
విద్యుత్ వాహనాలకు రూ.2,000 కోట్లతో పీఎం ఈ–డ్రైవ్ పథకం
దేశవ్యాప్తంగా 72,000 చార్జింగ్ స్టేషన్లు పెట్టనున్న కేంద్రం
హైవేలు, నగరాలు, టోల్ ప్లాజాలు, ప్రజా రవాణా ప్రాంతాల్లో ఏర్పాటు
విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించాలనే లక్ష్యంతో ప్రపంచ దేశాలు చేసుకున్న ఒప్పందంలో భాగంగా కేంద్రం పీఎం ఈ–డ్రైవ్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా రూ.2,000 కోట్లతో దేశ వ్యాప్తంగా 72 వేల ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) చార్జింగ్ స్టేషన్లను నెలకొల్పనున్నట్లు వెల్లడించింది. ప్రపంచంలో అత్యధిక కాలుష్యం గల దేశాల్లో భారత్ 3వ స్థానంలో ఉంది.
ఈ నేపథ్యంలో 2030కి సంప్రదాయ వాహనాల స్థానంలో 30% ఈవీ కార్లు, 80 %ఈవీ టూ వీలర్లు, 70% ఈవీ కమర్షియల్ వెహికిల్స్ ప్రవేశపెట్టాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తంగా 8 కోట్ల విద్యుత్ వాహనాలు వచ్చే ఐదేళ్లలో రోడ్లమీద నడవాలని నిర్దేశించుకుంది. తద్వారా 2030కి 1 గిగా టన్ కర్బన ఉద్గారాలు తగ్గుతాయని అంచనా. అయితే ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే మాత్రం ఈవీల వినియోగం పెరగాలి. అందుకోసం చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు వేగవంతం కావాల్సిన అవసరం ఉంది.
ఆలోచించి కొంటున్నారు..
2024–25లో దేశ వ్యాప్తంగా 20 లక్షల విద్యుత్ వాహనాలను వాహనదారులు కొనుగోలు చేశారు. గత ఆర్థిక సంవత్సరంలో అమ్ముడైన ఈ విద్యుత్ వాహనాల్లో సగం (60%)పైగా ఈవీ ద్విచక్ర వాహనాలే ఉన్నాయి. అంటే 12 లక్షలు ఈవీ మోటార్ సైకిళ్ల విక్రయాలు జరిగాయి. 2023తో పోల్చితే ఈవీ విక్రయాల వృద్ధి 24%గా ఉంది. దాదాపు లక్ష విద్యుత్ కార్లను వినియోగదారులు గతేడాది కొనుగోలు చేశారు.
ఎలక్ట్రిక్ బస్సుల విక్రయాలు మాత్రం 3% తగ్గాయి. విద్యుత్ వాహనాలను కొనుగోలు చేయాలనే ఆసక్తి ఉన్నప్పటికీ వాటికి చార్జింగ్ పెట్టడమనేది ప్రధాన సమస్యగా మారడంతో ఎక్కువ మంది సంశయిస్తున్నారు. కొనాలా వద్దా అని ఒకటికి పదిసార్లు ఆలోచించాకే నిర్ణయం తీసుకుంటున్నారు. ఆ సమస్యను అధిగ విుంచాలంటే కేంద్రం చార్జింగ్ స్టేషన్లను అందుబాటులోకి తీసుకురావాలి.
ప్రపంచ స్థాయికి చేరలేదు
ప్రపంచ దేశాలతో పోల్చితే భారత్‌లో ఇంకా ఆ స్థాయిలో ఈవీల వినియోగం పెరగలేదు. దీనికి ప్రధాన కారణం ఎక్కడికక్కడ చార్జింగ్ స్టేషన్లు లేకపోవడం. దేశంలో ప్రస్తుతం 12,146 విద్యుత్ చార్జింగ్ స్టేషన్లు ఉన్నాయని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ చెబుతోంది. 2030కి దేశ వ్యాప్తంగా 39 లక్షల ఈవీ చార్జింగ్ స్టేషన్లు అవసరం. భారత్‌లో ప్రతి 135 ఈవీలకు ఒక పబ్లిక్ చార్జర్ మాత్రమే ఏర్పాటైంది.
ఇండియా ఎలక్ట్రిక్ వాహనం చార్జింగ్ మార్కెట్ గడిచిన ఐదేళ్లలో రూ.30 వేల కోట్లకుపైగా పెట్టుబడులను ఆకర్షించింది. అయినప్పటికీ, మౌలిక సదుపాయాల సమస్యలను ఎదుర్కొంటోంది. ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులను, ప్రోత్సాహకాలను పెంచడం, ప్రపంచ ఉత్తమ పద్ధతులను అవలంబించడం ద్వారా ఈ సమస్యను అధిగవిుంచవచ్చని గుర్తించిన కేంద్రం ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు రూ.2,000 కోట్లు కేటాయించింది.
బాటలు వేసిన గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం
ఏపీలో ప్రస్తుతం 1,23,396 విద్యుత్ వాహనాలున్నాయి. 2030 నాటికి వీటి సంఖ్య 7,82,660కు చేరుతుందని అంచనా. ఈ నేపథ్యంలో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విద్యుత్ వాహనాలు, చార్జింగ్ స్టేషన్ల విధి విధానాలను ప్రత్యేక పాలసీగా రూపొందించింది. రాష్ట్ర వ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లో ప్రతి 3 కిలోమీటర్లకు ఒకటి, జాతీయ రహదారుల్లో 25 కిలోమీటర్లకు ఒకటి చొప్పున విద్యుత్ చార్జింగ్ కేంద్రాలను నెలకొల్పాలని సంకల్పించింది.
అందుకు అవసరమైన 4,000 స్థలాలు అప్పట్లోనే గుర్తించింది. విజయవాడ, అమరావతి, విశాఖ, తిరుపతిలను మోడల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ నగరాలుగా గుర్తించింది. పబ్లిక్ చార్జింగ్ స్టేషన్ల(పీసీఎస్)ను ప్రైవేటు వ్యక్తులు ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. దీనికి ఎటువంటి లైసెన్స్ తీసుకోనవసరం లేదని చెప్పింది. ఇప్పుడు కేంద్రం అదే బాటలో నడుస్తోంది.
దేశవ్యాప్తంగా 50 జాతీయ రహదారుల వెంబడి, టోల్ ప్లాజాలు,విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్‌లు వంటి ప్రజా రవాణా ఉండే ప్రాంతాల్లో చార్జింగ్ స్టేషన్లు పెట్టనుంది. నగరాలు, పట్టణాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోనూ వాటిని అందుబాటులోకి తీసుకురావాలని అనుకుంటోంది.