సీఐడీ అదనపు డీజీ సునీల్‌కు లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు

Lifetime Achievement Award for CID Additional DG Sunil - Sakshi

ఎస్పీ రాధికకు సైబర్‌ స్టార్‌ అవార్డు

సాక్షి, అమరావతి: సైబర్‌ నేరాల కట్టడిలో రాష్ట్ర పోలీసులకు జాతీయస్థాయిలో గుర్తింపు లభించింది. జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక సంస్థ ‘సెంటర్‌ ఫర్‌ రిసెర్చ్‌ ఆన్‌ సైబర్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ డిజిటల్‌ ఫోరెన్సిక్స్‌ (సీఆర్‌సీఐడీఎఫ్‌) రాష్ట్ర సీఐడీ విభాగం అదనపు డీజీ పీవీ సునీల్‌కుమార్‌కు లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డును, ఎస్పీ (సైబర్‌ క్రైమ్స్‌) జీఆర్‌ రాధికకు సైబర్‌ స్టార్‌ అవార్డులను ప్రకటించాయి.

ఐఎస్‌ఈఏ, సీపీఎఫ్, ఐజీఎం, ఫ్రో డిస్కవర్, పీఎస్‌ఎం సంస్థలతో కలసి సీఆర్‌సీఐడీఎఫ్‌ ‘ఉత్తమ సైబర్‌ విధానాలు’ అనే అంశంపై మూడో జాతీయ స్థాయి సదస్సు నిర్వహించింది. వర్చువల్‌ విధానంలో ఆదివారం నిర్వహించిన ఈ సదస్సు ముగింపు సమావేశంలో రాష్ట్ర సీఐడీ విభాగం అదనపు డీజీ పీవీ సునీల్‌కుమార్‌కు లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డును ప్రదానం చేసింది.

సైబర్‌ పోలీసింగ్, సైబర్‌ నేరాల పరిష్కారంలో వినూత్న విధానాలను ప్రవేశపెట్టినందుకు 2021కు గాను ఆయనకు ఈ అవార్డును ప్రకటించినట్లు సీఆర్‌సీఐడీఎఫ్‌ తెలిపింది. సైబర్‌ నేరాల కట్టడి కోసం తగిన రీతిలో వ్యవస్థను బలోపేతం చేసినందుకు సీఐడీ విభాగం ఎస్పీ (సైబర్‌ క్రైమ్స్‌) జీఆర్‌ రాధికను ‘సైబర్‌ స్టార్‌’ అవార్డుకు ఎంపిక చేసినట్లు పేర్కొంది. సైబర్‌ నేరాల నియంత్రణ కోసం రాష్ట్ర సీఐడీ విభాగం అనుసరిస్తోన్న విధానాలను ఈ జాతీయ సదస్సులో వక్తలు ప్రశంసించారు.

దేశంలో అత్యధికంగా సైబర్‌ సేఫ్‌ లాగిన్స్‌ను తయారు చేసిన ఘనత ఏపీ సీఐడీ విభాగానిదేనని పేర్కొన్నారు. సైబర్‌ బుల్లీషీట్స్, 4ఎస్‌4యు పోర్టల్, ఫ్యాక్ట్‌ చెక్, యూట్యూబ్‌ వెబినార్స్‌ మొదలైన వినూత్న విధానాలను పీవీ సునీల్‌కుమార్‌ ప్రవేశపెట్టారు. వాటిని సైబర్‌ క్రైమ్స్‌ విభాగం సమర్థంగా నిర్వహిస్తూ సైబర్‌ నేరాలకు అడ్డుకట్ట వేస్తోంది. రాష్ట్ర సీఐడీ విభాగం అనుసరిస్తోన్న విధానాలు, వ్యూహాలను సీఆర్‌సీఐడీఎఫ్‌ ప్రత్యేకంగా ప్రశంసించింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top