
ఎట్టకేలకు శాసనసభలో సీఎం చంద్రబాబు ఒప్పుకోలు
ఇన్నాళ్లూ గత ప్రభుత్వం, వైఎస్ జగన్‌పై దుష్ప్రచారం
ఇది అత్యంత చౌక ఒప్పందమని నిపుణుల ప్రశంసలు
విద్యుత్ నియంత్రణ మండలీ సబబేనని పేర్కొంది
దీంతో ఒప్పందం కొనసాగిస్తామని సామాజిక
ఆర్థిక సర్వేలో సర్కారు వెల్లడి.. తప్పని పరిస్థితిలో ఇప్పుడు అసెంబ్లీ వేదికగా సీఎం స్పష్టికరణ
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వ హయాంలో కుదుర్చుకున్న సెకీ ఒప్పందాన్ని రద్దు చేయడం కుదరదని, గ్రీన్ ఎనర్జీతోపాటు అణు విద్యుత్ ఉత్పత్తిపై కూడా దృష్టి సారిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం శాసనసభలో ప్రకటించారు. ఒప్పందాలపై సంతకాలు పెట్టాక వెనక్కి తీసుకుంటే ఫెనాల్టిలు కట్టడంతోపాటు విశ్వసనీయత పోతుందని, అందువల్ల వాటిని కొనసాగించాల్సిన పరిస్థితి నెలకొందని శాసనసభ సాక్షిగా చెప్పుకొచ్చారు.
గత ప్రభుత్వ పనితీరును ప్రశంసిస్తూ రూ.2.49కే యూనిట్ విద్యుత్ ఇస్తామని సెకీ ముందుకు రావడంతోనే అప్పట్లో ఈ ఒప్పందం జరిగిందని, పైగా విద్యుత్ సరఫరా చార్జీలు లేకపోవడం కలిసొచ్చే అంశమని ఎంతో మంది నిపుణులు.. ఎంతగా చెప్పినా వినిపించుకోని కూటమి ప్రభుత్వం కొద్ది నెలలుగా విషం చిమ్మిన విషయం తెలిసిందే. ఈ ఒప్పందం ద్వారా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏదో పెద్ద తప్పు చేసినట్లు ఎల్లో మీడియాలో పుంఖాను పుంఖాలుగా తప్పుడు కథనాలు రాయించి దుష్ప్రచారం చేశారు.
తుదకు ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి ఈ ఒప్పందం సబబే అని స్పష్టంచేసింది. ఈ ఒప్పందాన్ని కొనసాగిస్తున్నట్లు మొన్నటి సామాజిక ఆర్థిక సర్వేలోనూ ప్రభుత్వం ప్రకటించింది. ఇక తప్పని పరిస్థితుల్లో సీఎం చంద్రబాబు సైతం గురువారం విద్యుత్ రంగంపై సభలో జరిగిన చర్చలో ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు.
విద్యుత్ రంగాన్ని గాడిన పెట్టాం
విద్యుత్ రంగాన్ని తొమ్మిది నెలల్లోనే గాడిన పెట్టామని, విద్యుత్ కొనుగోలు ధరను తగ్గించడం ద్వారా రానున్న కాలంలో విద్యుత్ ధరలను పెంచకూడదన్నది తమ లక్ష్యమని ముఖ్యమంత్రి తెలిపారు. ‘క్లీన్ ఎనర్జీ పాలసీ ప్రకటించాక రూ.5.19 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎంఓయూలు కుదుర్చుకున్నాం.
తద్వారా రాష్ట్రంలో 3.66 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. రాబోయే ఐదేళ్లలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించడమే ప్రభుత్వ లక్ష్యం. అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచబోమని చెప్పాం. ఆ మాటకు కట్టుబడి ఉన్నాం. యూనిట్ విద్యుత్ కొనుగోలు ధర రూ.5.16 నుంచి రూ.4.80కి తగ్గించేందుకు ప్రయత్నం చేస్తున్నాం. గత ప్రభుత్వంలో తొమ్మిదిసార్లు విద్యుత్ చార్జీలు పెంచి రూ.32 వేల కోట్ల భారం మోపారు. సోలార్ విద్యుత్ వాడక పోవడంతో రూ.9 వేల కోట్లు నష్టపోయాం’ అని తెలిపారు.

ఎమ్మెల్యేలు చొరవ తీసుకోవాలి
రాబోయే రోజుల్లో విమానాలు, ఓడలు కూడా గ్రీన్ ఎనర్జీతో నడిచేలా రాబోతున్నాయని సీఎం అన్నారు. 500 గిగా వాట్ల గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేస్తామని ప్రధాని మోదీ చెప్పారని, అందులో మనం 160 గిగావాట్లు టార్గెట్‌గా పెట్టుకున్నామని తెలిపారు. పీఎం సూర్యఘర్ ముఫ్తీ బిజీలీ యోజన్ కింద ప్రతి ఇంట్లో కరెంట్ ఉత్పత్తి చేసుకోవచ్చన్నారు.
20 లక్షల ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచితంగా సూర్య ఘర్ కింద 2 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తికి రాయితీ అందిస్తామన్నారు. బీసీలకు కేంద్రం రూ.60 వేలు సబ్సిడీ ఇస్తుంటే, దానికి అదనంగా మరో రూ.20 వేల సబ్సిడీ కలిపి మొత్తంగా రూ.80 వేలు ఇస్తామని చెప్పారు. ఒక్కో నియోజకవర్గానికి 10 వేల ఇండ్లపై సోలార్ రూఫ్‌టాప్‌ల ఏర్పాటుపై ఎమ్మెల్యేలు చొరవ తీసుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment