ఊరు దాటకుండా.. కరోనా రాకుండా

Mushidipalli panchayat away from Corona virus - Sakshi

అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న గిరిజనులు

కరోనాకు దూరంగా ముషిడిపల్లి పంచాయతీ

గ్రామాల నుంచి బయటకు రాకుండా జీవనం

ప్రభుత్వ సూచనలు పాటిస్తూ కరోనా కట్టడి 

శృంగవరపుకోట రూరల్‌: అన్ని దేశాలు కరోనా బారినపడి అల్లాడిపోతుంటే.. విజయనగరం జిల్లా ముషిడిపల్లి పంచాయతీ పరిధిలోని గిరిజనులు ఊరు దాటకుండా కరోనా మహమ్మారిని కట్టడి చేస్తున్నారు. ప్రభుత్వ సిబ్బంది సూచనలను పాటిస్తూ కరోనా బారిన పడకుండా తమ జీవనాన్ని ప్రశాంతంగా కొనసాగిస్తున్నారు. వివరాలు.. శృంగవరపుకోట మండలం పరిధిలోని ముషిడిపల్లి గిరిజన పంచాయతీ పరిధిలో ముషిడిపల్లి, చినఖండేపల్లి, దొర్లపాలెం, బందవలస, తాటిపూడి గ్రామాలున్నాయి. వీటిలో 372 కుటుంబాలకు చెందిన 1,346 మంది నివసిస్తున్నారు.

కరోనా వైరస్‌ ఒక మనిషి నుంచి మరో మనిషికి సోకుతుందన్న విషయాన్ని తెలుసుకున్న వీరంతా.. ఊరు దాటకుండా జీవించాలని నిర్ణయించుకున్నారు. నిత్యావసర సరుకుల కోసం వెళ్లేవారు తప్పనిసరిగా మాస్‌్కలు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులు శుభ్రం చేసుకోవడం వంటి నిబంధనలు పాటిస్తున్నారు. సర్పంచ్‌ సొలుబొంగు దారప్ప, పంచాయతీ కార్యదర్శి కె.అనిల్‌కుమార్, గ్రామ సచివాలయ సిబ్బంది, ఏఎన్‌ఎం, ఆశా వర్కర్, వలంటీర్ల సూచనలను, సలహాలను పాటిస్తూ కరోనాకు దూరంగా జీవిస్తున్నారు.  

ప్రత్యేక జీవనశైలే కారణం.. 
ఇక్కడి గిరిజనుల ప్రత్యేక జీవనశైలి కూడా కరోనా కేసులు నమోదు కాకుండా తోడ్పడింది. వీరు స్వతహాగా దూరం దూరంగా జీవిస్తుంటారు. ఇక గ్రామాల్లో కరోనా వ్యాప్తి చెందకుండా ప్రత్యేక పారిశుధ్య పనులు చేయిస్తున్నాం. రోజూ సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణం పిచికారీ చేయించడం, బ్లీచింగ్‌ పౌడర్‌ జల్లించడంతో పాటు పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూస్తున్నాం.  
 – సొలుబొంగు దారప్ప, సర్పంచ్, ముషిడిపల్లి 

అవగాహన కల్పిస్తున్నాం..  
సచివాలయ సిబ్బంది, ఏఎన్‌ఎం, ఆశా వర్కర్, వలంటీర్లతో కలిసి ఇక్కడి గిరిజనులకు కరోనా గురించి అవగాహన కల్పిస్తున్నాం. వీరి ప్రత్యేక ఆహారపు అలవాట్లు, స్వీయ నియంత్రణ చర్యల కారణంగా కరోనాను కట్టడి చేయగలిగాం. గ్రామస్తుల సహకారంతో మున్ముందు కూడా కరోనా కేసులు నమోదు కాకుండా చూస్తాం. 
– కె.అనిల్‌కుమార్, పంచాయతీ కార్యదర్శి, ముషిడిపల్లి  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top