ఉగ్ర వేణి

Lifting of gates of all projects within the Krishna Basin - Sakshi

కృష్ణా బేసిన్‌ పరిధిలో అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేత

ప్రకాశం బ్యారేజీ నుంచి 3.23 లక్షల క్యూసెక్కులు కడలిలోకి..

వర్షాలు తగ్గడంతో గోదావరిలో వరద తగ్గుముఖం

ధవళేశ్వరం నుంచి 17.74 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి..

మూడో ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ

సాక్షి, అమరావతి/ విజయవాడ/ మాచర్ల/ శ్రీశైలం ప్రాజెక్ట్‌/ పెదకూరపాడు/ కాకినాడ/ పోలవరం రూరల్‌: మూసీ, మున్నేరు, కట్టలేరు, వైరా, కొండ వాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో కృష్ణా నది ఉగ్రరూపం దాల్చగా.. ఉప నదుల నుంచి వరద ప్రవాహం తగ్గడంతో గోదారమ్మ శాంతిస్తోంది. పులిచింతల ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో 2.29 లక్షల క్యూసెక్కులు.. మున్నేరు, వైరా, కట్టలేరు వరద తోడవడంతో 4.10 లక్షల క్యూసెక్కులు ప్రకాశం బ్యారేజీలోకి చేరుతున్నాయి. దీంతో 70 గేట్ల ద్వారా 3.23 లక్షల క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఆదివారం రాత్రికి బ్యారేజీలోకి 5 లక్షల క్యూసెక్కుల వరద చేరే అవకాశం ఉండటంతో.. దిగువ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. 

అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేత..
► కృష్ణా వరద ప్రవాహం కొనసాగుతుండటంతో శ్రీశైలంలో 10 గేట్లను 12 అడుగుల మేర ఎత్తి 3,11,790 క్యూసెక్కుల నీటిని సాగర్‌ జలాశయంలోకి విడుదల చేస్తున్నారు. 
► సాగర్‌ జలాశయం వద్ద ఆదివారం సాయంత్రానికి 12 గేట్లను 15 అడుగుల మేర ఎత్తి దిగువకు 2,51,695 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. సాగర్‌ వద్ద పర్యాటకులు రాకుండా 144 సెక్షన్‌ విధించారు. కేవలం కొత్త బ్రిడ్జి మీదుగా వెళ్లి రేడియల్‌ క్రస్ట్‌గేట్ల నుంచి స్పిల్‌వే మీదుగా దుమికే కృష్ణమ్మ పరవళ్లను చూసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. 

గోదావరిలో మరింత తగ్గిన వరద
► గోదావరి నదిలో ఆదివారం రాత్రి 7 గంటలకు భద్రాచలం వద్ద వరద 9,68,666 క్యూసెక్కులకు తగ్గింది. నీటి మట్టం 45 అడుగులు ఉంది. 
► మొదటి ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. నీటి మట్టం 43 అడుగుల కంటే దిగువకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరిస్తామని అధికారులు తెలిపారు.
► ఆదివారం రాత్రి 7 గంటలకు ధవళేశ్వరం బ్యారేజీలోకి వరద ప్రవాహం 17,84,505 క్యూసెక్కులకు తగ్గింది. 175 గేట్ల ద్వారా 17,74,755 క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు. 
► కాటన్‌ బ్యారేజీ వద్ద ఆదివారం ఉదయం 11 గంటలకు 17.70 అడుగులకు నీటిమట్టం చేరడంతో మూడో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. సోమవారం రెండో ప్రమాద హెచ్చరికను సైతం ఉపసంహరించే అవకాశం ఉంది.
► తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నంలో ముంపునకు గురైన ఇళ్లన్నీ వరద నీటిలోనే ఉన్నాయి. 36 గ్రామాలకు రాకపోకలు ఇంకా పునరుద్ధరించలేదు. 

కోతకు గురవుతున్న నెక్లెస్‌ బండ్‌
► పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం గ్రామానికి వరద నుంచి రక్షణగా నిర్మించిన నెక్లెస్‌ బండ్‌ కోతకు గురవుతోంది. 6 మీటర్ల వెడల్పున నిర్మించిన బండ్‌ రెండు మీటర్లకు తగ్గిపోయింది. 
► శనివారం అర్ధరాత్రి 12 గంటలకు కలెక్టర్‌ ఆర్‌.ముత్యాలరాజు, ఎస్పీ నారాయణ నాయక్, ఎమ్మెల్యే తెల్లం బాలరాజు హుటాహటిన పోలవరం చేరుకుని యుద్ధ ప్రాతిపదికన గట్టు పటిష్ట పరిచే పనులు చేపట్టారు. 

పడవలపై కరోనా రోగుల తరలింపు
► తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లిలంకలో శనివారం ఓ వ్యక్తి కరోనా సోకింది. రాత్రివేళ బాలాజీ అనే వ్యక్తి సాయంతో ట్రాక్టర్‌పై సఖినేటిపల్లి బోను వద్దకు చేర్చి అక్కడి నుంచి ఆంబులెన్స్‌లో అల్లవరం కోవిడ్‌ ఆస్పత్రికి తరలించారు. 
► అప్పనరామునిలంక, మామిడికుదురు, అప్పనపల్లి, బి.దొడ్డవరం గ్రామాల నుంచి ఒక్కొక్కరి చొప్పున పడవలపై తీసుకొచ్చి కోవిడ్‌ ఆస్పత్రులకు తరలించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top