
నగరి: యునైటెడ్ స్టేట్స్ బ్లూమింగ్‌టన్‌లోని ఇండియానా వర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ కంప్యూటర్స్ కోర్సు చదువుతోన్న వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా కుమార్తె అన్షుమాలిక అత్యంత ప్రతిష్టాత్మకమైన మౌరీన్ బిగ్గర్స్ అవార్డు 2025–26ను అందుకున్నారు. ఇండియానా వర్సిటీ ఆఫ్ ఎక్సెలెన్స్ ఫర్ ఉమెన్ అండ్ టెక్నాలజీ వ్యవస్థాపకురాలు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మౌరిన్ బిగ్గర్స్.. టెక్నాలజీలో ఈక్విటీని ప్రోత్సహిస్తున్న వారికి ఈ అవార్డును ప్రదానం చేశారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెనుకబడిన వర్గాలను కలుపుకొని వారి సాంకేతిక అవకాశాలపై అధ్యయనం చేయడం, నమీబియా, నైజీరియా, భారత్ వంటి దేశాల్లో వెనుకబడిన వర్గాల్లో సాంకేతిక విద్యను పెంపొందించే కోడింగ్ శిబిరాలకు నాయకత్వం వహించడం, మహిళలకు వెబ్ డెవలప్మెంట్ శిక్షణ, మాధ్యమాల ద్వారా పేదవర్గాలకు సమగ్రమైన సాంకేతిక విద్యను అందించడానికి కృషిచేసినందుకుగాను ఈ అవార్డును ప్రకటించినట్లు వర్సిటీ వర్గాలు వెల్లడించాయి.