తొలి రోజే ఫ్లాప్‌ షో | State govt failed miserably on the first day of organizing Dussehra celebrations | Sakshi
Sakshi News home page

తొలి రోజే ఫ్లాప్‌ షో

Oct 12 2026 5:34 AM | Updated on Oct 12 2026 5:34 AM

State govt failed miserably on the first day of organizing Dussehra celebrations

దుర్గమ్మ దర్శనానికి భక్తులకు తీవ్ర కష్టాలు

ప్రభుత్వ ప్రచారం ఘనం.. ఆచరణ శూన్యం.. గంటల తరబడి క్యూలో తల్లడిల్లిన మహిళలు, పిల్లలు, వృద్ధులు 

మంచి నీళ్ల సరఫరాలోనూ విఫలం.. ఫ్యాన్లూ లేక ఉక్కపోతతో విలవిల 

భక్తుల సంఖ్యపై కనీస అంచనా లేకపోవడంతోనే ఇక్కట్లు 

ఇవేం ఏర్పాట్లయ్యా.. అంటూ టీడీపీ ఎంపీని నిలదీసిన భక్తులు.. 

మరోవైపు వీఐపీల సేవలో తరించిన అధికార గణం 

సర్కారు తప్పిదానికి సీఎఫ్‌ఓ మూల్యం    

సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడలోని దుర్గ గుడిలో దసరా ఉత్సవాల నిర్వహణలో తొలి రోజే రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. మైసూర్‌ తర్వాత ఇక్కడే అత్యంత అద్భుతంగా చేస్తున్నామంటూ నెల రోజుల నుంచి ప్రభుత్వ పెద్దలు ఊదరగొట్టారు. రాష్ట్రపతి, 11 మంది ముఖ్యమంత్రులు, పెద్ద ఎత్తున కేంద్ర మంత్రులను ఆహ్వానించారు. ఎంత మంది వీఐపీలు వచ్చినా, భక్తుల దర్శనానికి ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా చూస్తామని చెప్పారు. అయితే తీరా.. పదే పదే విజనరీగా చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన ఇంటికి కూతవేటు దూరంలో జరుగుతున్న ఈ ఉత్సవాలను నిర్వహించడంలో తొలి రోజే విఫలమయ్యారు.

భక్తులకు అవససరమైన ఏర్పాట్లు చేయడంలో దుర్గగుడి అధికారులతో పాటు పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులు చేతులెత్తేశారు. ఉత్సవాలు ప్రారంభమైన కొద్ది గంటల్లోనే భక్తులకు క్యూలైన్‌లోనే అధికారులు చుక్కలు చూపించారు. గంటల తరబడి క్యూలైన్లలో నిలబడి, ఎండకు తట్టుకోలేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తొలి రోజు ఆదివారం కావడం, ఈ ఉత్సవాల నిర్వహణపై ప్రభుత్వం, అధికార యంత్రాంగం ఊదరగొట్టడంతో భక్తులు పోటెత్తారు. దుర్గమ్మ దర్శనానికి తెల్లవారుజామున 2 గంటల నుంచే భక్తులు క్యూలో వేచి ఉన్నారు. వారికి దర్శనం అయ్యే సరికి మధ్యాహ్నం 12 గంటలు దాటింది. అంతే ఏకంగా 10 గంటలు పట్టింది. తర్వాత కూడా సరైన నిర్వహణ లేకపోవడంతో అమ్మవారి దర్శనానికి నాలుగు నుంచి ఐదు గంటలు పట్టిందంటే నిర్వహణ ఎలా ఉందో ఇట్టే అర్థమవుతోంది. 

‘ఉదయం ఐదు గంటల నుంచి క్యూలో ఉన్నాం. ఇప్పుడు 10 గంటలైంది. ఇంకా కొండ దగ్గరకు రాలేదు. మంచి నీళ్లు లేవు.. బయటకు వెళ్లటానికి వీలు లేదు.. టాబ్లెట్‌ వేసుకోవాలన్నా అవకాశం లేదు.. ఇలాగైతే ఎలా.. మా లాంటి ముసలోళ్ల పరిస్థితి ఏమిటి?’ అంటూ దుర్గమ్మ దర్శనానికి వచ్చిన ఒక భక్తురాలు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేసింది. దసరా ఉత్సవాలకు 25 లక్షల మంది వస్తారని పదేపదే ప్రకటనలు గుప్పించిన అధికారులు.. తొలి రోజే అనేక విమర్శలు ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది. తొలి రోజు ఎంత మంది భక్తులు వస్తారు.. సెలవు రోజైతే పరిస్థితి ఏమిటి.. అనే అంశాలపై ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకోక పోవటంతో మొదటి రోజు భక్తులకు తీవ్ర ఇబ్బంది ఎదురైంది.

