కథ కంచికి.. మనం ఇంటికి!

Stories Is Mental Perfect To Children - Sakshi

అందమైన కాల్పనిక లోకం 

సృజనాత్మకతకు సుందర రూపం

ఎల్లలు లేని ఊహా ప్రపంచం

లేని.. రెక్కల గుర్రంపైకి ఎక్కించేది

సందేహాలకు ‘అనగనగా ఓ’ సమాధానమే కథ

కథ చదవడం ఆసక్తి అయితే.. కథ చెప్పడం గొప్ప ఆర్ట్‌. సంపూర్ణ బాల్యానికి కథ పునాది. చిన్నారుల్లో దీక్ష, పట్టుదల, జ్ఞాన సముపార్జన, మంచి చెడుల మధ్య వ్యత్యాసం, మానవ సంబంధాల గొప్పతనాన్ని కథ కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. గతంలో ప్రతి ఇంటిలో అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్యలు గొప్ప కథకులుగా ఉండేవారు. కథ ఎంపిక దగ్గర నుంచి దానిని చిన్నారులకు అర్థమయ్యేలా, వారిని ఆకట్టుకునేలా వివరించడంలో ఇప్పటి సినిమా స్క్రీన్‌ ప్లే రైటర్స్‌ కంటే అద్భుతంగా నడిపించేవారు.  

తెనాలి : ‘అనగనగా’.. అంటూ మొదలు పెట్టి సాఫీగా వెళ్తున్న కథను ఒక్కసారిగా ఆపి.. చిన్నారుల ఆలోచనా శక్తికి కథకులు పదనుపెట్టే వారు. కథలోని ట్విస్టే ఉలిక్కిపడేలా ఉత్సుకతను పెంచి ఆ ట్విస్ట్‌ని బయటపెట్టి పిల్లలను ఆశ్చర్యపరిచి ఆనందాన్ని అందిచేవారు. ఒక రాజు కథలో.. ‘ఏడు చేపలు’ గురించి ఏడు తరాలు చెప్పుకునేవారు. ‘నాన్నా పులి’ అంటూ చిన్నారి కేకలో.. ముందు నవ్వును పంచి.. కన్నీటి నీతిని బయటపెట్టేవారు. ఇతరుల శక్తిని తక్కువ అంచనా వేయవద్దంటూ ‘కుందేలు–తాబేలు’ పోటీని వినిపించేవారు. ‘మాట తప్పని ఆవు’ గురించి చెప్పి మాట విలువను పెంచేవారు. ‘పంచతంత్ర’లో విజ్ఞాన్ని పంచి.. ‘చందమామ’లో జానపథాన్ని వినిపించి.. ‘అక్బర్‌ బీర్బల్‌’.. తెనాలి రామకృష్ణుడి తెలివిని వినిపించి, ‘ఇంద్రజాలాన్ని’ పరిచయం చేసి కథతోనే కథను చెప్పించి.. బాలలకు వినోద, విజ్ఞానాన్ని అందించేవారు.

తరాలు మారడంతో.. 
కానీ, ఇప్పుడు తరాలు మారాయి. ఆ కథలు కలగా మిగిలిపోయాయి. అమ్మమ్మ, నాయనమ్మ ఒడిలో చిన్నారులు నిద్రపోవడం లేదు. సాయంత్రం వేళ సరదా కబుర్లు లేవు. కుటుంబ వ్యవస్థ చిన్నదైపోయింది. పని ఒత్తిడిలో ఎవరికివారే యమునా తీరే. పుస్తకాలు చదివే అలవాటు లేకపోవడంతో ఎప్పుడైనా ఏదైనా కథ చెప్పాలనిపించినా ఏదీ గుర్తుకురాదు. నేటి పాఠశాల విద్యలో పుస్తకాలతోపాటు మోసుకొచ్చే హోంవర్క్‌తోనే పిల్లల కళ్లమీదకు నిద్ర ముంచుకొస్తోంది. ఇక కథలకు ఆస్కారం ఎక్కడ!  ఈ క్రమంలోనే తనను వినిపించేవారు, వినేవారు లేక కథ మూగబోయింది. లోగిళ్ల నుంచి దూరమైపోంది.
  
కొత్త రూపు దాల్చిన కథ 
ప్రస్తుతం కథ.. కొత్త రూపుదాల్చింది. ‘తెర’బొమ్మగా మారింది. సినిమాలు, నాటికలు, షార్ట్‌ఫిల్మŠస్‌గా కనిపిస్తోంది. కాలక్షేపంగా కార్టూన్‌ సినిమాలు, వీడియో గేమ్‌లలోకి వచ్చేసింది. మొబైల్‌/టీవీలకు అతుక్కుపోతున్న పిల్లలకు కంటి సమస్యలు రావడం తప్ప కథా విషయాలు తెలియడం లేదు. కథ చెప్పడంలో కొత్త మార్పులొచ్చాయి గానీ నీతిని, జ్ఞానాన్ని పంచడంలో నేల విడిచి సాము చేస్తున్న చందంగా తయారైంది.  

పిల్లల్ని కథలకు దగ్గర చేద్దాం.. 
విధి ఎంత విచిత్రమో!.. ‘కథ’ కంచికి వెళ్తే.. ‘మనం’ ఇంటికి వచ్చాం. కరోనా లాక్‌డౌన్‌లో కుటుంబం మొత్తం ఒకే చోటుకు చేరింది. వ్యక్తుల మధ్య దూరం తగ్గి ప్రేమానురాగం బలపడింది. పెద్దల సంగతి అలా ఉంటే బడుల కెళ్లాల్సిన చిన్నారులకు మరే అవకాశం లేదు. కేవలం ఇళ్లకే పరిమితమయ్యారు. పాఠశాలలు ఎప్పుడు తెరుస్తారో  తెలీదు. ఆన్‌లైన్‌ పాఠాలు చెవికెక్కుతున్నా, మెదడుకు ఎక్కేది ఎంతవరకు అన్నదీ ప్రశ్నే! ఎటుతిరిగి పెద్దోళ్లు, పిల్లలు ఇంటిలోనే గడుపుతున్న ఈ కాలంలో పిల్లల్ని, కథల్లోకి తీసుకెళ్లగలిగితే, సెలవులు సద్వినియోగమైనట్టే. అపరిమిత విలువలు, జ్ఞానం, ఆలోచనాశక్తిని అందించినట్టే. మరోవైపు వెబ్‌సైట్, యూట్యూబ్‌ చానళ్లలో కూడా తెలుగు కథలు లభిస్తున్నాయి. 

నెట్టింట్లో కథలు.. 

  help@pratham.org 
  podupukathalu.blogspot.com 
  indianepicstories.blogspot.in 
 telugupennidhi.com     
  telugu& velugu.net 
  forkids.in 
telugumalika.blogspot.com 

యానిమేషన్‌ రూపంలో కథలు అందిస్తున్న యూట్యూబ్‌ ఛానళ్లు 
  fairy toonz telugu 
  bommarillu videos 
 kids planet 
  bhul bhul 
  fairy toonz telugu 
 bommarillu videos 
 kids planet 
  bhul bhul 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top