ఇజ్రాయెల్‌ ‘ఎగ’సాయం: బాబు ‘షో’కు.. నష్టాల సాగు

Loss To Farmers With The Israel‌ Agriculture Project During TDP Regime - Sakshi

కుప్పంలో అన్నదాతలకు అంతులేని నష్టం

ఫలించని ఆధునిక సేద్యం..

తగ్గిపోయిన భూసారం

అర్ధంతరంగా వెళ్లిపోయిన ఒప్పంద కంపెనీ

ఆ పద్ధతికి అలవాటు పడని రైతులు

కూలీలుగా మారిన వైనం 

వ్యవసాయం దండగ.. ఈ మాటకు వందశాతం పేటెంట్‌ హక్కు ప్రపంచంలో ఎవరికైనా ఉందంటే అది ఒక్క చంద్రబాబు నాయుడుకే. బషీర్‌బాగ్‌ కాల్పులు.. రైతులను గుర్రాలతో తొక్కించిన ఘటనల సాక్షిగా ఇది అందరికీ తెలిసిన వాస్తవం. అమరావతిలో మూడు పంటలు పండే వ్యవసాయ భూములను రియల్‌ వెంచర్లుగా మార్చేసిన సదరు చంద్రబాబు తనను మూడు దశాబ్దాలుగా ఎమ్మెల్యేగా ఎన్నుకుంటున్న అమాయక కుప్పం రైతులను ఎందుకు వదిలేస్తారు.. అస్సలు వదల్లేదు. భూసారాన్ని బట్టి సంప్రదాయ పంటలు పండించుకుంటున్న కుప్పం నియోజకవర్గ రైతులకు.. ఇవేమీ వద్దంటూ ఆధునిక వ్యవసాయం చేసి చూపిస్తామన్నారు. ఇజ్రాయెల్‌ సాంకేతిక పరిజ్ఞానం అంటూ గారడీ చేసి అర్ధంతరంగా మధ్యలోనే వదిలేశారు. ఫలితంగా కొద్దిమంది మినహా చాలామంది రైతులు దెబ్బతిన్నారు. ఆ సంగతేమిటో కాస్త వివరంగా చూద్దాం రండి..

సాక్షి ప్రతినిధి, తిరుపతి: కుప్పం నియోజకవర్గంలోని రైతులకు 1999లో అప్పటి ముఖ్యమంత్రి, స్థానిక ఎమ్మెల్యే చంద్రబాబు ఇజ్రాయెల్‌ ఆధునిక వ్యవసాయాన్ని పరిచయం చేశారు. పంటలకు ఎంత నీరు అవసరమో.. ఆ మేరకు డ్రిప్‌ ఇరిగేషన్‌ విధానంతో సేద్యాన్ని ప్రారంభిస్తున్నామని ఆర్భాటంగా ప్రకటించారు. సాంకేతికతను రైతులకు పరిచయం చేసి వారు ఆధునిక సేద్యం వైపు మళ్లేలా ఇజ్రాయెల్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నామని వెల్లడించారు. ఆ క్రమంలోనే తొలిసారిగా రామకుప్పం మండలంలోని చెల్దిగానిపల్లె వద్ద 200 ఎకరాల్లో డెమో ప్రాజెక్టును ఏర్పాటు చేశారు. (చదవండి: ప్రజాస్వామ్యంపై యుద్ధ ప్రకటన)

