లక్షలు దిగమింగి.. అడ్డగోలు పోస్టింగ్‌లు | Postings With Forged Signatures | Sakshi
Sakshi News home page

కొలువుల లంచాయతీ

Oct 29 2020 10:49 AM | Updated on Oct 29 2020 10:49 AM

Postings With Forged Signatures - Sakshi

జిల్లా పంచాయతీ కార్యాలయం

సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: గత పాలకుల హయాంలో రూ.లక్షలకు లక్షలు దిగమింగి ఎటువంటి అనుమతులు లేకుండా అడ్డగోలుగా గ్రామ పంచాయతీల్లో పలువురికి పోస్టింగ్‌లు కట్టబెట్టేశారు.  రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకూ ముడుపులు మెక్కి పోస్టింగ్‌లు ఇచ్చారు. తొలుత పార్ట్‌టైమ్‌ ఉద్యోగానికి తీసుకున్నారు. వారంతా ఇప్పుడు గ్రామ పంచాయతీల్లో బిల్లు కలెక్టర్, జూనియర్‌ అసిస్టెంట్‌ హోదాల్లో ప్రభుత్వం నుంచి రూ.వేలకు వేలు జీతాలు తీసుకుంటున్నారు. ఈ రకంగా జిల్లాలో అడ్డగోలుగా ఉద్యోగాలు పొందిన వారి సంఖ్య పలు పంచాయతీల్లో లెక్కలు తీయగా 40 మంది ఉన్నట్టు విజిలెన్స్‌ విభాగం గుర్తించింది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ఇటీవల విజిలెన్స్‌ అధికారులు జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం నుంచి కోరారు. ఎంతమంది ఉన్నారు, వారికి గ్రామ పంచాయతీల నుంచి ఎంతెంత జీతాలు చెల్లిస్తున్నారు. వారి సరి్టఫికెట్లు వంటి వివరాలు సేకరిస్తున్నారు. నిబంధనలు తుంగలోకి తొక్కి గ్రామ పంచాయతీల్లో ఉద్యోగాలు పొందిన వారి జాతకాలు బయట పెట్టేందుకు విజిలెన్స్‌ విభాగం కసరత్తు మొదలు పెట్టింది.

విచారణ సాగకుండా ఎత్తుగడలు 
నెలకు రూ.12 వేల నుంచి రూ.15వేలు జీతాలుగా తీసుకుంటున్న పరిస్థితుల్లో విచారణ జరిపితే ఎదురయ్యే పరిస్థితులను అక్రమార్కులు ముందుగానే గుర్తించారు. విచారణ ముందుకు సాగకుండా అడ్డుపుల్లలు వేసేలా అడుగులు వేస్తున్నారు. అడ్డగోలుగా ఉద్యోగాలు పొందిన వారంతా ఏదో విధంగా రెగ్యులరైజ్‌ చేయించుకోవాలని విజిలెన్స్‌ విచారణతో సంబంధం లేకుండా  పావులు కదుపుతున్నారు. ఇన్నేళ్లు నుంచి పార్టుటైమ్‌ ఉద్యోగులుగా పంచాయతీల్లో పని చేస్తున్నాం.. తమకు కూడా రెగ్యులర్‌ ఉద్యోగులుగా గుర్తించి 101 ఖాతా ద్వారా జీతాలు ఇవ్వాలని జిల్లా పంచాయతీ అధికారులపై ఒత్తిళ్లు తీసుకు వస్తున్నారని విశ్వసనీయంగా తెలిసింది.

సంతకాలు ఫోర్జరీ చేసి పోస్టింగ్‌లు 
ఏడెనిమిదేళ్ల క్రితం అక్రమ పోస్టింగ్‌ ఆర్డర్లు ఎలా వచ్చాయి? ఎవరెవరి పాత్ర ఉంది, పలు గ్రామ పంచాయతీల్లో ఉద్యోగులుగా చెలామణి అవుతున్న వారు ఎందరున్నారు వంటి వివరాలను విజిలెన్స్‌ అధికారులు సేకరిస్తున్నారు. 2009కి ముందు జిల్లా పంచాయతీ అధికారిగా పనిచేసిన పి.సుబ్రహ్మణ్యం, ఇన్‌చార్జి డీపీవోగా పనిచేసిన ఇస్మాయిల్‌ సంతకాలు ఫోర్జరీ చేసి ఈ ఉద్యోగాలు కొట్టేశారని సమాచారం. అనంతరం ఆ పోస్టులపై జిల్లా అధికారులు ఆరా తీసి చర్యలకు ఉపక్రమిస్తే కొందరు నాయకులు అడ్డుపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న విజిలెన్స్‌ అధికారులు ఆ వివరాలు కూడా రాబట్టే పనిలో ఉన్నారు. అటువంటి వారంతా ప్రస్తుతం ఉద్యోగాలు క్రమబదీ్ధకరించుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో పైరవీలు సాగించడం కొసమెరుపు.

ఈ పోస్టింగ్‌లపై అప్పటి ఇన్‌చార్జి కలెక్టర్‌ గోపాలకృష్ణ ద్వివేది ఆధ్వర్యంలో సమగ్ర విచారణ కూడా జరిగిందిÐ. నాటి విచారణలో ఆ 40 పోస్టులు అక్రమమార్గంలో ఆర్డర్‌లు పొందినవేనని నిగ్గు తేల్చారు. బాధ్యులపై చర్యలకు సిద్ధమవుతుండగా న్యాయస్థానాన్ని ఆశ్రయించిన నేపథ్యంలో అప్పటి నుంచి ఈ ఫైల్‌ అటకెక్కింది. ప్రస్తుతం ఈ అక్రమ పోస్టింగ్‌లపై విజిలెన్స్‌ అధికారులు విచారణ చేపట్టేందుకు సిద్ధమవుతుండడంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. 

ఉన్నతాధికారుల దృష్టికి
గతంలో జరిగిన విషయాలు నా దృష్టికి రాలేదు. ఈ విషయాన్ని జిల్లా ఉన్నతా«ధికారుల దృష్టికి తీసుకువెళతాం. బాధ్యులపై చర్యలకు వెనుకాడేది లేదు. 
–ఆర్‌.విక్టర్, ఇన్‌చార్జి డీపీఓ

బాధ్యులపై చర్యలు తీసుకుంటాం 
అక్రమంగా పోస్టింగ్‌లు పొందిన విషయంలో బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. పలు గ్రామ పంచాయతీల్లో అక్రమమార్గంలో పోస్టింగ్‌లు పొందిన  విషయం నా దృష్టికి రాలేదు. ప్రభుత్వం నుంచి న్యాయపరంగా కూడా ముందుకు వెళతాం.
– నాగేశ్వరనాయక్, డీపీఓ (సెలవుపై ఉన్నారు)  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement