సీబీఐ దర్యాప్తు కోసం వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకోవడం లేదు
నా సమ్మతి లేకుండానే ఆ పిటిషన్ వేశారు
హైకోర్టులో సాయికృష్ణ తల్లి గాదె విజయలక్ష్మి అనుబంధ పిటిషన్
ఈ కేసులో వాదనల కోసం రిత్విక అనే న్యాయవాదిని పెట్టుకున్నా
ఆమె నాకు తెలియకుండానే ఈ కేసును ఉపసంహరించుకుంటున్నట్లు పిటిషన్ వేశారు
మరో న్యాయవాదిని పెట్టుకునేందుకు ఎన్‌ఓసీ కూడా ఇవ్వలేదు
అందువల్ల ఎన్‌వోసీ లేకుండానే వకాలత్ దాఖలుకు అనుమతివ్వాలని విన్నపం
తాజాగా దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను పరిశీలించిన ధర్మాసనం
ఇందులోని ఆరోపణలు చాలా తీవ్రమైనవి.. వాటి సంగతి తేలుస్తాం..
ఇది చిన్న విషయం కాదు.. రిత్విక వాదనలు విన్నాకే తగిన నిర్ణయం
సదరు న్యాయవాదికి నోటీసు ఇవ్వాలని ఆదేశం
సాక్షి, అమరావతి: ఆది నుంచీ మలుపులపై మలుపులు తిరుగుతున్న కాపు యువకుడు సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో ఊహించని మలుపు చోటు చేసుకుంది. తన కుమారుడు లాకప్‌డెత్ కేసులో సీబీఐ దర్యాప్తు కోసం తాను దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకోవడం లేదని గాదె విజయలక్ష్మి బుధవారం హైకోర్టుకు నివేదించింది. తనకు తెలియకుండా, తన సమ్మతి లేకుండా, ఎలాంటి సూచనలు తీసుకోకుండానే సీబీఐ దర్యాప్తు కోసం గతంలో ఆమె దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు న్యాయవాది కోగంటి రిత్విక పిటిషన్ వేశారని న్యాయవాది గుడివాక వాసుదేవుడు హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
రిత్విక స్థానంలో వాదనలు వినిపించేందుకు తనను విజయలక్ష్మి నియమించుకుని, ఆ మేరకు వకాలత్ ఇచ్చారని ఆయన వివరించారు. తాను ఈ కేసులో హాజరయ్యేందుకు రిత్విక నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) కోరినప్పటికీ, ఆమె స్పందించడం లేదని వాసుదేవుడు కోర్టుకు నివేదించారు. ఎన్‌వోసీతో పాటు కేసు రికార్డులను కూడా ఇవ్వలేదని చెప్పారు. అందువల్ల ఎన్‌వోసీ లేకుండానే వకాలత్ దాఖలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు.
ఆ మేర తాము దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను అనుమతించాలని కోరారు. దీంతో హైకోర్టు, విజయలక్ష్మి తాజాగా దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను పరిశీలించింది. ఇందులోని ఆరోపణలు చాలా తీవ్రమైనవన్న హైకోర్టు, వాటి సంగతి తేలుస్తామని స్పష్టం చేసింది. ఇదేమీ చిన్న విషయం కాదంది. రిత్విక వాదనలు విన్న అనంతరమే తగిన నిర్ణయం తీసుకుంటామని, ఆమెకు నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రవినాథ్ తిల్హరి, జస్టిస్ చింతలపూడి పురుషోత్తం కుమార్ ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
నాకు తెలియకుండానే రిత్విక ఆ పిటిషన్ వేశారు..
తన కుమారుడిని కోర్టు ముందు హాజరు పరిచేలా ఆదేశాలు జారీ చేయాలంటూ సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత సాయికృష్ణ లాకప్‌డెత్ జరిగిందన్న విషయం రూఢీ అయింది. దీంతో ఆమె తన కుమారుడి లాకప్‌డెత్‌పై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఇదిలా ఉండగా, సీబీఐ దర్యాప్తు కోసం తాను దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటానని, అందుకు అనుమతినివ్వాలని కోరుతూ ఈ నెల 14న విజయలక్ష్మి తరఫు న్యాయవాది కోగంటి రిత్విక అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు.
ఇందులో సీబీఐ దర్యాప్తు కోసం వేసిన అనుబంధ పిటిషన్‌తో పాటు హెబియస్ కార్పస్ పిటిషన్‌నూ ఉపసంహరించుంటామని పేర్కొన్నారు. దీనిని పరిశీలించిన జస్టిస్ తిల్హరీ ధర్మాసనం, ప్రధాన పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని ఓ చోట, అనుబంధ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని మరో చోట రాశారని గుర్తు చేసింది. అసలు సీబీఐ దర్యాప్తు కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను ఎందుకు ఉపసంహరించుకోవాలనుకుంటున్నారో వివరిస్తూ తాజాగా పిటిషన్ దాఖలు చేయాలని విజయలక్ష్మిని ఆదేశిస్తూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసిన విషయం తెలిసిందే.
ఐదుగుర్ని అరెస్ట్ చేశాం.. ఒకరు పరారీలో ఉన్నారు..
తాజాగా ఈ కేసు బుధవారం మరోసారి విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా విజయలక్ష్మి తరఫు న్యాయవాది వాసుదేవుడు స్పందిస్తూ జరిగిన విషయాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ, సాయికృష్ణ కేసు దర్యాప్తు పురోగతి ఏమిటని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) సింగమనేని ప్రణతిను ప్రశ్నించింది. మొత్తం ఆరుగురు నిందితుల్లో ఐదుగురిని అరెస్ట్ చేశామని, మరొకరు పరారీలో ఉన్నారని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, విజయలక్ష్మి అనుమతి లేకుండానే సీబీఐ దర్యాప్తు కోసం గతంలో వేసిన పిటిషన్ ఉపసంహరణకు పిటిషన్ వేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యాయవాది రిత్వికకు నోటీసు ఇవ్వాలని వాసుదేవుడిని ఆదేశిస్తూ విచారణను గురువారానికి వాయిదా వేసింది.
దర్యాప్తు పురోగతిని మా ముందుంచండి
సాయికృష్ణ లాకప్‌డెత్‌పై నమోదు చేసిన కేసులో దర్యాప్తు పురోగతికి సంబంధించిన వివరాలను తమ ముందుంచాలని హైకోర్టు బుధవారం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఆదేశించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కృష్ణలంక పోలీస్‌స్టేషన్ అప్పటి ఇన్‌స్పెక్టర్ నాగరాజును పోలీసు కస్టడీకి అప్పగించే విషయంలో సుప్రీంకోర్టు ఏం ఉత్తర్వులిచ్చిందో వాటిని తమ ముందుంచాలని కూడా ఆదేశించింది.
ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. సాయికృష్ణ లాకప్‌డెత్ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ సెంటర్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ కాన్‌స్టిట్యూషనల్ రైట్స్ అధ్యక్షుడు గోచిపాత శ్రీనివాసరావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే.


