథమిక సూత్రమని తెలిపింది.
రాజకీయ దురుద్దేశాలున్నట్లు పిటిషనర్లు ప్రాథమిక ఆధారాలు చూపారు.. ప్రభుత్వం న్యాయపరమైన పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.. మద్యం కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ కృష్ణమోహన్‌రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయరెడ్డి, వికాట్ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన న్యాయమూర్తులు జస్టిస్ జంషేడ్ బొర్జూర్ పారీ్థవాలా, జస్టిస్ మహాదేవన్‌ల ధర్మాసనం వాటిని కొట్టేసింది.
దర్యాప్తు ప్రాథమిక దశలో ఉన్నందున దాన్ని అడ్డుకోవడం సాధ్యం కాదంటూ పిటిషన్లు కొట్టేసింది. ఇదే సమయంలో మద్యం కేసు నమోదు వెనుక రాజకీయ దురుద్దేశాలున్నట్లు పిటిషనర్లు ప్రాథమిక ఆధారాలను చూపారని, ఇందుకు ప్రభుత్వం న్యాయపరమైన పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ తీర్పునకు సంబంధించిన కాపీ తాజాగా అందుబాటులోకి వచ్చింది. ఈ తీర్పులో ధర్మాసనం నిందితుల వాంగ్మూలాల గురించి పూర్తిస్థాయిలో చర్చించింది.
కస్టడీలో పోలీసులకిచ్చిన వాంగ్మూలానికి ఆమోద యోగ్యత లేదు...
‘భారతీయ సాక్ష్యాల చట్టం సెక్షన్ 24 ప్రకారం సహ నిందితుడిపై మరో నిందితుడు ఇచ్చిన వాంగ్మూలాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు.. ఆ వాంగ్మూలాన్ని ఆ వ్యక్తికి వ్యతిరేకంగా స్పష్టమైన సాక్ష్యంగా రుజువు చేయాల్సి ఉంటుంది. ఈ వాంగ్మూలం భయపెట్టి, బెదిరించి, ప్రలోభపెట్టి తీసుకున్నదై ఉండకూడదు. పోలీసు అధికారికి ఇచ్చిన వాంగ్మూలాన్ని నిందితుడికి వ్యతిరేకంగా ఉపయోగించడానికి వీల్లేదు. పోలీసు అధికారికి ఇచ్చిన వాంగ్మూలం భారతీయ సాక్ష్యాల చట్టం సెక్షన్ 25 ప్రకారం పరిగణనలోకి తీసుకోవడానికి వీల్లేదు. ఈ అంశాలన్నింటినీ కూడా కేసు ట్రయల్ సందర్భంగా పరిశీలించాల్సి ఉంటుంది. నిందితులందరినీ ఉమ్మడిగా విచారించినప్పుడు (జాయింట్ ట్రయల్) మాత్రమే సహ నిందితుల వాంగ్మూలాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. వారిని ఒకే కేసులో, ఒకే కోర్టులో కలిపి విచారిస్తున్న సమయంలోనే వాంగ్మూలాలను పరిగణనలోకి తీసుకోవడం సాధ్యమవుతుంది.
సెక్షన్ 30 కింద అభియోగాలు నమోదు కానప్పుడు, నిందితులను విచారణకు హాజరుపరచనప్పుడు భారతీయ సాక్ష్యాల చట్టం వర్తించదు. ఈ నేపథ్యంలో నిందితుల వాంగ్మూలాన్ని కోర్టులు పరిగణనలోకి తీసుకోజాలవు. ఒకవేళ సహ నిందితుల వాంగ్మూలాన్ని బెయిల్, ముందస్తు బెయిల్ పిటిషన్ల విచారణ సందర్భంగా పరిగణనలోకి తీసుకోవచ్చని అనుకున్నా కేవలం నేరాంగీకార వాంగ్మూలమే కాకుండా సహ నిందితుడిపై ఉన్న ఇతర స్వతంత్ర సాక్ష్యాలను కూడా కోర్టు తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి. సెక్షన్ 25 ప్రకారం కస్టడీలో పోలీసులకిచ్చిన వాంగ్మూలాలకు ఆమోద యోగ్యత లేనందున ఆ వాంగ్మూలాలను సహ నిందితులకు వ్యతిరేకంగా ఉపయోగించరాదు. సెక్షన్ 26 ప్రకారం మేజి్రస్టేట్ సమక్షంలో ఇచ్చిన వాంగ్మూలాన్ని మాత్రమే సహ నిందితులకు వ్యతిరేకంగా ఉపయోగించవచ్చు’ అని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది.
