ఆగస్టు 20న జారీ చేసిన జీవోకు సవరణ
మొత్తం 50 శాతానికి మించకుండా రిజర్వేషన్లు కల్పించాలని తాజాగా 251 జీవో జారీ
ఫలితంగా బీసీ రిజర్వేషన్లకు భారీగానే కోతపడే అవకాశం
మేయర్లు, చైర్‌పర్సన్లకు రొటేషన్ విధానం
ఎస్టీ, ఎస్సీలకు రిజర్వ్ కాగా మిగిలినవి బీసీలకు..
స్థానిక సంస్థల వారీగా బీసీ కోటా ఖరారు
నేడు వార్డులు, మేయర్లు, చైర్‌పర్సన్ల రిజర్వేషన్ల ఖరారు!
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్టు చంద్రబాబు ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టు 20వ తేదీన జారీ చేసిన జీవోను సవరిస్తూ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ, పురపాలక పట్టణాభివృద్ధి శాఖలు ఆదివారం మరో జీవో జారీ చేశాయి. గ్రామ పంచాయతీ, మండల జిల్లా పరిషత్‌లకు జరిగే ఎన్నికల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, కేటగిరీలకు కల్పించే మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని ఆ ఉత్తర్వులో పేర్కొంది.
ప్రభుత్వం ఆమోదించిన బీసీ డెడికేషన్ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా, వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లను నిర్ణయించాలని పేర్కొంది. రిజర్వేషన్ల గణన, కేటాయింపునకు సంబంధించిన వివరణాత్మక విధానం.. స్థానిక సంస్థల వారీగా రిజర్వేషన్లు, పదవుల నిర్ధారణ, కేటాయింపు, రోటేషన్‌పై కొత్త విధివిధానాలతో వేరుగా ఆదేశాలు ఇవ్వనున్నట్టు పేర్కొంది. దీంతో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు భారీగా కోత పడే అవకాశం ఉంది. జెడ్పీ చైర్మన్ పదవులతో పాటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల పదవుల్లో దాదాపు పది శాతం చొప్పున తగ్గిపోయే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
మభ్యపెట్టి లబ్ధి పొందేలా స్కెచ్
మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాట కూడదని తెలిసినా బీసీలను మభ్యపెట్టడానికి స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం, పట్టణ స్థానిక సంస్థల్లో 33.33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చంద్రబాబు సర్కారు తొలుత వేర్వేరుగా జీవోలు జారీ చేసింది. పార్లమెంట్‌లో చట్ట సవరణ చేయకుండా జారీ చేసిన జీవోలు చెల్లవని తెలిసినా కపట నాటకం ఆడింది. ఈ జీవోలను హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టు కూడా కొట్టివేసిన సంగతి తెలిసిందే. దీంతో పట్టణ స్థానిక సంస్థల (మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో) రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించి ప్రభుత్వం ఆదివారం 251 జీవో జారీ చేసింది.
బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కలిపి కల్పించే రిజర్వేషన్లు మొత్తం 50 శాతానికి మించరాదని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, హైకోర్టు ఆదేశాలు, డెడికేటెడ్ కమిషన్ నివేదికను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. రాష్ట్రంలోని 123 మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో వార్డు సభ్యుల స్థానాలతోపాటు మేయర్, చైర్‌పర్సన్ పదవుల రిజర్వేషన్లను తాజా ఉత్తర్వుల ప్రకారం ఖరారు చేయాలని స్పష్టం చేసింది.
ఫలితంగా రాష్ట్రంలోని 123 పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించి ఆయా యూఎల్‌బీని యూనిట్‌గా తీసుకుని రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వ్ కాగా.. మిగిలిన శాతం సీట్లు బీసీలకు దక్కనున్నాయి. అయితే మొత్తం రిజర్వేషన్లు మాత్రం 50 శాతానికే పరిమితమవుతాయి. మరోవైపు వార్డుల పునర్విభజన జరిగిన నేపథ్యంలో వార్డుల రిజర్వేషన్లు నూతనంగా ఖరారు చేయనున్నారు. మేయర్లు, చైర్‌పర్సన్లకు మాత్రం 2021 ఎన్నికల్లో రిజర్వేషన్లను పరిగణనలోకి తీసుకుని రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు.
నేడు రిజర్వేషన్ల ఖరారు
కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు సంబంధించి వార్డుల రిజర్వేషన్లతో పాటు కార్పొరేషన్ చైర్మన్లు, మున్సిపల్, నగర పంచాయతీల చైర్‌పర్సన్ల రిజర్వేషన్లు సోమవారం ఖరారు కానున్నట్టు విశ్వసనీయ సమాచారం. అయితే తొలి దశలో 13 కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. రిజర్వేషన్లు మాత్రం 123 పట్టణ స్థానిక సంస్థలకు ఖరారు చేయనున్నారు.


