రాజకీయ దురుద్దేశాలకు తీవ్ర పర్యవసానాలు తప్పవు | Supreme Court Denies Anticipatory Bail To P Krishna Mohan Reddy and K Dhananjaya | Sakshi
Sakshi News home page

రాజకీయ దురుద్దేశాలకు తీవ్ర పర్యవసానాలు తప్పవు

May 17 2025 3:48 AM | Updated on May 17 2025 8:28 AM

Supreme Court Denies Anticipatory Bail To P Krishna Mohan Reddy and K Dhananjaya

మద్యం కేసు వెనుక పక్షపాతం, దురుద్దేశాలను కొట్టిపారేయలేం 

దర్యాప్తును నిష్పాక్షికంగా, పారదర్శకంగా కొనసాగించాలి

సాక్షులను గానీ, సహ నిందితులను గానీ ఫలానా విధంగా వాంగ్మూలం ఇవ్వాలని ఒత్తిడి చేయవద్దు 

బెదిరించడం గానీ, ప్రలోభ పెట్టడం గానీ చేయకూడదు 

వారిపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించడానికి వీల్లేదు.. ఏపీ సీఐడీకి సుప్రీంకోర్టు ఆదేశం 

ఎవరైనా ఇలాంటి ఫిర్యాదుతో మా ముందుకు వస్తే చాలా తీవ్రంగా పరిగణిస్తాం

ఈ దశలో దర్యాప్తులో జోక్యం చేసుకోలేం కనుక ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలకు మధ్యంతర బెయిల్‌ ఇవ్వలేం

సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్య

పిటిషనర్లు రెగ్యులర్‌ బెయిల్‌కు అప్పీల్‌ చేసుకుంటే పూర్వాపరాల ఆధారంగా హైకోర్టు తగిన నిర్ణయం వెలువరించాలి

ఈ కేసు నమోదు వెనుక రాజకీయ దురుద్దేశాలు..పక్షపాతం ఉందని పిటిషనర్లు కొంతమేర ప్రాథమికంగా రుజువు చేయగలిగారు. రాజకీయ దురుద్దేశాలు.. పక్షపాతానికి న్యాయపరమైన పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని తగిన సమయంలో తేలుస్తాం.

థర్డ్‌ డిగ్రీ ఉపయోగించినా.. బెదిరించినా.. ఒత్తిడి చేసినా.. ప్రలోభపెట్టినా వీటిని మేము చాలా తీవ్రంగా పరిగణిస్తాం. నిందితులు, సహ నిందితుల నుంచి వాంగ్మూలాలను సేకరించే సమయంలో దర్యాప్తు సంస్థ కొన్ని సందేహాస్పద పద్ధతులను అనుసరిస్తోంది. పిటిషనర్లు, ఇతర సహ నిందితుల విషయంలో థర్డ్‌ డిగ్రీ ఉపయోగించడం, బెదిరించడం, ఒత్తిడి తేవడం, ప్రలోభపెట్టడం చెయ్యడానికి వీల్లేదు.  

సాక్షి, అమరావతి: ఏపీ మద్యం వ్యవహారంలో కేసు నమోదు వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని, వాటిని ఎంతమాత్రం కొట్టిపారేయలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. రాజకీయ పక్షపాతం, దురుద్దేశాలకు న్యాయపరంగా తీవ్ర పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. అయితే, రాజకీయ దురుద్దేశాల కారణంతో.. నిందితులను కస్టోడియల్‌ ఇంటరాగేషన్‌ చేయకుండా దర్యాప్తు అధికారిని నిరోధించలేమని పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ జంషేడ్‌ బుర్జోర్‌ పార్థివాలా, జస్టిస్‌ ఆర్‌.మహాదేవన్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.\

మద్యం వ్యవహారంలో రిటైర్డ్‌ ఐఏఎస్‌ ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలకు ముందస్తు బెయిల్‌ ఇవ్వలేమని చెబుతూ, వారి పిటిషన్లను కొట్టివేసింది. పిటిషనర్లపై థర్డ్‌ డిగ్రీ ఉపయోగించడానికి వీల్లేదని ఏపీ సీఐడీ అధికారులను సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే, ఫలానా విధంగా వాంగ్మూలం ఇవ్వాలని ఒత్తిడి చేయడం గానీ, బెదిరించడం గానీ, ప్రలోభపెట్టడం గానీ చేయరాదంది. దర్యాప్తును నిష్పాక్షికంగా, పారదర్శకంగా కొనసాగించాలని ఆదేశించింది. పిటిషనర్లు రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసుకుంటే, కేసు పూర్వాపరాల ఆధారంగా విచారించి తగిన నిర్ణయం వెలువరించాలని కింది కోర్టు, హైకోర్టుకు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. విచారణ సమయంలో న్యాయవాదులు ఉండాలనుకుంటే, ఆ అభ్యర్థనతో హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్లకు సూచించింది.  

