రాష్ట్రంలో రోరో సర్వి సులు.. ఇక సులభంగా సరుకు రవాణా | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో రోరో సర్వి సులు.. ఇక సులభంగా సరుకు రవాణా

Published Mon, Jul 10 2023 4:55 AM

RoRo services on rivers at industrial areas - Sakshi

సాక్షి, అమరావతి: భూమిపైన ఉన్న జల మార్గాలను వినియోగించడం ద్వారా ఇంధనం, సమయం ఆదా చేసే దిశగా ఏపీ ఇన్‌లాండ్‌ వాటర్‌వేస్‌ అథారిటీ అడుగులు వేస్తోంది. దీనికోసం రాష్ట్రంలోని కృష్ణా, గోదావరి నదుల్లో రోరో సర్వి సుల (ఒకేసారి 15 వరకు సరుకు రవాణా వాహనాలను తీసుకెళ్లే సామర్థ్యం ఉన్న పెద్ద సైజు పడవలు)ను ప్రవేశపెట్టడంపై దృష్టిసారించింది. నదులపై వంతెనలు లేని చోట, సరుకు రవాణా వాహనాలు అవతలి తీరానికి చేరాలంటే సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి వస్తున్న ప్రాంతాలను ఎంపిక చేసి అక్కడ రోరో సర్వీసులను ప్రారంభించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసింది.

ఇందులో భాగంగా తొలి దశలో ఎన్టీఆర్‌ జిల్లా ముక్త్యాల, ఇబ్రహీంపట్నం, తూర్పుగోదావరి జిల్లా సీతానగరం వద్ద రోరో సర్వి సు పనులను మూడు నెలల్లో ప్రారంభించాలని నిర్ణయించినట్లు ఏపీ ఇన్‌లాండ్‌వేస్‌ అథారిటీ సీఈవో ఎస్‌వీకే రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. కృష్ణా నది తీరంలో ఎన్టీఆర్‌ జిల్లా వైపు ఉన్న ముక్త్యాల వద్ద అధికంగా సిమెంట్‌ పరిశ్రమలు ఉన్నాయి. అక్కడ వంతెన లేకపోవడంతో ఆ పరిశమ్రలకు అవసరమైన ముడిసరుకు కావాలన్నా, ఉత్పత్తి అయిన సిమెంట్‌ను సరఫరా చేయాలన్నా మరోవైపు ఉన్న పల్నాడు జిల్లాకు 125 కి.మీ ప్రయాణించాల్సి వస్తోంది.

ఇందుకోసం ముక్త్యాలకు అవతలి గట్టున ఉన్న మాదిపాడును కలుపుతూ రోరో సర్వీసులను ప్రవేశపెడతామని, దీని వల్ల ప్రయాణ సమయంతో పాటు ఇంధనం గణనీయంగా కలసి వస్తుందన్నారు. ముక్త్యాల నుంచి రోజుకు 500 ట్రక్కులు ప్రయాణిస్తున్నట్లు తమ సర్వేలో తేలిందని, రోరో సర్వి సులు ప్రవేశపెట్టడం ద్వారా ఏడాదికి 9.2 మిలియన్‌ లీటర్ల డీజిల్‌ వినియోగం తగ్గడం ద్వారా రూ. 103 కోట్ల విదేశీ మారక నిల్వలు ఆదా అవనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా రాష్ట్ర ఆర్థికవ్యవస్థకు ఏడాదికి రూ. 497 కోట్ల ఆదాయం సమకూరుతుందన్నారు. 

అదేవిధంగా పోలవరం పునరావాస గ్రామాలకు నిర్మాణ సామగ్రిని తరలించడం కోసం గోదావరి నదిపై సీతానగరం–తాడిపూడి వద్ద రోరో సర్వి సులు ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. అలాగే ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద కూడా ఈ సర్వీసులు ప్రవేశ పెట్టేలా ఏర్పాట్లు చేస్తున్నామని, ఈ సర్వి సుల ద్వారా సరుకు రవాణా వ్యయం టన్నుకు రూ.2.50 వరకు తగ్గుతుందని అంచనా వేస్తున్నామన్నారు. ఈ మూడు సర్వి సుల ద్వారా ఏటా డీజిల్‌ వినియోగం తగ్గడం ద్వారా రూ. 183 కోట్ల విదేశీ మారకం ఆదాతో పాటు ఆర్థిక వ్యవస్థకు రూ. 852 కోట్ల ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందని అంచనా వేస్తున్నామన్నారు.   

విజయవాడ నుంచి శ్రీశైలానికి నదీమార్గం.. 
త్వరలోనే విజయవాడ చుట్టుపక్కల ఏడు ప్రధాన దేవాలయాలను ఒకే రోజు సందర్శించి వచ్చే విధంగానూ, విజయవాడ నుంచి శ్రీశైలానికి నదీమార్గంలో వెళ్లే విధంగానూ లాంచీ సర్వి సులను ప్రవేశపెట్టే విధంగా ఏపీ ఇన్‌లాండ్‌ వాటర్‌వేస్‌ అథారిటీ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. 

రోరో అంటే..  
రోరో అంటే రోల్‌ ఆన్‌.. రోల్‌ ఆఫ్‌ పడవలు (ఫెర్రీ). ఇవి పెద్దగా ఉండటం వల్ల వీటి లోపలికి వాహనాలను నేరుగా డ్రైవ్‌ చేసుకుంటూ వెళ్లిపోవచ్చు. అలాగే దిగవచ్చు. తక్కువ దూరంలోని రెండు తీరాల మధ్య నదిలో నడపడానికి ఇవి వీలుగా ఉంటాయి. తీరంలో వీటి కోసం ప్రత్యేకంగా ర్యాంపులు నిర్మిస్తారు.

సరుకు రవాణా వాహనాలతో పాటు సాధారణ కార్లు, ప్రజలు కూడా వీటిలో ప్రయాణించేందుకు వీలుంటుంది. వంతెనలను కట్టడానికి వీలులేని ప్రదేశాల్లో పెద్ద నదులను దాటాల్సిన చోట వీటిని ఏర్పాటు చేస్తే సమయం, ఇంధనం కూడా ఆదా అవుతుంది. వీటిని తొలిసారి మన దేశంలో గుజరాత్‌ రాష్ట్రంలోని గోఘా, దహెజ్‌ మధ్య ప్రవేశపెట్టారు.      

ముక్త్యాల (కృష్ణానది) 
♦ స్టేట్‌ హైవే 34, 216 గుండా500 లారీల ప్రయాణం 
♦  రోరో ఏర్పాటు ద్వారా తగ్గనున్న 125 కి.మీ దూరం 
♦ ఒక ట్రిప్‌కు తగ్గనున్న 40 గంటల ప్రయాణ సమయం 
♦ తద్వారా ఏడాదికి 9.2 లక్షల లీటర్ల ఇంధనం ఆదా 
♦ ఏడాదికి రూ. 103 కోట్ల విదేశీ మారక నిల్వలు ఆదా 
♦ ఆర్థిక వ్యవస్థకు రూ. 497 కోట్ల ఆదాయం 

ఇబ్రహీంపట్నం (కృష్ణానది) 
♦ జాతీయ రహదారి 30, 65 నుంచి రోజుకు300 లారీల ప్రయాణం 
♦ రోరో ద్వారా తగ్గనున్న 70 కి.మీ దూరం 
♦ ట్రిప్‌కు తగ్గనున్న 24 గంటల ప్రయాణ సమయం 
♦ ఏడాదికి 3.2 మిలియన్‌ లీటర్ల ఇంధనం ఆదా 
♦ రూ. 36 కోట్ల ఆదా కానున్న విదేశీ మారక నిల్వలు 
♦ ఆర్థిక వ్యవస్థకు రూ. 157 కోట్ల ఆదాయం 

సీతానగరం (గోదావరి) 
♦ పోలవరం పునరావాస గ్రామాల నిర్మాణానికిరోజుకు 300 ట్రక్కుల ప్రయాణం 
♦ రోరో ద్వారా తగ్గనున్న 75 కి.మీ దూరం 
♦ ఒక ట్రిప్‌కు తగ్గనున్న 24 గంటల ప్రయాణ సమయం 
♦ ఏడాదికి 3.42 మిలియన్‌ లీటర్ల ఇంధనం ఆదా 
♦ ఆదా కానున్న రూ.44 కోట్ల విదేశీ మారక నిల్వలు 
♦ ఆర్థిక వ్యవస్థకు రూ. 198 కోట్ల ప్రయోజనం  

Advertisement
Advertisement