రఘురామకృష్ణరాజు అనుకున్నదొక్కటి.. అయింది మరొకటి

Raghurama krishnamraju Sketch for drama with High Court bail rejection - Sakshi

బెయిల్‌ వస్తుందనుకొని ఎదురు చూసిన ఎంపీ

హైకోర్టు తిరస్కరించడంతో డ్రామాకు స్కెచ్‌

సాక్షి, అమరావతి: ఎంపీ రఘురామకృష్ణరాజు అనుకున్నదొక్కటి.. అయింది మరొకటి అన్నట్లుంది.  సీఐడీ పోలీసులు శుక్రవారం ఆయనను అరెస్ట్‌ చేసిన అనంతరం పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆయన్ను మెజిస్ట్రేట్‌ ఎదుట హాజరు పరచకముందే శుక్రవారం రాత్రి బెయిల్‌ కోసం హైకోర్టులో హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ వేశారు. శనివారం హైకోర్టు ఇదే విషయమై తప్పు పడుతూ కింది కోర్టులోనే బెయిల్‌కు దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది. అప్పటి వరకు బెయిల్‌ వస్తుందన్న ఆశతో ఉన్న రఘురామ.. ఆయన న్యాయ, ఇతర సలహాదారుల సూచన మేరకు వెంటనే ఓ కట్టుకథ సిద్ధం చేసుకున్నారు. శనివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో గుంటూరు సీఐడీ కోర్టులో ఆయన్ను హాజరుపరచగానే పోలీసులు తనను కొట్టారంటూ కొత్త డ్రామాకు తెరలేపడం సర్వత్రా ఆశ్చర్య పరిచింది.

నిజంగా పోలీసులు ఆయన్ను కొట్టి ఉంటే అప్పటి వరకు ఆ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు సైతం ఎందుకు చెప్పలేదు? శనివారం మధ్యాహ్నం వారే ఆయనకు భోజనం తెచ్చిచ్చారు. ఆ సమయంలో వారితో ఈ విషయం చెప్పి, గాయాలు చూపించి ఉండాలి కదా? వారు బయటకు వచ్చి ఆ విషయమై మీడియా ఎదుట రచ్చ చేసి ఉండే వారు కదా? వారిలో కొందరు వారి అనుకూల మీడియాతో మాట్లాడారు. ఆ సమయంలో కూడా గాయాల విషయం ప్రస్తావనకు రాలేదు. ఎప్పుడో రాత్రి పోలీసులు ఆయన్ను కొట్టి ఉంటే, శనివారం సాయంత్రం కోర్టులో హాజరు పరిచే ముందు వైద్యులు ఆయన్ను పరీక్షించినప్పుడు వారి దృష్టికి ఎందుకు తీసుకురాలేదు? ఈ ప్రశ్నలన్నింటికీ ఒకే సమాధానం కనిపిస్తోంది. హైకోర్టులో బెయిల్‌ రాదని తెలిసినప్పుడే ఆయన  ఈ నాటకానికి తెరతీశారు.

వాస్తవానికి ఎంపీని పోలీసులు కొట్టి ఉంటే, బెయిల్‌ అడగడానికి అది చాలా బలమైన కారణంగా ఉండేది. ఇంతటి బలమైన కారణాన్ని ఆయన న్యాయవాది ఎందుకు ఉపయోగించుకోలేదు? బెయిల్‌ కోసం హైకోర్టులో వాదనలు జరిగినప్పుడు ఈ విషయం ప్రస్తావనకు రాలేదెందుకు? ఈ విషయాలపై న్యాయవాద వర్గాల నుంచి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ముమ్మాటికీ కట్టుకథేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. పోలీసులు తన అరికాళ్లపై లాఠీలతో తీవ్రంగా కొట్టారని కోర్టులో ఎంపీ  చెప్పారు.

అయితే అంతకు ముందు కోర్టు ప్రాంగణంలో ఆయన కారు దిగిన సమయంలో, కోర్టులోకి ప్రవేశించే ముందు ఎవరి సాయం లేకుండా మామూలుగా నడుచుకుంటూ వెళ్లారు.  అరికాళ్లపై అవి కొట్టిన దెబ్బలే అయితే 59 ఏళ్ల ఆయన ఎవరి సాయం లేకుండా మామూలుగా ఎలా నడవగలిగారన్నది ప్రశ్నార్థకం. కరోనా వైరస్‌ వ్యాప్తి పరిస్థితుల దృష్ట్యా పరిమిత సంఖ్యలో మాత్రమే న్యాయవాదులను కోర్టులోకి అనుమతించిన నేపథ్యంలో తమనూ లోనికి అనుమతించాలని పలువురు టీడీపీ లీగల్‌ సెల్‌ న్యాయవాదులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు తనను కొట్టారని ఎంపీ కోర్టులో చెప్పడంతో వారంతా ఆశ్చర్యపోయారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top