సీఐడీ దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తున్నారు 
మద్యం కేసులో తమకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ రిటైర్డ్‌ ఐఏఎస్‌ ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై శుక్రవారం జస్టిస్‌ పార్థివాలా ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది.  పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాదులు అభిషేక్‌ మను సింఘ్వీ, వికాస్‌ సింగ్‌ వాదనలు వినిపించారు. మద్యం కేసు నమోదు వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని, ప్రభుత్వం మారగానే కేసు నమోదైందని వారు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. సీఐడీ దర్యాప్తునకు పిటిషనర్లు పూర్తిగా సహకరిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే 13 గంటల చొప్పున వీరిని దర్యాప్తు అధికారి ప్రశి్నంచారన్నారు.  

ఎలాంటి అక్రమాల్లేవనీ సీసీఐ తేల్చింది... 
కొత్త మద్యం కంపెనీలకు అవకాశం కల్పించడం వెనుక అక్రమాలు జరిగాయని సీఐడీ ఆరోపిస్తోందని.. కానీ, ఈ ఆరోపణల్లో వాస్తవం లేదని కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) తేల్చిందని అభిషేక్‌ మను సింఘ్వీ, వికాస్‌ సింగ్‌ పేర్కొన్నారు. సీఐడీ రిమాండ్‌ రిపోర్టులో ఇప్పుడు చేస్తున్న ప్రతి ఆరోపణ.. గతంలో సీసీఐకి చేసిన ఫిర్యాదులో ఉన్నవేనని గుర్తు చేశారు. నాటి ఫిర్యాదును సీసీఐ క్షుణ్నంగా పరిశీలించి క్లీన్‌చిట్‌ ఇచ్చిందని వివరించారు.

ఈ మేరకు సీసీఐ ఉత్తర్వులను వారు ధర్మాసనం ముందు ఉంచారు. అక్రమాలే లేవని తేలిన వ్యవహారంలో సీఐడీ కేసు నమోదు చేసిందని, రాజకీయ కక్ష సాధింపులకు ఈ కేసు ఓ ప్రత్యక్ష ఉదాహరణ అని తెలిపారు. ఈ కేసులో సాక్షులను సీఐడీ పలు రకాలుగా భయపెడుతోందన్నారు. కావాల్సిన విధంగా వాంగ్మూలం ఇవ్వకుంటే నిందితులుగా చేర్చేందుకు కూడా వెనుకాడడం లేదని తెలిపారు. వాంగ్మూలాలు తప్ప సాక్ష్యాలు ఏమీ చూపడం లేదని నివేదించారు. పిటిషనర్లకు మద్యం వ్యవహారంలో ఎలాంటి సంబంధం లేదని, వారు కేవలం ప్రభుత్వ అధికారులుగా సమావేశాల్లో మాత్రమే పాల్గొన్నారని చెప్పారు. ఇదే నేరం అంటూ కేసులు నమోదు చేశారని పేర్కొన్నారు. 

పారదర్శక విధానాన్ని పూర్తిగా మార్చేశారు 
రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాదులు ముకుల్‌ రోహత్గీ, సిద్ధార్థ లూథ్రా, సిద్ధార్థ అగర్వాల్‌ వాదనలు వినిపిస్తూ, ఇదో భారీ కుంభకోణమన్నారు. గతంలో మద్యం కొనుగోళ్లు చాలా పారదర్శకంగా జరిగేవని, గత ప్రభుత్వ హయాంలో దానిని పూర్తిగా మార్చేశారన్నారు. కీలక స్థానాల్లో కావాల్సిన వ్యక్తులను నియమించుకున్నారని తెలిపారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ... రాజకీయ దురుద్దేశాలను, ప్రాథమిక ఆధారాలను ఎలా సమతుల్యం చేస్తారని ప్రశ్నించింది. దీంతో ఇది విచారణకు స్వీకరించదగ్గ నేరమే కాదని వికాస్‌ సింగ్‌ సమాధానం ఇచ్చారు.

ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోర్టును కోరారు.  అలాగైతే ఎఫ్‌ఐఆర్‌ కొట్టివేతకు పిటిషన్‌ దాఖలు చేసుకోవాలని ధర్మాసనం సూచించింది. ఆ పని కచి్చతంగా చేస్తామని వికాస్‌ తెలిపారు. సింఘ్వీ వాదనలు వినిపిస్తూ... పిటిషనర్లు ప్రభుత్వాధికారులుగా పదవీ విరమణ చేశారని, వారు ఎక్కడికీ పారిపోయే అవకాశం లేదని అన్నారు. ఆ అవసరం కూడా వారికి లేదన్నారు. కావాలంటే పాస్‌పోర్ట్‌ జప్తునకు ఆదేశాలు ఇవ్వొచ్చునన్నారు. అలాంటప్పుడు దేశం విడిచివెళ్లిపోతారన్న ఆందోళన అనవసరమని పేర్కొన్నారు. ప్రభుత్వ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా స్పందిస్తూ, ఈ వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కూడా ఈసీఆర్‌ నమోదు చేసిందన్నారు. ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం,  పిటిషనర్లకు ముందస్తు బెయిల్‌ ఇవ్వలేమంటూ పిటిషన్లు కొట్టేసింది.  

బెయిల్‌ పిటిషన్‌ దాఖలుకు గోవిందప్పకు అనుమతి 
వికాట్‌ సంస్థ డైరెక్టర్‌ బాలాజీ గోవిందప్ప అరెస్ట్‌ నేపథ్యంలో తాము దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు ఆయన తరఫు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ దవే సుప్రీంకోర్టుకు వివరించారు. రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌కు అనుమతి కోరగా.. ధర్మాసనం అనుమతిచ్చింది. బాలాజీ గోవిందప్ప రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసుకుంటే కేసు పూర్వాపరాల ఆధారంగా నిర్ణయం వెలువరించాలని కింది కోర్టు, హైకోర్టుకు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ సమయంలో దవే స్పందిస్తూ, ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ పెండింగ్‌లో ఉండగానే గోవిందప్పను అరెస్ట్‌ చేశారన్నారు. ఇది ఏమాత్రం సహేతుకం కాదని, ఇలా అరెస్ట్‌ చేయడం తగదంటూ ఇదే కోర్టు గతంలో స్పష్టమైన తీర్పు ఇచ్చిందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. పరిశీలించాలంటూ సంబంధిత తీర్పు కాపీని ధర్మాసనం ముందు ఉంచారు. ఇప్పుడు ఈ అంశాలన్నీ అవసరం లేదని, తాము బాలాజీ గోవిందప్పకు ముందస్తు బెయిల్‌ ఇవ్వలేదని ధర్మాసనం తెలిపింది.  

సుప్రీంకోర్టు హెచ్చరికలు ఇవీ...  
రాష్ట్ర ప్రభుత్వానికి... ఏపీ మద్యం వ్యవహారంలో కేసు నమోదు వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయి. వాటిని ఎంతమాత్రం కొట్టిపారేయలేం. రాజకీయ పక్షపాతం, దురుద్దేశాలు ఉంటే, వాటికి న్యాయపరంగా తీవ్ర పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

సీఐడీ అధికారులకు..
పిటిషనర్లపై థర్డ్‌ డిగ్రీ ఉపయోగించడానికి వీల్లేదు. ఫలానా విధంగా వాంగ్మూలం ఇవ్వాలని ఒత్తిడి చేయడం గానీ, బెదిరించడం గానీ, ప్రలోభపెట్టడం గానీ చేయరాదు. దర్యాప్తును నిష్పాక్షికంగా, పారదర్శకంగా కొనసాగించాలి.

రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌పై...  
పిటిషనర్లు రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసుకుంటే, కింది కోర్టులు కేసు పూర్వాపరాల ఆధారంగా విచారించి తగిన నిర్ణయం వెలువరించాలి. విచారణ సమయంలో న్యాయవాదులు ఉండాలనుకుంటే, ఆ అభ్యర్థనతో పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించాలి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement