పేదరికంపై పోరాడి గెలిచాం  | Sakshi
Sakshi News home page

పేదరికంపై పోరాడి గెలిచాం 

Published Wed, Jan 17 2024 3:42 AM

Modi inaugurates NACIN complex in Andhra Pradesh - Sakshi

సాక్షి, పుట్టపర్తి (శ్రీసత్యసాయి జిల్లా): దేశంలో పేదరికాన్ని ఓడించే సత్తా తమ ప్రభుత్వానికే ఉందని, గత తొమ్మిదేళ్లలో సుమారు 25 కోట్ల మంది ప్రజలకు పేదరికం నుంచి విముక్తి కల్పించామని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. నీతి ఆయోగ్‌ తాజా నివేదికలోనూ ఇదే విషయం స్పష్టమైందన్నారు. విద్య, వైద్యం, ఉపాధి, స్వయం ఉపాధి రంగాలకు ప్రభుత్వం భారీగా ఖర్చు చేసి పేదలకు సౌకర్యాలు పెంచిందని తెలిపారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక పేదరిక నిర్మూలన కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టామన్నారు. వివిధ పథకాల ద్వారా ప్రజల సొమ్మును తిరిగి వారికే ఇస్తున్నామని చెప్పారు.

గత పదేళ్లలో 10 కోట్ల నకిలీ పేర్లను తొలగించడంతో నేడు ప్రతి పైసా అర్హులైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు చేరుతోందన్నారు. ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచామన్నారు. మంగళవారం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రంలో జాతీయ కస్టమ్స్, పరోక్ష పన్నులు, నార్కోటిక్స్‌ అకాడమీ (నాసిన్‌) కొత్త క్యాంపస్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు.

ఎగ్జిబిషన్‌ను తిలకించి ఇండియన్‌ రెవెన్యూ సర్విస్‌ (ఐఆర్‌ఎస్‌) 74, 75వ బ్యాచ్‌లకు చెందిన ట్రైనీ అధికారులతోపాటు భూటాన్‌ రాయల్‌ సివిల్‌ సర్విస్‌ ట్రైనీ ఆఫీసర్లతో ప్రధాని ముచ్చటించారు. పాలసముద్రం విశిష్టతను గుర్తు చేస్తూ ఘన వారసత్వం కలిగిన ఈ ఆధ్యాత్మిక ప్రాంతం దేశ నిర్మాణం, సుపరిపాలనతో మమేకమవుతోందన్నారు. రామాయణంలో ప్రస్తావించిన జటాయువు నేలకొరిగిన స్థలం ఇక్కడకు సమీపంలోనే ఉండటం, అయోధ్యలో రామాలయ ప్రతిష్టాపనకు ముందు ఈ ప్రాంతాన్ని సందర్శించడం, ఈ పుణ్యకాలంలో పురాతన ఆలయాల్లో ఆశీర్వాదాలు అందుకోవటాన్ని అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. పుట్టపర్తి సత్యసాయిబాబా, స్వాతంత్య్ర సమరయోధుడు పద్మశ్రీ కల్లూరు సుబ్బారావు, ప్రఖ్యాత తోలుబోమ్మల కళాకారుడు దళవాయి చలపతిరావు ఈ ప్రాంతవాసులే కావడం గర్వకారణమన్నారు. అద్భుతమైన విజయనగర సామ్రాజ్య సుపరిపాలన మూలాలు ఈ ప్రాంతంలోనే ఉన్నాయని గుర్తు చేశారు. 

మహాత్ముడు కలలుకన్న ‘రామరాజ్యం’ 
‘జాతిపిత మహాత్మాగాంధీ పలు సందర్భాల్లో రామరాజ్యం గురించి చెప్పారు. అలాంటి సుపరిపాలన అందాలని ఆకాంక్షించారు. రామరాజ్యం ఆలోచన నిజమైన ప్రజాస్వామ్యం వెనుక ఉన్న భావన అని అన్నారు. రామరాజ్యంలో పన్నుల వ్యవస్థ గురించి తులసీదాస్‌ రామ్‌ చరిత్‌ మానస్‌లోనూ ఎంతో గొప్పగా వర్ణించారు’ అని ప్రధాని పేర్కొన్నారు. ‘రామ­రాజ్య వాసి (పౌరులు).. తల ఎత్తుకుని న్యా­యం కోసం పోరాడు.. అందరినీ సమానంగా చూడు.. బలహీనులను రక్షించు.. ధర్మాన్ని నిల­బెట్టు’ అనే సంస్కృత శ్లోకాన్ని ఈ సందర్భంగా ప్రధాని ప్రస్తావించారు.

అవినీతికి వ్యతిరేకంగా పోరాటం, అవినీతిపరులపై చర్యలు తీసుకోవడం ప్రభుత్వ లక్ష్య­మన్నారు. దేశ నిర్మాణంలో తమ కృషిని గుర్తించాలని అధికార యంత్రాంగాన్ని కోరారు. పాలసము­ద్రం పర్యటనకు ముందు లేపాక్షిలోని వీర­భద్ర స్వామి ఆలయాన్ని ప్రధాని సందర్శించారు. భక్తులతో కలిసి భజనలు, కీర్తనల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, పరోక్ష పన్నుల బోర్డు చైర్మన్‌ సంజయ్‌ కుమార్‌ అగర్వాల్‌ తదితరులు పాల్గొన్నారు.  

పన్నుల వసూళ్లలో ‘రెవెన్యూ’ కీలక పాత్ర 
ఈ నెల 22న అయోధ్యలో శ్రీరామ మందిర ప్రతిష్టాపనకు ముందు ‘నాసిన్‌’ను ప్రారంభించడం శుభ సూచికమని ప్రధాని పేర్కొన్నారు.  ప్రాచీన తమిళ కవి తిరువల్లువర్‌ కవితలను ఉటంకిస్తూ ప్రజాస్వామ్యంలో ప్రజల సంక్షేమానికి దోహదం చేసే పన్నుల వసూళ్లలో రెవెన్యూ అధికారుల కీలక పాత్రను ప్రస్తావించారు. దేశానికి జీఎస్టీ రూపంలో తాము ఆధునిక వ్యవస్థను అందించడంతోపాటు ఆదాయపు పన్నును సరళీకృతం చేశామన్నారు. 

Advertisement
 
Advertisement