పర్యాటక ప్యాకేజీలతో ఆదాయం పరుగు

Revenue Income with tourism packages with AP Tourism Packages - Sakshi

గతేడాది ఏప్రిల్‌–డిసెంబర్‌ వరకు రూ.24.05 కోట్ల రాబడి 

హైదరాబాద్, ముంబయి నుంచి తిరుపతికి విమాన టూర్‌ ప్యాకేజీ 

సాక్షి, అమరావతి: రాష్ట్ర పర్యాటకశాఖ ప్రకటిస్తున్న ప్యాకేజీల కారణంగా ఆ శాఖ ఆదాయం గణనీయంగా పెరుగుతోంది. రాష్ట్రంలో గతేడాది ఏప్రిల్‌ నుంచి డిసెంబర్‌ వరకు  రూ.24.05 కోట్లు ఆర్జించింది. ఇందులో తిరుపతి ప్యాకేజీల నుంచే అత్యధికంగా రూ.18 కోట్లు  రావడం విశేషం. ఒక్క డిసెంబర్‌లోనే రూ.4 కోట్ల వరకు ఆదాయం వచ్చింది. ఆ తర్వాత విశాఖ లోకల్‌టూర్లకు ఎక్కువ ఆదరణ లభిస్తోంది. మరోవైపు కార్తీకమాసంలో శైవక్షేత్రాలు, శక్తిపీఠాల ప్యాకేజీలు కొంతమేరకు ఆదాయవృద్ధికి దోహదపడ్డాయి. ప్రస్తుతం పర్యాటక శాఖ 35 టూర్‌ ప్యాకేజీలను నడుపుతూ.. 30 సొంత బస్సుల్లో ప్రయాణికులకు మెరుగైన సేవలందిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్, ముంబయి వంటి మెట్రో నగరాల నుంచి తిరుపతికి విమాన ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది.  గ్రాండ్‌ కేనియన్‌ ఆఫ్‌ ఇండియాగా పిలిచే గండికోటకు బెంగళూరు, హైదరాబాద్‌ నుంచి పర్యాటకుల రాకను ప్రోత్సహిస్తున్నారు. కోవిడ్‌ ప్రారంభమైన తర్వాత పడిపోయిన పర్యాటకశాఖ ఆదాయం ప్యాకేజీలతో తిరిగి పుంజుకుంటుంది. 

తిరుపతికి ఇలా.. 
రవాణాతో పాటు వసతి, స్వామివారి దర్శనం కల్పిస్తుండడంతో తిరుపతి టూర్‌ ప్యాకేజీలకు మంచి ఆదరణ లభిస్తున్నది. ప్రస్తుతం కర్నూలు, ఒంగోలు, ప్రొద్దుటూరు, విజయవాడ, హైదరాబాద్, చెన్నై, విశాఖపట్నం, బెంగళూరు నుంచి తిరుపతికి పర్యాటక శాఖ బస్సులు నడుపుతోంది. మరోవైపు చెన్నై–వళ్లూరు–తిరుపతి, తిరుపతి–శ్రీశైలం, తిరుపతి–కాణిపాకం–స్వర్ణ దేవాలయం, అరుణాచలం తదితర లోకల్‌ ప్యాకేజీలను అందిస్తోంది.  

లోకల్‌ టూరిజం.. 
స్థానిక పర్యాటకాన్ని ప్రోత్సహించేలా విశాఖపట్నం–లంబసింగి, విశాఖపట్నం–అరసవిల్లి దేవాలయం, రాజమండ్రి–మారేడుమిల్లి, కర్నూలు–శ్రీకాకుళం–నంద్యాల, శ్రీకాకుళంలో అరసవిల్లి–శ్రీకూర్మం–శాలిహుండం–కళింగపట్నంకు ఒక్కరోజులో చుట్టివచ్చే అవకాశాన్ని కల్పిస్తోంది. అలాగే సర్క్యూట్‌ టూరిజంలో భాగంగా కొత్తగా అనంతపురం–కదిరి–వేమనగారి జన్మస్థలం ప్రాంతం–గండి ఆంజనేయస్వామి దేవాలయం, గండికోట, బెలూం గుహలు, తాడిపత్రి వెంకటేశ్వరస్వామి దేవాలయంతో కలిపి రెండు రోజుల ప్యాకేజీని రూపొందించింది. ఈ ప్యాకేజీల ద్వారా పర్యాటక శాఖ సిబ్బంది జీతాలు, రవాణా ఖర్చులు అన్నీ పోనూ నికరంగా సుమారు రూ.6 కోట్లకు పైగా ఆదాయం లభించింది. 

పర్యాటకానికి కొత్త ఉత్సాహం
రాష్ట్ర వ్యాప్తంగా సర్క్యూట్‌ టూరిజాన్ని ప్రోత్సహిస్తున్నాం. కొత్తగా హైదరాబాద్, ముంబయి నుంచి విమాన ప్యాకేజీని ప్రవేశపెట్టాం. దేశంలోని ప్రధాన నగరాల్లోనూ ఏపీ టూరిజం కేంద్రాలను ఏర్పాటు చేయనున్నాం. 
– ముత్తంశెట్టి శ్రీనివాసరావు, రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి 

సొంత బస్సుల్లో సురక్షితంగా.. 
కోవిడ్‌ నిబంధనలు అనుసరిస్తూనే పర్యాటక ప్యాకేజీలను నడుపుతున్నాం. కోవిడ్‌ కారణంగా రెండేళ్లలో ఎన్నడూ లేనంత వృద్ధి కేవలం ఆరు నెలల్లో సాధించాం. సొంత బస్సుల్లో సురక్షితంగా పర్యాటకులను తీసుకెళ్లి తీసుకొస్తుండడంతో ఎక్కువ ఆదరణ లభిస్తోంది. 
– ఎస్‌. సత్యనారాయణ, 
ఏపీటీడీసీ ఎండీ  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top