ఈ ప్రాజెక్ట్‌ ద్వారా ఆధునిక పరికరాలు, తక్కువ నీరు, భూమి వినియోగంతో నాణ్యత కలిగిన అధిక దిగుబడులు పొందవచ్చని చెప్పుకొచ్చారు. జపాన్‌ గ్రాంటుగా అందించిన రూ.10 కోట్లతో 1,600 ఎకరాల్లో ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. ఆ తర్వాత కుప్పం, రామకుప్పం, గుడుపల్లె, వి.కోట మండలాల్లో 10వేల ఎకరాల్లో ఇజ్రాయెల్‌ సేద్యం విస్తరణకు చర్యలు చేపట్టారు. ఈ వ్యవసాయానికి ఒప్పందం కుదుర్చుకున్న రైతుల భూ పత్రాలను బ్యాంకుల్లో తనఖా పెట్టి రుణాలను ఇప్పించారు. కానీ రైతులకు నాసిరకమైన సబ్సిడీ వ్యవసాయ పరికరాలను పంపిణీ చేశారనే ఆరోపణలు అప్పట్లో వెల్లువెత్తాయి. ఫలితంగా పండించిన పంటలలో లాభాలు రాకపోవడంతో రైతులు నష్టపోయారు. బ్యాంకుల్లో ఉన్న భూముల పత్రాలను విడిపించుకోలేక అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది.

తగ్గిన భూసారం 
వాస్తవానికి తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడులను సాధించాలంటే అందుబాటులో ఉన్న సహజ వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాల్సి ఉంటుంది. సహజంగా భూమిలో లభించే పోషక పదార్థాలను వినియోగించుకుంటూ ఎరువులపై వృథా ఖర్చును తగ్గించుకోవాల్సి ఉంటుంది. కానీ ఇవేమీ పట్టని నాటి బాబు హయాంలో పాలకులు ఎంతో ఘనంగా ఇజ్రాయెల్‌ సాంకేతిక పరిజ్ఞానంతో బిందు సేద్యం అమలు చేశారు. ఆ విధానంపై రైతులకు పూర్తి అవగాహన కల్పించకుండానే ఇజ్రాయెల్‌ సంస్థతో ఆర్భాటంగా ఒప్పందం కుదుర్చుకుని అర్ధంతరంగా వదిలేశారు. ఫలితంగా ఆ విధానం రైతులకు ఎందుకూ కొరగాకుండా పోయింది. పైగా ఆ సాంకేతిక పరిజ్ఞానంతో భూసారం తగ్గిపోయిందని కొంతమంది రైతులు ఇప్పటికీ గగ్గోలు పెడుతున్నారు.

బీహెచ్‌సీ కంపెనీ ఎవరిదంటే.. 
ఇక రైతులకు పదేళ్ల పాటు సాంకేతిక పరిజ్ఞానం అందిస్తామంటూ రూ.కోట్లలో కాంట్రాక్టు తీసుకుని మధ్యలోనే వెళ్లిపోయిన ఇజ్రాయెల్‌ సంస్థ బీహెచ్‌సీ(బ్రైట్‌ హషిత కంపెనీ) చంద్రబాబు బినామీలదేనన్న ప్రచారం బలంగా సాగింది. ఆయన ఆపద్ధర్మ సీఎంగా ఉన్న సమయంలో కూడా ఈ సంస్థకు నిధులు విడుదల చేయడంపై ఆరోపణలకు బలం చేకూరింది. బీహెచ్‌సీకి ఏటా రూ.2.80 కోట్లను కన్సల్టెన్సీ ఫీజుగా చెల్లించారు. 2014లో చంద్రబాబు ఆపద్ధర్మ సీఎంగా దిగిపోయే చివరి రోజుల్లో కూడా ఈ సంస్థకు రూ.1.50 కోట్లను చెల్లించారు. హైదరాబాద్‌ ఐఎంజీ భూముల కుంభకోణంలో ప్రధానంగా పేర్లు వినిపించిన ఢిల్లీరావు, పేట్రావ్‌లకు చెందినదే ఈ బీహెచ్‌సీ అనే వాదన ఉంది.

