పవన్‌కళ్యాణ్‌ ఇలాకాలో 85 ఏళ్ల అవ్వ ఆవేదన | Old Women Request To AP Dy CM Pawan Kalyan Over Pension, More Details Inside | Sakshi
Sakshi News home page

పవన్‌కళ్యాణ్‌ ఇలాకాలో 85 ఏళ్ల అవ్వ ఆవేదన

Jun 4 2025 9:11 AM | Updated on Jun 4 2025 10:52 AM

Old Women Request to AP Dy CM Pawan Kalyan

పింఛన్‌ తీసేసి బతికుండగానే చంపేస్తున్నారు 

పిఠాపురం: ‘వృద్ధాప్య పింఛనే ఇప్పటివరకు నన్ను బతికించింది. ఇప్పుడు ఆ పింఛన్‌ కూడా ఆపేసి ఏవో కారణాలు చెబుతున్నారు. నేను బతికున్నట్టు నిరూపించుకోమంటున్నారు. నేను కాలు కదపలేను. ఎక్కడికీ వెళ్లలేను. పింఛన్‌ లేకపోతే నాకు దిక్కులేదు. దాన్ని కూడా తీసేసి బతికుండగానే చంపేస్తున్నారు’ అంటూ డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ ఇలాకాలో 85 ఏళ్ల అవ్వ కన్నీటిపర్యంతమైంది. 

కాకినాడ జిల్లా పిఠాపురం డ్రైవర్స్‌ కాలనీకి చెందిన చోడిశెట్టి సుబ్బారావు(85) కొన్నేళ్లుగా వృద్ధాప్య పింఛన్‌ అందుకుంటూ.. కుమార్తె పార్వతి వద్ద నివసిస్తోంది. వైఎస్‌ జగన్‌ సర్కార్‌లో ఎలాంటి ఇబ్బంది లేకుండా వలంటీర్‌ ద్వారా ఇంటి వద్దే పింఛన్‌ అందుకున్న ఆమెకు కూటమి ప్రభుత్వంలో కష్టాలు ఎదురయ్యాయి. ఈ నెల పింఛన్‌ను ఆపేసిన కూటమి సర్కార్‌.. బతికున్నట్లుగా నిరూపించుకోవాలంటూ ఆమెకు అగ్ని పరీక్ష పెట్టింది. దీంతో తనను ఆదుకోవాలంటూ ఆ వృద్ధురాలు విలపిస్తోంది. 

నేను బతికే ఉన్నా కదా.. 
‘గతంలో ఏ ఇబ్బంది లేకుండా వలంటీరే అన్నీ చూసుకునేవాడు. ఇప్పుడు ఎవరూ రావట్లేదు. వృద్ధాప్యం వల్ల వేలిముద్రలు పడడం లేదంటున్నారు. నా కళ్లు మసకబారడంతో ఐరిస్‌ కూడా పడటం లేదంటున్నారు. ఏది పడకపోయినా నేను బతికే ఉన్నా కదా. నాకు పింఛనే ఆధారం అని చెబుతున్నా ఎవరూ కనికరించడం లేదు. నాకు పింఛనైనా ఇప్పించండి లేదా నన్ను చంపేయండి’ అంటూ వృద్ధురాలు విలపించింది. ‘మా అమ్మకు నెలనెలా వచ్చే పింఛన్‌ డబ్బులతోనే మందులు కొంటున్నా. పవన్‌కళ్యాణ్‌కు ఓటు వేసినందుకు ఇప్పుడు పింఛన్‌ గురించి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది’ అంటూ ఆమె కుమార్తె పార్వతి వాపోయింది. తమకు న్యాయం చేయాలని కోరింది. 

Advertisement
 
Advertisement
Advertisement