Nadu Nedu: ఏపీలో విద్య భేష్‌

NCERT Appreciated Andhra Pradesh Government Education System - Sakshi

నాడు–నేడుతో మౌలిక సదుపాయాలు పెరిగి మంచి ఫలితాలు 

ఏపీ కార్యక్రమాలకు ఇతర రాష్ట్రాల ప్రతినిధుల కితాబు 

ఎఫ్‌ఎల్‌ఎన్‌లో ఏపీ ముందంజ 

ముగిసిన ఎన్సీఈఆర్టీ శిక్షణ సదస్సు 

సాక్షి, అమరావతి: విద్యా రంగంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు, సంస్కరణలు చాలా బాగున్నాయని జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్టీ), ఇతర రాష్ట్రాల విద్యా రంగ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. ఈ చర్యలతో పాఠశాల విద్యలో అద్భుతమైన ఫలితాలు సుసాధ్యమని చెప్పారు. నేషనల్‌ కరిక్యులమ్‌ ఫ్రేమ్‌ వర్కుపై ఎన్‌సీఈఆర్టీ ఆధ్వర్యంలో ఇక్కడ జరిగిన దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాల విద్యా విభాగాల ప్రతినిధుల రెండు రోజుల శిక్షణ సదస్సు మంగళవారం ముగిసింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో విద్యా రంగంలో అమలవుతున్న వివిధ కార్యక్రమాల గురించి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్, పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌ ఎస్‌.సురేష్‌ కుమార్, రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) డైరెక్టర్‌ బి.ప్రతాప్‌రెడ్డి వేర్వేరుగా పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్లతో వివరించారు.

రాష్ట్రంలో అమలవుతున్న కార్యక్రమాలు అభినందనీయమని ఎన్‌సీఈఆర్టీ ప్రతినిధులు, వివిధ రాష్ట్రాల ప్రతినిధులు అన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా అమలవుతున్న అమ్మ ఒడితో డ్రాపవుట్లు పూర్తిగా తగ్గి, చేరికలు గణనీయంగా పెరగడం, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలవైపు విద్యార్థులు మళ్లడం మంచి పరిణామమని పేర్కొన్నారు. ఎక్కడా లేని విధంగా వేల కోట్ల ఖర్చుతో పాఠశాలల రూపురేఖలనే మార్చివేసేలా నాడు – నేడు కార్యక్రమాలు అమలు చేయడం, విద్యార్థులు, ఉపాధ్యాయులకు సదుపాయాలు సమకూర్చడం గొప్ప విషయమని మైసూరులోని రీజనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ (ఆర్‌ఐఈ) ప్రతినిధులు చెప్పారు.

కార్పొరేట్‌ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ స్కూళ్లు అభివృద్ధి చేయడం, ఆంగ్ల మాధ్యమం, కరిక్యులమ్‌ సంస్కరణలతో నాణ్యమైన విద్య అందుబాటులోకి వచ్చి, పేద వర్గాల పిల్లల అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని ఢిల్లీ నుంచి వచ్చిన ఎన్‌సీఈఆర్టీ ప్రతినిధి అభిప్రాయపడ్డారు. జాతీయ నూతన విద్యా విధానం అమల్లోకి రాకముందే రాష్ట్రంలో పునాది విద్యను బలోపేతం చేయడం అభినందనీయమని అన్నారు. ఫౌండేషన్‌ లిటరసీ అండ్‌ న్యుమరసీ (ఎఫ్‌ఎల్‌ఎన్‌)లో దేశంలోనే ఏపీ ముందంజలో నిలిచిందన్నారు. సదస్సు ముగింపు సందర్భంగా ఆయా రాష్ట్రాల ప్రతినిధులకు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్‌ బి.ప్రతాప్‌రెడ్డి జ్ఞాపికలను అందించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top