ఉడాయించిన ఇజ్రాయెల్‌ కంపెనీ.. 
రైతులు నష్టాల్లో కూరుకుపోయిన పరిస్థితుల్లో ఉంటే.. ఇజ్రాయెల్‌ సంస్థ బీహెచ్‌సీ(బ్రైట్‌ హషిత  కంపెనీ) అర్ధంతరంగా మాయమైంది. బిందు సేద్యం అమలుకు సాంకేతిక సాయం చేస్తామని చెప్పుకొచ్చిన కంపెనీ ప్రకటన మేరకు అప్పటి అధికారులు రామకుప్పం మండలం చెల్దిగానిపల్లె, శివునికుప్పం, ఎల్లాగ్రామం, బైపరెడ్లపల్లిలో అనేక మంది రైతుల నుంచి సుమారు 200 ఎకరాల భూములను సేకరించారు. ఆ విధానాన్ని అమలు చేసేందుకు రైతుల నుంచి సేకరించిన భూములకు సదరు కంపెనీ నగదు చెల్లిస్తుందని ప్రకటించారు. ఒక్కో రైతు నుంచి భూమిని సేకరించి పదేళ్లకు లీజు రాసుకున్నారు.

మొదట్లో ఎకరాకు రూ.లక్ష చెల్లిస్తామని నమ్మబలికారు. ఆ తర్వాత ఎకరాకు రూ.15 వేలు మాత్రమే  చెల్లిస్తామని చెప్పా రు. చివరికి ఆ నగదును సైతం ఎగ్గొట్టారు. ఇదేమిటని ప్రశ్నించిన రైతులకు ఖాళీగా ఉన్న బీడు భూములను వ్యవసాయానికి ఉపయోగపడేలా చేశామని చెప్పి చేతులు దులుపుకున్నారు. వాస్తవానికి పదేళ్లు ఉంటామని చెప్పిన ఇజ్రాయెల్‌ కంపెనీ ముందుగానే ఉడాయించింది. ఈ వ్యవహారం, రైతులు నష్టపోయిన నేపథ్యంపై 2006వ సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి.. చలపతి కమిషన్‌ నియమించారు. ఆ కమిషన్‌ క్షేత్ర స్థాయిలో జరిగిన అవకతవకవలను గుర్తించి నివేదికలు అందించింది. అయితే కమిషన్‌ నివేదిక అమలు కాకుండా బాబు వ్యవస్థలను ఉపయోగించి అడ్డుకున్నారు.  

భూసారం తగ్గిపోయింది.. 
మాది రామకుప్పం మండలం చెల్దిగానిపల్లె గ్రామం. నాకు రెండు ఎకరాల భూమి ఉంది. గతంలో ఇజ్రాయెల్‌ వ్యవసాయం నిర్వాహకులకు నా రెండెకరాల భూమిని ఇచ్చాను. వారికి సాంకేతిక పరిజ్ఞానం తెలుసు గానీ పంటలు పండించడంలో అవగాహన చాలా తక్కువ. పంటలకు ఎరువులు ఎక్కువగా వాడమని చెబుతారు. ఈ కారణంగా ఆశించిన స్థాయిలో దిగుబడి రావడం లేదు. గతంలో పూలను పండించి ఎగుమతి చేసేవాడిని. ఇజ్రాయెల్‌ సేద్యం మొదలు పెట్టాక మొక్కజొన్న, దోసకాయలు పండిస్తున్నా. గతంలోకన్నా చాలా తక్కువ లాభం వస్తోంది.
– గణపతి, రైతు

ఇక్రిసాట్‌ సహకారంతో రైతులకు మేలు 
ఇజ్రాయెల్‌ టెక్నాలజీతో ఉద్యాన పంటల సాగు ప్రక్రియ ఇప్పుడు పూర్తిగా నిలిచిపోయింది. ప్రస్తుత ప్రభుత్వం ఇక్కడి పంటల సాగుపై శ్రద్ధ తీసుకుంటోంది. ఆ క్రమంలోనే ఇక్రిసాట్‌ సహకారంతో హైబ్రీడ్‌ కూరగాయల విత్తన మొలకలు పెంచి రైతులకు రాయితీపై అందిస్తున్నాం. విత్తన మొలకలకు అంట్లుకట్టి మేలురకం మొలకలు సిద్ధం చేసి పంపిణీ చేస్తున్నాం. మొత్తం 19 స్ట్రక్చర్స్‌లో కూరగాయల మొలకలు పెంచుతున్నాం 
– శ్రీనివాసులు, ఉద్యానవన శాఖ డీడీ   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top