తోసేశారా.. దూకేసిందా? | Many suspicions over the death of Assam student Himashree | Sakshi
Sakshi News home page

తోసేశారా.. దూకేసిందా?

Oct 11 2026 5:13 AM | Updated on Oct 11 2026 5:13 AM

Many suspicions over the death of Assam student Himashree

అసోం విద్యార్థిని హిమశ్రీ మృతిపై పలు అనుమానాలు  

శ్రీకాకుళం జిల్లాలో రైలు పట్టాల పక్కన ఈ నెల 7న ఆమె మృతదేహం లభ్యం   

చుట్టూ మగవాళ్లున్నారు.. భయంగా ఉంది అంటూ కుటుంబ సభ్యులకు సందేశం 

ఆ తర్వాత ఫోన్‌ స్విచ్ఛాఫ్‌..  అసోం సీఎం దృష్టికి విద్యార్థిని వ్యవహారం 

ఏపీకి వచ్చి ఆ రాష్ట్ర ఐజీ విచారణ

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: అసోంకు చెందిన విద్యార్థిని, కళా­కారిణి హిమశ్రీ బోరో(20) మృతి వ్యవ­హారం దేశవ్యాప్తంగా సంచల­నంగా మారింది. అక్టోబర్‌ 7న శ్రీకాకు­ళం జిల్లా దూసి–­పెనుబర్తి గ్రామాల మధ్య రైలు పట్టాల పక్కన ఆమె మృతదేహం లభ్యమైంది. విశాఖలో రైలెక్కిన ఆమె.. శ్రీకాకుళంలో శవమై తేలడం పలు అనుమా­నాలకు తావిస్తోంది. ‘నా చుట్టూ చాలా మంది మగ­వాళ్లు­న్నారు.. నాకు భయంగా ఉంది’ అంటూ కుటుంబ సభ్యులకు ఆమె పంపిన చివరి సందేశం.. ఘటన వెనక ఉన్న నేర కోణాన్ని బలంగా సూచిస్తోంది.

అసలేం జరిగిందంటే.. 
గౌహతిలోని బి.బోరూహ్‌ కాలేజీలో చదువుతున్న హిమశ్రీ ఒక డ్యాన్స్‌ పోటీలో పాల్గొనేందుకు సెప్టెంబర్‌ 30న తన బృందంతో కలిసి విశాఖపట్నం వచ్చింది. పరీక్ష రాయాల్సి ఉండటంతో మిగిలిన వారి కంటే ముందే ఒంటరిగా అసోంకి తిరుగు పయనమైంది. అక్టోబర్‌ 5 అర్ధరాత్రి దాటిన తర్వాత 12.15గంటలకు విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో కన్యాకుమారి–దిబ్రూగడ్‌ వివేక్‌ ఎక్స్‌ప్రెస్‌(22503) రైలు ఎక్కింది. ఆమె ఎస్‌–2 కోచ్‌లోకి ప్రవేశించినట్టు తెలుస్తోంది. అక్టోబర్‌ 6 తెల్లవారుజామున 2.39గంటల సమయంలో హిమశ్రీ తన కుటుంబ సభ్యులను సంప్రదించింది. కోచ్‌లో మద్యం మత్తులో ఉన్న కొందరు వ్యక్తులు తనను చుట్టుముట్టారని, వేధిస్తూ, అసభ్యకర సైగలు చేస్తున్నారని తీవ్ర భయాందోళన వ్యక్తం చేసింది. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆమె ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ అయిపోయింది. 

రైలు పట్టాల పక్కన మృతదేహం.. 
రైలు అసోం చేరుకున్నాక హిమశ్రీ సీట్లో ఆమె లగేజీ, గుర్తింపు కార్డులు మాత్రమే ఉన్నాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఆర్‌పీఎఫ్, పోలీసు ట్రాక్‌ ఆధారంగా గాలింపు చేపట్టారు. అక్టోబర్‌ 7న శ్రీకాకుళం జిల్లా దూసి–పెనుబర్తి గ్రామాల మధ్య మలయపురం సమీపంలో రైలు పట్టాల పక్కన అటవీ పొదలో హిమశ్రీ మృతదేహం లభ్యమైంది. రైలు ప్రయాణించే మార్గంలో సుమారు 10 అడుగుల ఎత్తు ఉన్న ఒక బ్రిడ్జి లేదా గట్టు పైనుంచి ఆమె కిందకు పడిపోయినట్టు భావిస్తున్నారు. 