పోలీసు అధికారికి నిందితుడు ఇచ్చిన వాంగ్మూలాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరంలేదు
‘నిందితుడి వాంగ్మూలం సహ నిందితుడిని ఇరికించేలా ఉంటే ఆ వాంగ్మూలాన్ని సీఆర్‌పీసీ సెక్షన్ 161 ప్రకారం పరిగణనలోకి తీసుకోవచ్చా అనే విషయంలో ఎలాంటి అయోమయానికి, గందరగోళానికి తావులేకుండా స్పష్టతనివ్వదలిచాం. ఎఫ్‌ఐఆర్‌లో పేరున్న వ్యక్తిని, నేరం చేసిన వ్యక్తిని పోలీసులు విచారించి సీఆర్‌పీసీ సెక్షన్ 161 కింద అతడి వాంగ్మూలాన్ని నమోదు చేయవచ్చు. అయితే అలా నమోదు చేసిన వాంగ్మూలానికి ఎంతమాత్రం ఆమోదయోగ్యత లేదు. ఇదే విషయాన్ని సాహిబ్ సింగ్‌తో పాటు పలు కేసుల్లో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది.
2022లో ఇంద్రేష్ కుమార్ కేసులో సీఆర్‌పీసీ సెక్షన్ 161 కింద ఇచ్చిన వాంగ్మూలాన్ని సాక్ష్యంగా పరిగణనలోకి తీసుకోరాదని, అయితే బెయిల్ మంజూరు సందర్భంగా పరిగణనలోకి తీసుకోవచ్చునని సుప్రీంకోర్టు, చెప్పింది. ఈ కేసులో పూర్వాపరాల ఆధారంగా ఆ తీర్పునివ్వడం జరిగింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆ తీర్పు కేవలం సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాలకే వర్తిస్తుంది గానీ నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలకు కాదు. ఆ తీర్పులో ఎక్కడా కూడా నిందితులు పోలీసులకిచ్చిన వాంగ్మూలాలను బెయిల్ మంజూరు సందర్భంగా పరిగణనలోకి తీసుకోవాలని చెప్పలేదు. సెక్షన్ 161 కింద ఓ సాక్షి ఇచ్చిన వాంగ్మూలానికి, ఓ నిందితుడు ఇచ్చిన వాంగ్మూలానికి చాలా తేడా ఉంది.
పోలీసు అధికారికి నిందితుడు ఇచ్చిన వాంగ్మూలాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. దాన్ని విస్మరించవచ్చు. నిందితుడి వాంగ్మూలాన్ని సహ నిందితుడికి వ్యతిరేకంగా వాడకూడదన్న న్యాయ సూత్రానికి ఓ మినహాయింపు ఉంది. నిందితుడి వాంగ్మూలం నేరాన్ని రుజువు చేసేదే కాక, అది విశ్వసించేదిగా, ఆధార సహితంగా ఉన్నప్పుడు ఆ వాంగ్మూలాన్ని సహ నిందితుడికి వ్యతిరేకంగా వాడొచ్చు. అయితే నిందితుడి వాంగ్మూలమొక్కటే సరిపోదు. సహ నిందితుడి పాత్రను రుజువు చేసేందుకు ఇతర సాక్ష్యాలు కూడా కావాల్సి ఉంటుంది. ఆ సాక్ష్యాలు నిందితుడి వాంగ్మూలానికి మద్దతునిచ్చేవిగా ఉండాలి. అందువల్ల సహ నిందితుడికి వ్యతిరేకంగా ముఖ్యంగా పోలీసు అధికారి ముందు ఇచ్చిన వాంగ్మూలాలను న్యాయస్థానాలు చాలా జాగ్రత్తగా పరిశీలించాలి’ అని సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది.
నిందితుడి వాంగ్మూలం సహ నిందితుడిని ఇరికించేలా ఉంటే ఆ వాంగ్మూలాన్ని సీఆర్‌పీసీ సెక్షన్ 161 ప్రకారం పరిగణనలోకి తీసుకోవచ్చా? అనే విషయంలో ఎలాంటి అయోమయానికి, గందరగోళానికి తావులేకుండా స్పష్టతనివ్వదలిచాం. ఎఫ్‌ఐఆర్‌లో పేరున్న వ్యక్తిని, నేరం చేసిన వ్యక్తిని పోలీసులు విచారించి సీఆర్‌పీసీ సెక్షన్ 161 కింద అతడి వాంగ్మూలాన్ని నమోదు చేయవచ్చు. అయితే అలా నమోదు చేసిన వాంగ్మూలానికి ఎంతమాత్రం ఆమోదయోగ్యత లేదు. - సుప్రీంకోర్టు
కేవలం సహ నిందితుని కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌ను ఆధారంగా చేసుకుని ఒక వ్యక్తి బెయిల్‌పై నిర్ణయం తీసుకోరాదని తన జడ్జిమెంట్‌లో పలు పేరాల్లో అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అందులోని కొన్ని ...
34. ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ 30 ప్రకారం, ఒక వ్యక్తి తనకు వ్యతిరేకంగా అలాగే మరొకరిని కూడా దోషిగా సూచిస్తూ చేసిన అంగీకారాన్ని (కన్ఫెషన్), వారు ఇద్దరూ ఒకే సమయంలో ఒకే కేసులో సంయుక్తంగా విచారణకు లోనవుతున్నప్పుడు, ఆ కోర్టు ఆ అంగీకారాన్ని పరిశీలనలోకి తీసుకోవచ్చు. అయితే, ఈ అంగీకారాన్ని మాత్రమే ఆధారంగా చేసుకుని మరొకరిని శిక్షించకూడదు. దానిని మిగతా ఆధారాలతో కలిపి పరిశీలించాలి.
39. ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ 30పై హైకోర్టు తనదైన అర్థాన్ని కలిగి ఉంది. సెక్షన్ 30 కింద అంగీకరించదగినదిగా (కన్ఫెషన్) ఉన్న విషయం, ముందస్తు బెయిల్ లేదా సాధారణ బెయిల్ పిటిషన్ పరిశీలన సమయంలో కూడా పరిగణనలోకి తీసుకోవచ్చని హైకోర్టు అభిప్రాయపడింది. అయితే, హైకోర్టు వ్యక్తపరిచిన అభిప్రాయంతో మేము ఏకీభవించడం లేదు. మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్న అభిప్రాయం ఏమిటంటే– అటువంటి ఒప్పుకోలు ఏదైనా ఉన్నా, అది ముందస్తు బెయిల్ లేదా సాధారణ బెయిల్ ఇచ్చే దశలో పరిగణనలోకి తీసుకోరాదు. దీనికి ప్రధాన కారణాలు ఇవే:
(1) ఒక సహ–ఆరోపితుడిపై ఒప్పుకోలు (కన్ఫెషన్) ఆధారంగా నిర్ణయం తీసుకోవాలంటే, ఆ ఒప్పుకోలు చేసిన వ్యక్తిపై ముందు నేరం నిరూపితమవ్వాలి. అది సెక్షన్ 24 వీగిపోకూడదు. లేదా సెక్షన్ 25 ప్రకారం చట్టవిరుద్ధంగా ఉండకూడదు. ఇది పూర్తిగా కోర్టు విచారణ సమయంలోనే తేలుతుంది. కేసు నిరూపణ కోసం విశ్వసనీయ, బలమైన సాక్ష్యాలు కోర్టులో ఉంచాల్సి ఉంటుంది, తద్వారా నేరం స్పష్టంగా నిరూపితం కావాలి. ‘దీపక్ భాయ్ జగదీష్ చంద్ర పటేల్ (వర్సెస్) స్టేట్ ఆఫ్ గుజరాత్ అండ్ అదర్స్ (2019) 16 ఎస్‌సీసీ 547’లో అత్యున్నత న్యాయస్థానం ఇదే విషయాన్ని చెప్పింది. పోలీసు అధికారుల ముందు ఇచ్చిన ఒప్పుకోలు, కోర్టులో సాక్ష్యంగా పరిగణనలోకి తీసుకోరాదు. సెక్షన్ 30 ప్రకారం పరిగణనలోకి తీసుకునే స్టేట్‌మెంట్ సరైనదై ఉండాలి, చట్టబద్ధమైనదై ఉండాలి. ఇది ఈ సెక్షన్ మూల లక్ష్యం.
49. (10) ముందస్తు (యాంటిసిపేటరీ) లేదా సాధారణ (రెగ్యులర్) బెయిల్ విచారణకు సంబంధించి కోర్టు సీఆర్‌పీసీ 161 ప్రకారం పోలీసుల ముందు ఒక వ్యక్తి ఇచ్చిన ప్రకటనను పరిశీలించే ముందు, ఆ వ్యక్తి వాస్తవంగా సాక్షినా, నిందితుడా, లేక భవిష్యత్తులో నిందితుడిగా మారే అవకాశం ఉన్నవాడా అనే విషయాన్ని మొదట తప్పనిసరిగా నిర్ధారించుకోవాలి. ఎందుకంటే 161‑సెక్షన్ ప్రకటన‑ సమయంలో ఆ వ్యక్తి నిందితుడి జాబితాలో లేకపోయినా, దర్యాప్తు కొనసాగుతున్న క్రమంలో తర్వాత అతను నిందితుడిగా చేర్చబడే పరిస్థితులు ఏర్పడవచ్చు.
ఈ నేపథ్యంలో, మొదట సాక్షిగా ఉన్న వ్యక్తి తర్వాత నిందితుడిగా మారవచ్చన్న భావాన్ని కోర్టులు ఎప్పుడూ దృష్టిలో ఉంచుకోవాలి. ఎఫ్‌ఐఆర్‌లో పేరు లేదని మాత్రమే కారణం చెప్పుకుని ఆ వ్యక్తి ప్రకటనపై ఆధారపడితే, అతన్ని నిందితుడిగా చేర్చే దశ వచ్చే వరకు ఆ ప్రకటనను నమ్ముకునే అసంబద్ధ పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే, రికార్డుల ప్రకారం ఆ వ్యక్తిని నిందితుడిగా చేర్చే అవకాశముందని స్పష్టమైన సంకేతాలు కనిపిస్తే, దర్యాప్తు ఏ విధంగానూ ప్రభావితం కాకుండా కోర్టులు ఏ విధమైన అభిప్రాయాన్ని ప్రకటించకుండా జాగ్రత్తగా ఉండాలని మేము హెచ్చరిస్తున్నాము.