టీడీపీ ఎంపీని నిలదీసిన భక్తులు
దసరా ఉత్సవ ఏర్పాట్లు పరిశీలించడానికి వచ్చిన విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని చిన్నిని భక్తులు నిలదీశారు. ఇవేం ఏర్పాట్లయ్యా.. అని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్సవాల సమయంలో భక్తులకు ఏవైనా సమస్యలు ఎదురైతే తక్షణమే స్పందించేందుకు అధికార యంత్రాంగం 24 గంటల పాటు అందుబాటులో ఉంటుందని చెప్పినా ఎవరూ క్యూలైన్లలో ఉన్న భక్తుల విషయం పట్టించుకోలేదు. కేవలం వీఐపీల సేవలో తరించడానికే తమ శక్తియుక్తులను ధారపోశారు. 

క్యూఆర్‌ కోడ్‌ ద్వారా కూడా భక్తుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తామని, ఎక్కడైనా సమస్య ఉందని సమాచారం అందిస్తే యుద్ధ ప్రాతిపదికన పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఉదయం నుంచి క్యూఆర్‌ కోడ్, ఐవీఆర్‌ఎస్‌కు భక్తుల నుంచి సదుపాయాల కల్పనలో వైఫల్యం చెందారంటూ పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి. అయినా తూతూ మంత్రంగా తాత్కాలిక చర్యలు తీసుకున్నారే తప్ప చిత్తశుద్ధి కనిపించ లేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

జోరుగా వీఐపీ దర్శనాలు
ఈ ఏడాది ఉత్సవాల్లో ఎటువంటి వీఐపీ దర్శనాలు ఉండవని పోలీసు, రెవెన్యూ శాఖ అధికారులు చెప్పినా, అమలు మాత్రం మరిచారు. ఉదయం దర్శనం ప్రారంభమైనప్పటి నుంచే ప్రముఖులు, రాజకీయ నాయకులకు తోడు పోలీసు, రెవెన్యూ శాఖకు చెందిన వారు క్యూ కట్టారు. కొండపైకి పరిమిత సంఖ్యలోనే వాహనాలను అనుమతించేలా పాసులను జారీ చేశామని చెబుతున్న దేవస్థానం.. అందుకు విరుద్ధంగా వ్యవహరించింది. ఇందుకు ఆదివారం కొండపై ఉన్న వాహనాలే నిదర్శనం. మొత్తంగా ప్రభుత్వ ప్రకటనలకు, క్షేత్ర స్థాయిలో పరిస్థితికి పొంతన లేకుండా పోయింది.

మీడియా ప్రతినిధుల ధర్నా
వన్‌టౌన్‌/ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): దసరా ఉత్సవాలకు చంద్రబాబు కూటమి ప్రభుత్వం పాత్రికేయులను దూరంగా ఉంచి ఇన్‌ఫ్లుయెన్సర్లకే ఎక్కువ పాస్‌లు ఇవ్వడాన్ని నిరసిస్తూ పత్రికల ప్రతినిధులు ఆదివారం ధర్నా చేశారు. పెద్ద మీడియా సంస్థలకు అరకొరగా పాస్‌లు జారీచేసిన అధికారులు చిన్నపత్రికలు, లోకల్‌ చానళ్లు, సీనియర్‌ జర్నలిస్టులు తదితరులకు పాస్‌లు నిరాకరించారు. దీంతో మీడియా ప్రతినిధులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, కలెక్టర్‌ లక్ష్మీశ, పోలీస్‌ కమిషనర్‌ రాజశేఖరబాబు వారి వద్దకు వచ్చి పరిశీలించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ ఏడాది దసరా ఉత్సవాలను ప్రచారం చేసే బాధ్యతను వందమందికిపైగా సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు అప్పగించినట్లు తెలిసింది.

