విజయవాడ: చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. విజయవాడలో పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు వైద్యం కావాలంటే ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని చెప్పారు. చంద్రబాబు నిర్వహించింది మెగా DSC కాదని, దగా DSC అని విమర్శించారు. రాజధాని పేరు చెప్పి రైతులను చంద్రబాబు నట్టేట ముంచారని ఆరోపించారు. భూములు ఇచ్చిన రైతుల ఫ్లాట్స్ ఎక్కడో ఈ రోజుకీ తెలియదని అన్నారు. పరిశ్రమలకు భూముల పేరుతో దగా చేస్తున్నారని చెప్పారు. రూపాయికి ఎకరం భూమి ఇస్తా అని లోకేశ్ అంటున్నారని, కనీసం భయం, బాధ్యత లేదని విమర్శించారు.
‘‘ఓటు వేసిన, ఓటు వేయించిన టీడీపీ కార్యకర్తలు ప్రభుత్వం వల్ల మోసపోయామని బాధ పడుతున్నారు. డబ్బులు ఇవ్వందే పని జరగడం లేదని టీడీపీకి మద్దతుగా నిలిచిన NRIలు నరకయాతన అనుభవిస్తున్నారు. మంగళగిరిలో వారం వారం దుకాణం అన్నారు.. దర్బార్ అన్నారు. ఎన్నికల ముందు జనసేన అధ్యక్షుడు అర్జీలు తీసుకున్నారు.. ఇప్పుడు ఎందుకు తీసుకోవడం లేదు. రెండేళ్లు నిండింది ఇంతకన్నా దివాలా కోరు ప్రభుత్వం ఎక్కడైనా ఉందా?
సమాజానికి మంచి పౌరులను తయారు చేసే విద్యా వ్యవస్థలోనూ అవినీతి చేశారు. DSC కాంట్రాక్ట్ ఉద్యోగం చేసే వాడికి 1ST ర్యాంక్ వస్తుంది. DSC మెరిట్ లిస్ట్ ఎందుకు ప్రకటించడం లేదు. మెరిట్ లిస్ట్ ప్రకటించకుండా మెరిట్ పరీక్షలు నిర్వహించడం ఏంటి? మెగా DSC కాదు మెగా స్కాం ఇది. సంపద సృష్టిస్తాం.. సంపద మొత్తాన్ని ప్రజలకు పంచుతాం అన్నారు. టీడీపీ మానిఫెస్టో ఎక్కడ? ఏమైంది? సూపర్ సిక్స్ సూపర్ హిట్ అన్నారు. ఏది సూపర్ హిట్ ఎక్కడ ఉంది.
చంద్రబాబు నాయుడు ఒకప్పుడూ PPP అనేవాడు ఇప్పుడేమో P4 అంటున్నాడు. PPP అయిపోయింది. ఇప్పుడు P4 కూడా అయిపోయింది అంటున్నాడు. బీపీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ లోన్లు ఎత్తేశారని తెగ గోల చేశారు.. మరి అధికారంలోకి రాగానే ఇచ్చారా? గుది బండగా అమరావతిని తయారు చేశారు. డబుల్ ఇంజన్ సర్కార్ అని డబ్బాలు కొట్టుకున్నారు. ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు. కేంద్రం పెంచితే మాకు ఏ సంబంధమూ లేదని అంటున్నారు కింద, పైన ప్రభుత్వాలు ఎవరివి? జనాన్ని తాకట్టు పెట్టి అప్పులు చేశారు’’ అని తెలిపారు.
ఎక్కువ మందిని కనాలా?
పిల్లలను ఎక్కువ మందిని కనాలన్న అంశంపై ఎవరిది వాదన వాళ్లదని పేర్ని నాని అన్నారు. ‘‘విజన్ నాయకుడిగా చెప్పుకునే చంద్రబాబు ఎక్కువ మందిని కనాలని చెప్తున్నారు. చంద్రబాబు ఏ రోజూ నిజాలు చెప్పలేదు.. నిజం చెప్పినా అది అమలు అవ్వదు. 1993లో రామారావును గద్దె దింపిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అన్ని యూ టర్న్ లే. 2004లో మోదీ దుర్మార్గుడు అన్నారు. 2014లో మోదీ అచ్చాహై అన్నాడు. 2018లో మోదీకి భార్య లేదు కుటుంబం లేదు మోదీ టెర్రరిస్ట్ అన్నాడు. 2024 కు మోదీ ప్రపంచ నాయకుడు అంటూ చంద్రబాబు కీర్తిస్తున్నాడు.
ఇప్పుడేమో నేను హిందూ, జగన్ నువ్వు క్రిస్టియన్ అంటాడు. చంద్రబాబు ఎన్నికల ముందు నేను మారాను అంటాడు, నమ్మండి అంటాడు. చంద్రబాబు ప్రకటనతో వాళ్ల అబ్బాయి, వాళ్ల కోడలే కన్విన్స్ అవ్వరు.. రాష్ట్ర ప్రజలు కన్విన్స్ అవుతారా? ఇరాన్, ఇజ్రాయిల్ వార్‌కు పిల్లలకు ఇచ్చే పాఠ్య పుస్తకాలకు ఏంటి సంబంధం? దివాలా కోరు దిక్కుమాలిన ప్రభుత్వం ఇది. లక్షలాది మంది పిల్లలను కంటే చికిత్స అందించడానికి ఆసుపత్రులు ఉన్నాయా? ఉప ముఖ్యమంత్రి ముక్కులో కణితి వస్తే హైదరాబాద్ వెళ్లి ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నాడు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పిస్తున్న వారు ఒక్కరైనా ఉన్నారా?’’ అని నిలదీశారు.


