
నన్ను కాదని వీసీగా ఎవరొస్తారు?
సెర్చ్ కమిటీలో ఎవరిపేర్లున్నా.. నేనే వీసీ
అవసరమైతే ఎఫ్‌ఏసీ తెచ్చుకుంటా
‘ముఖ్య’నేత ఇలాకాలోని ఓ వర్సిటీ ఇన్‌చార్జ్ వీసీ తీరు
సాక్షి, అమరావతి: ‘రూ.కోటి ఇస్తా.. వీసీ పోస్టు నాదే.. నన్ను కాదని వీసీగా ఎవరొస్తారు.. సెర్చ్ కమిటీ ఎవరి పేరు సిఫారసు చేసినా నేనే వీసీ.. అవసరమైతే వీసీగా పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్‌ఏసీ) ఆర్డర్ తెచ్చుకుంటా’ అని ముఖ్య నేత ఇలాకాలోని ఓ వర్సిటీ ఇన్‌చార్జి వీసీ బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. వాస్తవానికి రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు పూర్తి స్థాయిలో వైస్ చాన్సలర్లను నియమించడంలో ప్రభుత్వం విఫలమవుతోంది. 16 నెలలుగా వర్సిటీల్లో పాలన గాడి తప్పడంతో విద్యా వ్యవస్థ కుదేలవుతోంది.
ఇంకా నాలుగు వర్సిటీలకు వీసీలను నియమించడంలో పిల్లి మొగ్గలు వేస్తోంది.ప్రభుత్వం వీసీల నియామకానికి వర్సిటీలకు విడివిడిగా యూజీసీ, వర్సిటీ, రాష్ట్ర ప్రతినిధులుగా ముగ్గురు సభ్యులతో సెర్చ్ కమిటీ నియమిస్తుంది. సెర్చ్ కమిటీ వీసీ పోస్టు కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ప్రభుత్వానికి మూడు పేర్లు ప్రతిపాదిస్తుంది. అందులో ఒకరిని గవర్నర్ ఆమోదంతో ప్రభుత్వం వీసీగా నియమిస్తుంది. ఈ నేపథ్యంలో ముఖ్య నేత ఇలాకాలోని వర్సిటీ ఇన్‌చార్జి వీసీ మాత్రం సెర్చ్ కమిటీతో సంబంధం లేకుండా వీసీ పోస్టు కోసం మంత్రాంగం నెరుపుతుండటం తీవ్ర చర్చనీయాంశమైంది.
వాస్తవానికి వర్సిటీకి సెర్చ్ కమిటీ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఒక ప్రొఫెసర్ పేరును సిఫారసు చేసినట్లు సమాచారం. అయితే ఎలాగైనా సెర్చ్ కమిటీ నివేదికను పక్కకు తప్పించి, పూర్తి అదనపు బాధ్యత (ఎఫ్‌ఏసీ) ఆర్డర్ తెచ్చుకుని వీసీగా కొనసాగాలని ఆ ఇన్‌చార్జ్ వీసీ భావిస్తున్నట్టు తెలిసింది. అందుకే ఆయన వర్సిటీలో కంటే అమరావతిలోనే ఎక్కువగా ఉంటున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సొంత సామాజిక వర్గానికి కొమ్ము కాస్తారా?
ముఖ్య నేత ఇలాకాలోని వర్సిటీలో అర్హత లేనప్పటికీ సొంత సామాజిక వర్గం కార్డును అడ్డు పెట్టుకుని ఆయన ఇన్‌చార్జి వీసీగా చెలామణి అవుతున్నారని ఇప్పటికే పలు విమర్శలు ఉన్నాయి. దీనికితోడు ఆయనకు ఆచార్యునిగా పదోన్నతిపై కోర్టులో కేసులు ఉండటం గమనార్హం. వాస్తవానికి బోధనేతర విభాగానికి చెందిన వ్యక్తికి ఆచార్యుడిగా ప్రమోషన్ ఇవ్వడమే వర్సిటీ నిబంధనలకు విరుద్ధం అనుకుంటే కూటమి ప్రభుత్వం ఆయన్ను ఏకంగా ఇన్‌చార్జి వీసీని చేసింది.
ఇప్పుడు ఆయన్ని ఏకంగా వీసీగా (ఎఫ్‌ఏసీ) ఎక్కడ నియమిస్తారోనని వర్సిటీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సదరు ఇన్‌చార్జి వీసీ 16 నెలల్లో వర్సిటీ ఆస్తులను పప్పుబెల్లాల మాదిరిగా అమ్మేశారని విమర్శలు మూటగట్టుకున్నారు. దశాబ్దాల నాటి చెట్లను తెగనరికి అడ్డంగా దోపిడీకి పాల్పడటంపై సీఎంవో వరకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీనికి తోడు స్క్రాప్ పేరుతో కంప్యూటర్లు, టేబుళ్లను కారు చౌకగా ఇచ్చేసి భారీగా ముడుపులు దండుకున్నారని వర్సిటీ వర్గాలే విమర్శిస్తున్నాయి.