ఈ క్రమంలో అసోం విద్యార్థిని వ్యవహారం అక్కడి సీఎం దృష్టికి వెళ్లింది. దీంతో ఏపీ ప్రభుత్వాన్ని అసోం ప్రభుత్వం అప్రమత్తం చేసింది. రాష్ట్ర పోలీసు అ«ధికారుల ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. శనివారం అసోం నుంచి ఐజీ శివప్రసాద్‌ శ్రీకాకుళం వచ్చారు. జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్‌ పోలీసు అధికారులతో కలిసి ఘటనా స్థలంలో విచారణ జరిపారు. ఎస్పీ మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఏడు పోలీసు బృందాలు, జీఆర్‌పీ నుంచి ఒక బృందం విచారణ కోసం ఏర్పాటు చేశారు. 

ఆ వ్యక్తి ఎవరు?
విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో హిమశ్రీ రైలు ఎక్కేటప్పుడు ఒక తెలియని వ్యక్తి ఆమెను అనుసరిస్తూ ఆమెతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నట్టు స్టేషన్‌ సీసీటీవీ దృశ్యాలలో రికార్డు అయినట్టు తెలిసింది. ఆ వ్యక్తి ఎవరు? విశాఖ వచ్చిన డ్యాన్స్‌ బృందానికి తెలిసిన వ్యక్తా? లేదంటే ఆమె ఒంటరిగా ఉండటాన్ని గమనించి వేధించడానికి యత్నించిన వ్యక్తా? ప్రయాణంలో వేధించిన వారిలో అతను కూడా ఉన్నాడా? అనే కోణంలో విచారణ జరుపుతున్నట్టు సమాచారం. 

కాపాడలేకపోయిన రైల్‌ మదద్‌ పోర్టల్‌
రైలులో అసౌకర్యం కలిగితే రైల్‌ మదద్‌ పోర్టల్‌లో ఫిర్యాదు చేస్తే ఆర్‌పీఎఫ్‌ సిబ్బంది బెర్త్‌ దగ్గరికి వచ్చి సమస్య పరిష్కరించాలి. అత్యవసర పరిస్థితుల్లోనైతే నేరుగా రైలులో ఉన్న ట్రావెలింగ్‌ టికెట్‌ ఎగ్జామినర్‌ (టీటీఈ) వచ్చి పరిశీలించాలి. హిమశ్రీ కుటుంబ సభ్యులే కాదు హిమశ్రీ కూడా మదద్‌ పోర్టల్‌లో పరిస్థితులపై ఫిర్యాదు చేసినట్టుగా తెలిసింది. కానీ సిబ్బంది సరైన సమయంలో స్పందించలేదనే ఆరోపణలు వస్తున్నాయి. శ్రీకాకుళం రైల్వే స్టేషన్‌ వద్ద ఆర్‌పీఎఫ్‌ సిబ్బంది రైలు తనిఖీ చేసినప్పటికీ హిమశ్రీ అక్కడ కనిపించలేదు. ఆమె లగేజీ మాత్రమే ఉన్నట్టు గుర్తించినట్టు తెలిసింది.

తోసేసి చంపేశారా? 
హిమశ్రీని కొందరు దుండగులు లైంగికంగా వేధించి, ఆపై నడుస్తున్న రైలులో నుంచి కిందకు తోసేసి ఉంటారా? లేదంటే మద్యం మత్తులో ఉన్న గుంపు వేధింపులు తట్టుకోలేక, తనను తాను కాపాడుకునే ప్రయత్నంలో కదులుతున్న రైలు తలుపు వద్దకు వచ్చి ప్రమాదవశాత్తు కింద పడిందా? లేదా భయంతో దూకేసిందా? అనే విషయాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. వాస్తవంగా తెల్లవారు జామున 2.30 గంటల ప్రాంతంలో కోచ్‌లో గొడవలు, కేకలు వినిపించాయని కొందరు ప్రయాణికులు చెప్పినట్టు తెలిసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement