
21 మంది విద్యార్థులు ఆస్పత్రిపాలు
అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘటన
తరచూ పురుగులు వస్తున్నాయి
విద్యార్థులకు వైఎస్సార్‌సీపీ నేతల పరామర్శ
ఎటపాక: కూటమి ప్రభుత్వంలో పిల్లలకు అందించే మధ్యాహ్న భోజనం నానాటికీ నాసిరకంగా మారుతోంది. ఇటీవల మధ్యాహ్న భోజనంలో బొద్దింకలు, పురుగులు రాగా, ఇప్పుడు అల్లూరి సీతారామరాజు జిల్లాలో భోజనం వికటించి 21మంది పిల్లలు ఆస్పత్రి పాలయ్యారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం గౌరిదేవిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం సరిగా ఉడకని భోజనం తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
ఉపాధ్యాయులు తెలిపిన వివరాల ప్రకారం..
పాఠశాలలో 3 నుంచి 10వ తరగతి వరకు 139 మంది చదువుకుంటున్నారు. మెనూ ప్రకారం శుక్రవారం మధ్యాహ్న భోజనంలో 122 మందికి పులిహోర, టమాట చట్నీ, కోడిగుడ్డు, చిక్కీ అందించారు. పులిహోర సరిగా ఉడకకపోవడంతో చాలమంది విద్యార్థులు తినకుండానే బయట పారబోశారు. కొద్ది సమయం తరువాత పులిహోర తిన్న విద్యార్థుల్లో కొందరికి కడుపులో నొప్పి వచ్చింది. దీంతో హుటాహుటిన 21 మంది విద్యార్థులను పాఠశాల పక్కనే ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు.
బాధితుల్లో మూడు, నాలుగు తరగతులకు చెందిన రామలక్ష్మి, ప్రేమిక, లోకేశ్‌కు వాంతులు కూడా అవుతుండటంతో వారికి అత్యవసర వైద్యసేవలు అందించారు. కాసేపటికి వీరంతా కోలుకున్నారు. వంట కారి్మకుల నిర్లక్ష్యం కారణంగా తరచూ భోజనంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. ఎంఈఓ సరియం రాజులు పాఠశాలకు వచ్చి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ ఘటనపై పూర్తి విచారణ చేపట్టాలని ఎంఈఓను చింతూరు ఐటీడీఏ పీఓ అపూర్వభరత్ ఆదేశించారు. మరోవైపు.. అస్వస్థతకు గురైన విద్యార్థులను వైఎస్సార్‌సీపీ నేతలు పరామర్శించారు. వంటòÙడ్డు లేకపోవడంతో వంట చేసే సమయంలో పురుగులు పడుతున్నాయని ఆరోపించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం పెట్టాలని.. రాజకీయాలకు తావులేకుండా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని వారు డిమాండ్ చేశారు.