ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 14 మంది సజీవదహనం | Road Accident In Markapuram | Sakshi
Sakshi News home page

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 14 మంది సజీవదహనం

Mar 26 2026 6:49 AM | Updated on Mar 26 2026 4:45 PM

Road Accident In Markapuram

సాక్షి, ప్రకాశం: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో కంకర లోడుతో వస్తున్న టిప్పర్‌ను ప్రైవేట్‌ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 14 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు.

పోలీసుల వివరాల మేరకు.. తెలంగాణలోని జగిత్యాల నుంచి నెల్లూరు జిల్లా కనిగిరికి వెళ్తున్న హరికృష్ణ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు(నెంబర్‌ -AP39UC5265).. మార్కాపురం రాయవరంలో ప్రమాదానికి గురైంది. పలకల క్వారీల మలుపు వద్ద చీమకుర్తి నుంచి కంకర లోడుతో వస్తున్న టిప్పర్‌ను ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగగా, బస్సు పూర్తిగా దగ్ధం అయింది. ఈ దుర్ఘటనలో ఘటన స్థలంలో 14 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. చికిత్స పొందుతూ మరో ముగ్గురు మరణించారు. బస్సు ప్రమాదం సమయంలో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. బస్సు క్యాబిన్‌లో గుర్తు పట్టలేని విధంగా నాలుగు మృతదేహాలు ఉన్నాయి. 

ప్రమాదం ఉదయం 6-6.30 గంటల మధ్య ఈ ఘోరం జరిగినట్లు సమాచారం. ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు, ఘటనా స్థలికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను మార్కాపురంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. 
 
బస్సు డ్రైవర్‌ అతివేగమే ప్రమాదానికి కారణం
ప్రమాద సమయంలో బస్సులో 40 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. వీరిలో బస్సు వెనుక భాగంలో ఉన్నవారు బయటకు రాలేక మృతిచెందినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. టిప్పర్‌ను బస్సు ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే బస్సులో మంటలు వ్యాపించాయి. ప్రమాదంతో బస్సు అద్దాలు పగలగొట్టి కొందరు ప్రయాణికులు కిందకి దూకారు. స్లీపర్‌ బస్సు కావడంతో బయటపడేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. మృతుల్లో ఎక్కువ మంది స్లీపర్‌ బెర్తులపై ఉన్నవాళ్లేనని తేలింది. బస్సు డ్రైవర్‌ అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇంకా బస్సులోనే మృత దేహాలు : డీఎస్పీ
బస్సు ప్రమాదంపై మార్కాపురం డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP) నాగరాజు మీడియాతో మాట్లాడారు. 'ఇంకా బస్సులోనే మృతదేహాలున్నాయి. మృతదేహాలను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నాం. గాయపడ్డవారికి మార్కాపురం ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది’ అని చెప్పారు.  

ఘటన స్థలిని ప‌రిశీలించిన వైఎస్సార్‌సీపీ నేత‌లు
బస్సు ప్రమాద ఘటన స్థలిని దర్శి ఎమ్మెల్యే, వైస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు పరిశీలించారు. ఈ సంద‌ర్భంగా శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బస్సు ప్రమాదంలో 13 మంది మృతి చెందడం బాధాకరమ‌న్నారు. ప్రభుత్వం బాధిత కుటుంబాలను ఆదుకోవాలి. ట్రావెల్ ఏజెన్సీపై విచారణ జరపాలి. బస్సు ఫిట్‌నెస్ పైనా సమీక్ష చేయాలి. మార్కాపురంలో మెడికల్ కాలేజీ, పెద్దాసుపత్రి ఉండి ఉంటే క్షతగాత్రులను ఒంగోలు పంపించాల్సి వచ్చేది కాదు. జిల్లా ఏర్పాటు చేసినా ఇక్కడ సరైన వైద్యం లేదని ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి అన్నారు.

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి
హైద‌రాబాద్‌: మార్కాపురం బ‌స్సు ప్ర‌మాద ఘ‌ట‌న‌పై తెలంగాణ‌ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశారు. ప్ర‌మాద ఘ‌ట‌న‌లో ప‌లువురు మంది మృతి చెంద‌డం.. కొంద‌రికి తీవ్ర గాయాల‌పాల‌వ‌డంపై సీఎం విచారం వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబాల‌కు సానుభూతి తెలిపారు. గాయ‌ప‌డిన వారు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని సీఎం ఆకాంక్షించారు. బ‌స్సు తెలంగాణలోని జగిత్యాల నుంచి నుంచి నెల్లూరు జిల్లా కనిగిరికి వెళుతున్న నేప‌థ్యంలో బ‌స్సు ప్ర‌మాదంలో మృతిచెందిన వారు.. గాయ‌ప‌డిన వారి వివ‌రాలు తెలుసుకోవాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణారావును ఆదేశించారు. ఏపీ అధికారుల‌తో మాట్లాడి పూర్తి వివ‌రాలు సేక‌రించాల‌ని సీఎం సూచించారు. గాయ‌ప‌డిన వారికి మెరుగైన వైద్యం స‌హాయం అందేలా చూడాల‌ని సీఎం ఆదేశించారు. ముఖ్య‌మంత్రి రేవంత్‌ ఆదేశాల‌తో సీఎస్ రామ‌కృష్ణారావు ఏపీ సీఎస్‌తో మాట్లాడారు.

 

EXCLUSIVE VIDEO: మార్కాపురంలో బస్సు ప్రమాదం.. ప్రమాదం ఎలా జరిగిందో చూడండి

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement