
నడకదారిలో 16 కిలోమీటర్లు...ఆటోపై 24 కిలోమీటర్లు
‘కూటమి’ తీరుతో దాయార్తి పీవీటీజీ గిరిజనులకు కొత్త కష్టాలు
కూటమి ప్రభుత్వం ఇంటింటికీ రేషన్ సరఫరా విధానాన్ని తొలగించడం గిరిజనులను ఇక్కట్లపాలు చేస్తోంది. తీరుతో అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం జీనబాడు పంచాయతీ దాయార్తి గ్రామ పీవీటీజీ (ఆదిమజాతి గిరిజనులు) గిరిజనులు రేషన్ సరుకుల కోసం నరకయాతన పడుతున్నారు. ఈ గ్రామంలో 110 మంది తెలుపు రేషన్ కార్డుదారులున్నారు. వీరంతా 20 కిలోమీటర్లు ప్రయాణిస్తే కానీ రేషన్ పొందలేని దుస్థితి.
ఎనిమిది కిలోమీటర్లు కాలినడకన బల్లగరవు వెళ్లి, అక్కడ నుంచి మరో 12 కిలోమీటర్లు ఆటోలో వెళితే జీనబాడు పంచాయతీ కేంద్రం వస్తుంది. అక్కడే రేషన్ సరకులు తీసుకోవాలి. రూ.400 ఖర్చు చేసి, రానూపోనూ 40 కిలోమీటర్లు ప్రయాణిస్తేనే ఆనెల రేషన్ తీసుకోవచ్చు. గ్రామంలో లబ్దిదారులందరూ కలిసి ప్రతి నెలా రేషన్ కోసం రూ.44 వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. – అరకులోయ టౌన్
రేషన్ డిపో ఉన్నా...
దాయార్తి గ్రామానికి రహదారి, రేషన్ డిపో ఉన్నా... దారి బాలేదన్న నెపంతో రేషన్ సరుకులను గ్రామంలోకి తీసుకురాకుండా గిరిజన్ కో–ఆపరేటివ్ కార్పొరేషన్ (జీసీసీ) అధికారులు జీనబాడు పంచాయతీ కేంద్రంలో మాత్రమే రేషన్ సరుకులు పంపిణీ చేస్తున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో దాయార్తి గ్రామానికి ఆరు కిలోమీటర్ల దూరంలోని బల్లగరువు గ్రామానికి మినీ వ్యాన్ ద్వారా రేషన్ పంపిణీ చేసేవారు.
ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రేషన్ పంపిణీ వ్యాన్‌లను తొలగించడంతో ఈ గ్రామస్తులకు రేషన్ కష్టాలు మొదలయ్యాయి. ఇప్పటికైనా జీసీసీ అధికారులు స్పందించి వ్యాన్ ద్వారా దాయార్తి గ్రామంలోకి రేషన్ బియ్యం తీసుకువచ్చి పంపిణీ చేయాలని ఆ గ్రామస్తులు కోరుతున్నారు.
హామీ మరచిన పవన్
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత డిసెంబర్ 21న బల్లగరువు గ్రామంలో పర్యటించి దాయార్తి గ్రామం వరకు రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అయితే నేటికీ ఆ రహదారి నిర్మాణానికి మోక్షం రాలేదు. అటవీ శాఖ అనుమతులు ఇవ్వలేదు. ఆయన ఇచ్చిన హామీ నెరవేరలేదు.
గ్రామంలోనే సరుకులివ్వాలి
రేషన్ బియ్యం కోసం ప్రతి నెలా 40 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. ఆటో చార్జీలకు రానుపోను రూ.400 అవుతోంది. 16 కిలోమీటర్లు నడిచి, కొండలెక్కి దిగితేకానీ రేషన్ తెచ్చుకోలేకపోతున్నాం. వ్యాన్‌లో దాయార్తికి రేషన్ బియ్యం తీసుకొచ్చి, పంపిణీ చేయాలి. – సేదరి ఆనంద్, దాయార్తి గ్రామం, అనంతగిరి మండలం
రోడ్ల నిర్మాణమెప్పుడు పవన్?
డిప్యూటీ సీఎం ఆవేశంగా ఇచి్చన హామీ ఏమైంది. ఇంతవరకు దాయార్తి రోడ్డుకు మోక్షం లేదు. అడిగితే అటవీశాఖ అనుమతి లేదంటున్నారు. ఆ శాఖ ఆయనవద్దే ఉందిగా, అనుమతి ఇవ్వచ్చుగా. బల్లగరువు నుంచి దాయార్తి రోడ్డు, మడ్రేవు నుంచి తులసిబు రహదారి నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలి. – కె.గోవిందరావు, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు, ఉమ్మడి విశాఖ జిల్లా