సర్కారు తప్పిదానికి సీఎఫ్‌ఓ మూల్యం
వన్‌టౌన్‌ (విజయవాడపశ్చిమ): శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థా­నం ఆధ్వర్యంలో జరుగుతున్న శరన్నవరాత్రి మహోత్సవాలను నిర్వహించడంలో చంద్రబాబు ప్రభుత్వం తొలి రోజే విఫలమవ్వడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో సర్కారు.. తన తప్పిదాన్ని చీఫ్‌ ఫెస్టివల్‌ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్న చంద్రశేఖర్‌ ఆజాద్‌పైకి నెట్టేసింది. ఈ క్రమంలో ఆ బాధ్యతల నుంచి ఆయన్ను తప్పించింది. ఆయన స్థానంలో ద్వారకా తిరుమల వేంకటేశ్వరస్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి త్రినాథ్‌ను నియమించింది.  

ఇబ్బందులు ఇలా
» హోల్డింగ్‌ పాయింట్లలో, క్యూలైన్‌లో మంచి నీటి సదుపాయం కల్పించలేదు. ఫలితంగా మహిళలు, చిన్న పిల్లలు అల్లాడిపోయారు.  
»  భక్తులకు ఏ సమయానికి అమ్మవారి దర్శనం అవుతుందనే విషయాన్ని డిస్‌ ప్లే చేస్తామని చెప్పి.. చేయలేదు.
»  వాటర్‌ బబుల్స్‌ విధానం పూర్తిగా విఫలమైంది. 
»  క్యూలైన్‌లో గంటల తరబడి వేచి ఉన్న భక్తులు ఉక్కపోతతో అల్లాడారు. కనీసం ఫ్యాన్లు కూడా ఏర్పాటు చేయలేదు. 
» క్యూలైన్లలో పలువురు భక్తులు స్పృహ తప్పి పడిపోయారు.
»  భక్తులు తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను సెల్‌ఫోన్ల ద్వారా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో ప్రభుత్వం సాయంత్రం గానీ స్పందించ లేదు.  
»  గంటల తరబడి లైన్లలో ఉన్న వారికి కనీసం అన్న ప్రసాదాలు కూడా అందజేయలేకపోయారు.
» భక్తుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం కావడంతో సాయంత్రం తర్వాత ఓం టర్నింగ్‌ వద్ద పాలు, బిస్కెట్లు అందించారు. 
» పోలీసు, రెవెన్యూ, ఆలయ అధికారుల మధ్య సమన్వయ లోపం వల్ల ఎక్కడ ఏం జరుగుతుందో వెంటనే తెలియలేదు.

కొందామన్నా మంచి నీళ్లు లేవు
క్యూలైన్‌లో ఎక్కడా మంచి నీళ్లు లేవు. గంటల కొద్దీ సమయం పట్టినప్పుడు అధి­కా­రులు కనీసం మంచి నీళ్ల­యినా అందించాలి. కనీ­సం డబ్బులు పెట్టి కొనుగోలు చేద్దామన్నా క్యూలైన్ల దగ్గరలో అమ్మడం లేదు. నీళ్లు లేక దాహంతో అందరం చాలా ఇబ్బంది పడ్డాం. ఉత్స­వాలను ఘనంగా చేస్తున్నామంటూనే ఇన్ని ఇబ్బందులా? – సుబ్బారావు, భక్తుడు, విజయవాడ

మాలాంటి ముసలోళ్ల పరిస్థితి ఏమిటి?
క్యూలైన్‌లో ఎవ­రూ పట్టించుకోవడం లేదు. ఇంతసేపు ఇలా వదిలేస్తే మాలాంటి ముసలోళ్ల పరిస్థితి ఏమిటి? ఐదు గంటలకు పైగా క్యూలైన్‌లో ఉన్నాం. ఇంకా దర్శనం కాలేదు. ఇలా అయితే ఎలా? ప్రభుత్వం నిర్ణయాలను పునఃసమీక్షించుకోవాలి.   – 70 ఏళ్ల వృద్ధురాలు, విజయవాడ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement