డబ్బుతో దగ్గరి విద్య

Mass Copying In Nagarjuna University Distance Education Examinations - Sakshi

ఏఎన్‌యూ దూరవిద్య బాగోతం 

ఒక్కో విద్యార్థి నుంచి రూ.3 వేల చొప్పున వసూళ్లు

పుస్తకాలు పెట్టి మరీ చూచిరాతలు

కన్నెత్తి చూడని అధికారులు 

సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘‘మీకు డిగ్రీ సర్టిఫికెట్‌ కావాలా! అయితే, మా సెంటర్‌లో చేరండి.. కచ్చితంగా పాస్‌’’ తరహా ప్రకటనలతో దూరవిద్య కేంద్రాలు డబ్బు పోగేసుకుంటున్నాయి. జిల్లాలో నాగార్జున యూనివర్సిటీ దూర విద్య పరీక్షలు  అక్టోబర్‌ 26వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. సుమారు 3వేల మంది విద్యార్థుల వరకూ పరీక్షలకు హాజరవుతున్నారు. అయితే, పరీక్షల్లో పాస్‌ చేస్తామని ముందుగానే అడ్మిషన్లు తీసుకున్న సెంటర్లు .. పరీక్షల సమయంలో పుస్తకాలు పెట్టి మరీ పరీక్షలు రాపిస్తామంటూ అదనంగా ఒక్కో విద్యార్థి నుంచి సగటున రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకూ వసూలు చేశారు. ఈ విధంగా వసూలు చేసి.. ఇందులో యూనివర్సిటీ అధికారులకు కూడా మామూళ్లు ఇచ్చి ఇష్టారాజ్యంగా పరీక్షలను నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ఏఎన్‌యూకు అనుబంధంగా అనంతపురంతో పాటు తాడిపత్రి, ధర్మవరం, పామిడిల్లో కేంద్రాలుండగా..ఆయా చోట్ల పరీక్షలు జరుగుతున్నాయి.

ముందుగానే ఆయా సెంటర్లలో ఎవరు కూడా నేరుగా రాకుండా గేట్లు వేసి మరీ పరీక్షలు కొనసాగిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా వస్తున్నట్టు తెలిస్తే లోపల ఉన్న వారిని అలర్ట్‌ చేస్తున్నారు. తద్వారా ఆ సమయంలో కాపీయింగ్‌ జరగకుండా జాగ్రత్త పడుతున్నారు. ఆ తర్వాత యథావిధిగా తమ పని కానిస్తున్నారు. మొత్తంగా దూరవిద్య పేరుతో కొన్ని సెంటర్లు డబ్బుల దందాకు తెరలేపి చదువుకు మరీ విలువ లేకుండా చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.  

రూ.60 లక్షలకు పైమాటే.. 
జిల్లాలో మొత్తం 3వేల మంది వరకూ ఏఎన్‌యూ దూర విద్యకు హాజరువుతున్నారు. వీరికి కనీసం పుస్తకాలు కూడా సకాలంలో అందించలేదు. దీంతో పరీక్షకు ఎవ్వరూ సిద్ధమయ్యే పరిస్థితి లేదు. తీరా పరీక్షలు వచ్చిన తర్వాత ఇప్పుడు పరీక్షల్లో పాసు కావాలన్నా.. చూసి రాయలన్నా ఒక్కో విద్యార్థి రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకూ ఇవ్వాలని సదరు దూరవిద్య కేంద్రాల నిర్వాహకులు తేల్చి చెబుతున్నారు. ఫలితంగా జిల్లాలో పరీక్షలు రాస్తున్న 3వేల మంది విద్యార్థులు కాస్తా రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకూ చెల్లించాల్సి వచ్చింది. ఒకవేళ ఎవరైనా డబ్బులు ఇవ్వకపోతే వారు చూచి రాసేందుకు అనుమతించడం లేదు. అంతేకాకుండా ప్రత్యేకంగా పక్కన కూర్చోబెట్టి చూసిరాసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా 3 వేల మంది విద్యార్థుల నుంచి రూ.2 వేల నుంచి రూ.3 వేల చొప్పున లెక్కిస్తే రూ.60 లక్షల నుంచి రూ.90 లక్షల వరకూ వసూలు చేసినట్టు సమాచారం. ఇందులో యూనివర్సిటీ దూరవిద్య అధికారులకు కూడా భారీగానే ముట్టచెబుతున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.  

యూనివర్సిటీ పరిశీలకులు ఎక్కడ?.. 
వాస్తవానికి దూరవిద్య పరీక్షలు జరిగే సమయంలో సదరు యూనివర్సిటీకి చెందిన సిబ్బంది పరిశీలకులుగా వస్తారు. పరీక్షలు జరిగే సమయంలో అక్కడే మకాం వేసి కట్టుదిట్టంగా పరీక్షలు జరిగేలా చూడాలి. అయితే, ఏఎన్‌యూ దూర విద్యలో మాత్రం ఈ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. యూనివర్సిటీ నుంచి వచ్చిన పరిశీలకులు ఎక్కడా కనిపించని పరిస్థితి. కనీసం సెంటర్ల వైపు కన్నెత్తి కూడా చూడకపోవడం గమనార్హం.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top