
రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతున్న రిటైర్డ్ ఐఏఎస్ విజయకుమార్. పక్కన వడ్డే తదితరులు
వాళ్లకు జీవనోపాధి లేకుండా చేయడమే సీఎం అనుభవమా?
అభివృద్ధి పేరుతో మూడు పంటలు పండే భూములు తీసుకోవడం ఆపాలి
చట్టాలు ఉల్లంఘిస్తూ నిర్బంధంగా భూసేకరణ చేస్తున్నారు
భూకేటాయింపులకు వ్యతిరేకంగా పోరాడాలి
కరేడు రైతు ఉద్యమం దేశానికే దిక్సూచి కావాలి
రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు
‘పేదల పొట్టకొట్టడం, వారికి జీవనోపాధి లేకుండా చేయడం, వాళ్ల ప్రాణాల మీద అవినీతి మేడలు కట్టడమే మీ అనుభవమా?’ అంటూ సీఎం చంద్రబాబు తీరుపై లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి విజయ్‌కుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నాలుగు దఫాలు ముఖ్యమంత్రి, 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునే ముఖ్యమంత్రి విజన్ ఇదేనా అని ప్రశ్నించారు. ఇప్పటికే భూములు ఇచ్చిన కంపెనీకి, మళ్లీ వాటిని మార్చి కరేడులో ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు.
కరేడు రైతులు ఏం పాపం చేసుకున్నారు? మీ విధానం చూస్తుంటే రైతులపై మీకు వ్యక్తిగతంగా ఏదైనా కక్ష ఉందా?’ అని అనుమానం కలుగుతోందన్నారు. విజయవాడ గవర్నర్‌పేటలోని కేఎల్ రావు భవన్‌లో రైతు సంఘాలు, ప్రజా సంఘాలు, న్యాయవాదుల సంఘాల ఆధ్వర్యంలో ‘అభివృద్ధి పేరుతో భూ పందేరం’ అంశంపై ఆదివారం రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది.
న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో విజయ్‌కుమార్ మాట్లాడుతూ.. అవసరానికి మించి మూడు పంటలు పండే భూములు సేకరించడం, వాటిని వినియోగించకపోవడం, అక్కడ ఏ అభివృద్ధీ చేయకపోవడం, రైతులను నిరాశ్రయులను చేయడం వంటి చర్యలతో ఒక విజన్, దార్శనికత లేకుండా ఈ ప్రభుత్వం చరు. ప్రజలు ఐకమత్యంగా ఉన్నప్పుడే ఇలాంటి నిరంకుశ ప్రభుత్వానికి బుద్ధి చెప్పగలుగుతామన్నారు. కేంద్రం వద్ద రాష్ట్ర ప్రభుత్వం సాష్టాంగ పడుతోందని ఎద్దేవాచేశారు.
ఈ నేపథ్యంలోనే విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయాలని ప్రయత్నిస్తోందన్నారు. పోలవరం విషయంలో ఎంతసేపూ రాతి కట్టడం ఎంతవరకు వచ్చిందనే అంశంపై సమీక్షలు చేస్తున్నారేగానీ, అక్కడ నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలు జరిగిందా లేదా అని ఎవరూ పట్టించుకోవడంలేదన్నారు. అలాగే, భూసేకరణ ప్రజాప్రయోజనాల కోసమా లేక ప్రైవేటు కోసమా అనేది కూడా చట్టంలో స్పష్టంచేశారని విజయ్‌కుమార్ వివరించారు. ప్రైవేటు సంస్థల కోసమైతే గ్రామంలో 80 శాతానికి పైగా రైతులు ఒప్పుకుంటేనే భూసేకరణ చేయాలని చట్టం స్పష్టం చేస్తోందన్నారు. – గాందీనగర్ (విజయవాడ సెంట్రల్)
చట్టాలను ఉల్లంఘించి భూసేకరణ
మాజీమంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో అనేక జిల్లాల్లో అభివృద్ధి, పరిశ్రమలు, సెజ్‌ల ఏర్పాటు పేరుతో ప్రభుత్వం వేల ఎకరాలు తీసుకుంటోందన్నారు. సాగునీటి ప్రాజెక్టుల పేరుతో భూమి తీసుకున్నారంటే కొంతమేర అర్థం ఉందని.. కానీ, చట్టాలను ఉల్లంఘిస్తూ నిర్బంధంగా రైతుల నుంచి భూములు సేకరిస్తోందని మండిపడ్డారు. ఏదైనా ఉద్దేశంతో భూమి తీసుకుని ఐదేళ్ల పాటు వినియోగించకపోతే ఆ భూమిని తిరిగి రైతుకు ఇవ్వాలని చట్టం స్పష్టంచేస్తోందన్నారు. ఒకవేళ అదే భూమిని ఇతర అవసరాలకు వినియోగించేటట్లయితే మార్కెట్ విలువలో 40 శాతం రైతుకు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అది కూడా చేయడంలేదని వడ్డే అన్నారు.
కార్పొరేట్లకు సామాజిక వనరులు
ఇక ప్రభుత్వం రైతుల భూములనే కాదు.. సామాజిక వనరులను కూడా కార్పొరేట్లకు కట్టబెడుతోందని న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్ అన్నారు. దీన్ని సామాజిక సమస్యగానే ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. పేదలు, రైతుల భూములను కొట్టేసి కార్పొరేట్లకు చేతుల్లో పెట్టడం అభివృద్ధా అని ప్రశ్నించారు. ఎంత భూమిని సేకరించారు? ఎంత భూమిని కార్పొరేట్లకు ఇచ్చారు? ఎన్ని ఫ్యాక్టరీలు పెట్టారు? ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారు? వీటన్నిటిపై శ్వేతపత్రం విడుదల చేసేలా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలన్నారు. భూముల కేటాయింపులకు వ్యతిరేకంగా పోరాడాలన్నారు. ప్రజా పోరాటానికి ప్రాధాన్యమివ్వాలని, దానితో పాటు న్యాయపోరాటం చేయాలని సూచించారు.
సామాజికవేత్త వసుంధర మాట్లాడుతూ.. కరేడు రైతు ఉద్యమం దేశానికే దిక్సూచి కావాలన్నారు. అనంతరం.. అభివృద్ధి సాకుతో పంట పొలాలను లాక్కొవద్దు, నిరూపయోగంగా ఉన్న భూముల్లో పరిశ్రమలు పెట్టాలని సమావేశం తీర్మానించింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ రఘురాజు, రైతు సంఘాల నాయకులు కె. బాబ్జీ, కొల్లా రాజమోహన్, వీవీఎస్ మహదేవ్, చిట్టిపాటి వెంకటేశ్వర్లు, కేశవరావు, ప్రభాకరరెడ్డి, అక్కినేని భవానిప్రసాద్, జమలయ్య, కోటిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.