సచివాలయ ఉద్యోగ రాతపరీక్షల ప్రాథమిక కీ విడుదల

Release of Primary Key of Secretariat Job Written Exam - Sakshi

సాక్షి, అమరావతి: కరోనా క్లిష్ట పరిస్థితుల్లోనూ ఓ భారీ ఉద్యోగ నియామక ప్రక్రియలో కీలక దశను ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసింది. సచివాలయ ఉద్యోగ రాతపరీక్షల ప్రాథమిక ‘కీ’ని అధికారులు శనివారం రాత్రి విడుదల చేశారు. మొత్తం 14 రకాల రాతపరీక్షలకు సంబంధించిన కీ వివరాలను గ్రామ సచివాలయం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ప్రతి ఒక్క పరీక్షకు నాలుగు రకాల టెస్ట్‌ బుక్‌లెట్‌ సిరీస్‌ కోడ్‌ వారీగా కీలను విడుదల చేశారు. వీటిపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే.. అభ్యర్ధులు ఈనెల 29వ తేదీ వరకు వెబ్‌సైట్‌ ద్వారా నమోదు చేసుకోవచ్చని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ కమిషనర్‌ గిరిజా శంకర్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యంతరాలను నిపుణులు పరిశీలించి, తుది కీ ని సాధ్యమైనంత త్వరగా విడుదల చేస్తామని తెలిపారు. ప్రశ్నపత్రం, కీ సాక్షి ఎడ్యుకేషన్‌ డాట్‌ కామ్‌లో చూడవచ్చు. 

► మొత్తం 16,208 గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఈ నెల 20వ తేదీ మొదలైన రాతపరీక్షలు శనివారం సాయంత్రం ముగిశాయి. ఈ పరీక్షలకు 72.73 మంది అభ్యర్ధులు హాజరైనట్టు పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు.  
► రాత పరీక్షల కోసం 10,57,355 మంది అభ్యర్థులకు హాల్‌ టిక్కెట్లు జారీ చేయగా.. వీరిలో 9,51,016 మంది వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. అందులో 7,69,034 మంది పరీక్షలు రాశారు. 
► ఇదిలా ఉండగా, సచివాలయ ఉద్యోగాల కోసం ఇన్‌ సర్వీస్‌ అభ్యర్ధులుగా దరఖాస్తు చేసుకున్న వారు వెయిటేజ్‌ మార్కులు పొందాలంటే గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల వెబ్‌సైట్‌ నుంచి ధ్రువపత్రాన్ని తీసుకుని, వారి వారి శాఖాధిపతులతో దానిపై ధ్రువీకరణ చేయించుకొని.. ఆ పత్రాలను తిరిగి వెబ్‌సైట్‌లో ఈ నెల 30వ తేదీలోగా అప్‌ లోడ్‌ చేయాలని అధికారులు సూచించారు.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top