‘పంచాయతీరాజ్‌’లో భారీగా పదోన్నతులు | Sakshi
Sakshi News home page

‘పంచాయతీరాజ్‌’లో భారీగా పదోన్నతులు

Published Mon, Sep 12 2022 4:05 AM

Massive promotions in Panchayat Raj Department Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: పంచాయతీరాజ్‌ శాఖలో ప్రస్తుతం ఈవోపీఆర్డీలుగా పనిచేస్తున్న వారితోపాటు జిల్లా, మండల పరిషత్‌ కార్యాలయాల్లో ఆడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్లు (ఏవో)గా పనిచేస్తున్న వారికి ఎంపీడీవోలుగా పదోన్నతులు కల్పించే ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

పాతికేళ్ల తర్వాత 237 మంది ఎంపీడీవోలకు ఇటీవల ఒకేసారి పదోన్నతి కల్పించిన విషయం తెలిసిందే.  రాష్ట్రవ్యాప్తంగా మళ్లీ ఎంపీడీవోల పోస్టులు పెద్ద సంఖ్యలో ఖాళీగా ఉండడంతో కిందిస్థాయి ఉద్యోగులకు పదోన్నతులు కల్పించే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెట్టింది.

ఇక సాధారణ నిబంధనల ప్రకారం మండలాల్లో ఎంపీడీవో పోస్టుల్లో ఖాళీలు ఏర్పడినప్పుడు మూడు మార్గాల్లో వాటిని భర్తీచేస్తుంటారు. మొత్తం ఖాళీల్లో 30 శాతం పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీచేస్తారు. మిగిలిన పోస్టులను ఈవోపీఆర్‌డీలు.. జెడ్పీలు, ఎంపీడీవో ఆఫీసుల్లో ఏవోలుగా పనిచేసే వారికి పదోన్నతుల ద్వారా  భర్తీచేయాల్సి ఉంటుంది.

ఇదిలా ఉంటే, 20 రోజుల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్‌–1 పరీక్షల్లో ఉత్తీర్ణులైన 45 మందిని నేరుగా ఎంపీడీవోలుగా నియమించింది. మిగిలిన వాటిలో సుమారు 220 ఎంపీడీవో పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేసేందుకు ఇప్పుడు అధికారులు చర్యలు చేపట్టారు.  

నెలాఖరుకల్లా సీనియారిటీ జాబితాలు.. 
ఇక సెప్టెంబరు మొదటి వారానికల్లా ఈ పదోన్నతుల ప్రక్రియను పూర్తిచేసేందుకు పంచాయతీరాజ్‌ శాఖాధికారులు కార్యాచరణను సిద్ధంచేసుకున్నారు. ఇందులో భాగంగా.. జోన్ల వారీగా ఈఓపీఆర్డీలు, ఆడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్ల సీనియారిటీ జాబితాలను రూపొందించే ప్రక్రియ ఇప్పటికే ఆరంభమైంది.

సెప్టెంబరు నెలాఖరుకల్లా ఈ ప్రక్రియ పూర్తయితే, అక్టోబరులో డిపార్ట్‌మెంటల్‌ పదోన్నతుల కమిటీ ద్వారా పదోన్నతులు పొందే వారి తుది జాబితాలను అధికారులు రూపొందిస్తారు. నవంబరు ఐదో తేదీ కల్లా పదోన్నతులు పొందిన అధికారులకు కొత్త పోస్టింగ్‌లు కూడా ఇచ్చేందుకు చర్యలు చేపడుతున్నారు.

Advertisement
 
Advertisement