ఏపీ నాకు ఎంతో ప్రత్యేకం | Supreme Court Judge Justice Prashant Kumar Mishra On AP | Sakshi
Sakshi News home page

ఏపీ నాకు ఎంతో ప్రత్యేకం

Jun 18 2023 5:53 AM | Updated on Jun 18 2023 5:53 AM

Supreme Court Judge Justice Prashant Kumar Mishra On AP - Sakshi

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా దంపతులను సన్మానిస్తున్న హైకోర్టు న్యాయవాదులు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు, న్యాయమూర్తులు, న్యాయవాదులు తనపై చూపిన ప్రేమాభిమానాలు చూసి తాను చలించిపోయానని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా తెలిపారు. ఇంతటి ప్రేమాభిమానాలను గతంలో తానెక్కడా చూడలేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా పనిచేసిన కాలం తన జీవితంలోనే మరిచిపోలేని సమయమని ఆయన తెలిపారు. ఇక్కడ సీజేగా పనిచేయడాన్ని తానెంతో ఆస్వాదించానని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తనకెంతో ప్రత్యేకమైనదన్నారు. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశానని చెప్పుకోవడానికి తానెంతో గర్విస్తానని కూడా మిశ్రా చెప్పారు. ఏపీని విడిచివెళ్లడం తనకెంతో బాధగా ఉందని తెలిపారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన సందర్భంగా జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రాకు హైకోర్టు న్యాయవాదులు శనివారం గుంటూరు పరిధిలోని ఓ కన్వెన్షన్‌ సెంటర్‌లో భారీ సన్మాన కార్యక్రమం ఏర్పాటుచేశారు.

జస్టిస్‌ మిశ్రా, ఆయన సతీమణి సుచేతను హైకోర్టు న్యాయవాదులు, వివిధ జిల్లాల న్యాయవాదులు, హైకోర్టు ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ ఆకుల వెంకట శేషసాయి, పూర్వ ఏసీజే జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌కుమార్, హైకోర్టు న్యాయమూర్తులు, అడ్వొకేట్‌ జనరల్‌ ఎస్‌. శ్రీరామ్, అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కె. జానకిరామిరెడ్డి, బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ గంటా రామారావు, రాష్ట్ర పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ యర్రంరెడ్డి నాగిరెడ్డిలతో పాటు పలువురు సీనియర్‌ న్యాయవాదులు పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) చింతల సుమన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.   

వ్యక్తుల కంటే వ్యవస్థ గొప్పది.. 
సన్మానం అనంతరం జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌ సైతం తన సొంత రాష్ట్రమేనన్నారు. తాను ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యే నాటికి హైకోర్టులో కొన్ని క్లిష్టమైన సమస్యలున్నాయని, వాటిని తన సహచర న్యాయమూర్తులు, న్యాయవాదులు, ఉద్యోగుల సహకారంతో పరిష్కరించానన్నారు. వ్యక్తుల కంటే వ్యవస్థ గొప్పదని, మంచి వ్యవస్థని తయారుచేస్తే మంచి వ్యక్తులు తయారవుతారని తెలిపారు.

హైకోర్టు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రధాన న్యాయమూర్తిగా తనకున్న ప్రత్యేక అధికారాన్ని ఉపయోగించానన్నారు. ఇక తనకిప్పుడు న్యాయవాదులు చేసిన ఈ  సన్మానాన్ని తన జీవితంలో ఇప్పటివరకు చూడలేదన్నారు. రాబోయే రోజుల్లో ఏపీ హైకోర్టు భవిష్యత్తు ఎంతో అద్భుతంగా ఉంటుందని జస్టిస్‌ మిశ్రా చెప్పారు. భవిష్యత్తులో తనకు ఏపీ కోసం పనిచేసే అవకాశమివ్వాలని భగవంతుడిని కోరుకుంటున్నానని జస్టిస్‌ మిశ్రా చెప్పారు.   

జస్టిస్‌ మిశ్రా గొప్ప మానవతావాది.. 
అంతకుముందు.. ఏసీజే జస్టిస్‌ శేషసాయి మాట్లాడుతూ, పేరులో ఉన్నట్లు జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా ఎప్పుడూ ప్రశాంతంగానే ఉంటారన్నారు. ఆయన సార్థక నామధేయుడని తెలిపారు. ప్రతీ విషయంపట్ల ఆయనకు ఎంతో లోతైన అవగాహన ఉందన్నారు. ఆయనో గొప్ప మానవతావాదని తెలిపారు. జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ.. జస్టిస్‌ మిశ్రాకు ఎన్నో గొప్ప లక్షణాలున్నాయన్నారు.

ప్రతీ విషయంలో మంచి చెడుల గురించి గొప్పగా ఆలోచిస్తారని, ఎదుటి వ్యక్తి చెప్పే మాటలను శ్రద్ధగా వింటారని తెలిపారు. అదే సమయంలో కీలక నిర్ణయాలను వేగంగా కూడా తీసుకుంటారని చెప్పారు. జస్టిస్‌ మిశ్రాను టీం లీడర్‌గా ఆయన అభివర్ణించారు.

ఏజీ శ్రీరామ్, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు జానకిరామిరెడ్డి, అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ గంటా రామారావు, సీనియర్‌ న్యాయవాదులు పి. వీరారెడ్డి, ఎస్‌ఎస్‌ ప్రసాద్, కె. చిదంబరం, హైకోర్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు అక్కెన వేణుగోపాలరావు తదితరులు జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా గురించి, ఆయన న్యాయవ్యవస్థకు అందించిన సేవల గురించి మాట్లాడారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ నాగిరెడ్డి వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement