సిలికా శాండ్‌ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించండి

Peddireddy Ramachandra Reddy says Promote silica sand based industries - Sakshi

సాక్షి, అమరావతి: సిలికా శాండ్‌ ఆధారిత పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించాలని గనులు, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులకు సూచించారు. రాష్ట్రంలో ఖనిజ వనరులను సద్వినియోగం చేసుకుంటూ ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని పెంచుకోవాలన్నారు. తాడేపల్లిలోని పంచాయతీరాజ్‌ కమిషనర్‌ కార్యాలయంలో మంగళవారం గనుల శాఖ అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. ఎలాంటి అవినీతికి తావు లేకుండా గనుల శాఖలో పారదర్శక విధానాలను తీసుకువచ్చామన్నారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులు, ఈ–పర్మిట్‌ విధానం ద్వారా ఎలాంటి జాప్యం లేకుండా అనుమతులు మంజూరు చేస్తున్నామన్నారు. ప్రభుత్వం గనుల లీజుల విషయంలో తీసుకుంటున్న నిర్ణయాల వల్ల గత ఏడాది కంటే ఈ ఏడాది ఆదాయం పెరుగుతుందని చెప్పారు. ఈ మేరకు అధికారులు కూడా బాధ్యతతో వ్యవహరించాలని కోరారు. ఏపీఎండీసీ ద్వారా రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రాజెక్టులను ప్రారంభించామని, వాటి ద్వారా కూడా అదనపు ఆదాయం ప్రభుత్వానికి సమకూరుతుందని అధికారులు తెలిపారు. సిలికా శాండ్, కాల్సైట్, ఐరన్‌ ఓర్, గ్రానైట్‌ ఖనిజాలను వెలికితీయడం ద్వారా రెవెన్యూ వనరులను పెంచేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వివరించారు. ఈ సమావేశంలో గనులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, గనుల శాఖ డైరెక్టర్‌ వీజీ వెంకటరెడ్డి, జాయింట్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్, ఏపీఎండీసీ జీఎం (మైన్స్‌) కేదార్‌నాథ్‌రెడ్డి, జీఎం (కోల్‌) లక్ష్మణరావు, డీజీఎం నతానేయల్‌ తదితరులు పాల్గొన్నారు.   

whatsapp channel

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top