స్నేక్‌హితుడు..! | snake catching skills and training | Sakshi
Sakshi News home page

స్నేక్‌హితుడు..!

Sep 29 2025 9:47 AM | Updated on Sep 29 2025 9:47 AM

snake catching skills and training

పాములు పట్టడంలో నేర్పరి వేణుగోపాలరావు 

10 వేలకుపైగా పాములు పట్టిన నైపుణ్యం

 శ్రీకాకుళం జిల్లా: ఆయన ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించాడు. ఓ వైపు సాగు చేస్తూనే.. మరోవైపు ఎల్రక్టీషియన్, మెకానిక్‌గా కూడా రాణిస్తున్నాడు. అన్నింటికీ మించి అలవోకగా పాముల ను పట్టే నేర్పరి. అలాగని ఎక్కడా శిక్షణ తీసుకోలేదు. ఎవరి వద్ద శిష్యరికం చేయలేదు. కానీ బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు సాధించాడు హిరమండలం మండలం ఎం.అవలంగికి చెందిన లోలుగు వేణుగోపాలరావు. ఇప్పటివరకు 10 వేలకుపైగా పాములను పట్టి సురక్షిత ప్రాంతాల్లో విడిచిపెట్టిన ఘనత ఆయనది. ఆయనను ‘సాక్షి’ పలకరించగా ఆసక్తికర విషయా లను వెల్లడించారు.  

20 ఏళ్ల వయస్సులోనే ఆసక్తి 
వేణుగోపాలరావుకు ప్రస్తుతం 55 ఏళ్ల వయస్సు. 20 ఏళ్లలోనే పాములు పట్టాలన్న ఆసక్తి పెరిగింది. చిన్నప్పుడు వ్యవసాయ పనుల్లో భాగంగా ఎంతోమంది పాముకాటుకు గురై అవస్థలు పడిన ఘటనలు చూసిన వేణుగోపాలరావుకు మనస్సు కలచివేసిందట. అదే సమయంలో పాములను చంపేస్తున్న ఘటనలు చూసి బాధపడేవాడు. దీంతో అప్పుడే పాములు పట్టాలన్న ప్రయత్నం మొదలుపెట్టారు. ఎక్కడైనా పాములు కనిపిస్తే పెద్ద సంచులు, గొట్టాలతో పట్టడం, వాటికి ఉరి వేసి బంధించడం క్రమేపీ అలవాటు చేసుకున్నాడు. అలా ఆయన ప్రస్థానం 35 ఏళ్ల కిందట ప్రారంభమైంది. 

అలాగే యూట్యూబ్, ఇంటర్నెట్‌ అందుబాటులోకి వచ్చాక పాములు పట్టడంలో మరిన్ని మెలకువలు నేర్చుకున్నారు. క్రమేపీ చాకచక్యంగా పాములు పట్టడంలో సిద్ధహస్తుడిగా మారిపోయాడు. 2018 తితిలీ తుపాను సమయంలో ఏకంగా 1,500 పాములు పట్టి రికార్డు సృష్టించాడు. సాధారణంగా ఏడాదికి 500 వరకూ పాములు పడుతుంటాడు. శ్రీకాకుళం, విజయనగరంతో పాటు ఒడిశాలోని పర్లాకిమిడి, కాశీనగర్, గుణుపూర్‌కు సైతం వెళ్లి పాములు పడుతుంటారు. అందుకే తన నంబర్‌తో పాటు ప్రత్యేక యూట్యూబ్‌ చానల్‌ సైతం ఏర్పాటు చేశాడు. 

సోషల్‌ మీడియాలో తనను సంప్రదిస్తే వీలైనంత వేగంగా అక్కడకు వెళ్తుంటారు. అయితే పాములు పట్టడం అనేది తనకు ఉపాధి కాదని.. కేవలం మనుషుల ప్రా ణాలు పోకూడదని.. అలాగే జీవహింస లేకుండా చేయాలన్నదే తన ఉద్దేశమని వేణుగోపాలరావు చెబుతున్నాడు. పాములు ప డితే డబ్బులు డిమాండ్‌ ఉండదని.. వారి సంతోషంగా ఇచ్చిందే తీసుకుంటామని చెబుతున్నాడు. ఎక్కడైనా పాములు పట్టాలంటే 93951 42681 నంబర్‌ను సంప్రదించాలని సూచిస్తున్నాడు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement