నీటిలెక్కలు తేల్చడానికి రెడీ

Krishna Board ready to settle water issues of AP And Telangana - Sakshi

తెలంగాణ కోటా కంటే ఎక్కువగా 73.56 టీఎంసీలు వాడుకుందంటున్న ఏపీ ప్రభుత్వం

తమ కోటా ఇంకా 199.31 టీఎంసీలు మిగిలాయని స్పష్టీకరణ

సాక్షి, అమరావతి: కృష్ణా జలాలను కోటా కంటే అధికంగా వాడుకున్నారంటూ రెండు రాష్ట్రాలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్న నేపథ్యంలో.. నీటిలెక్కలు తేల్చేందుకు కృష్ణాబోర్డు సిద్ధమైంది. ప్రస్తుత నీటి సంవత్సరంలో కృష్ణా బేసిన్‌లో రెండు రాష్ట్రాలు వినియోగించుకున్న నీటిలెక్కలు తేల్చి.. కోటాలో మిగిలిన నీటిని లభ్యత ఆధారంగా కేటాయించేందుకు బోర్డు చైర్మన్‌ శివ్‌నంద్‌కుమార్‌ సిద్ధమయ్యారు. ఏప్రిల్‌ మొదటి వారంలో సర్వసభ్య సమావేశం నిర్వహించడానికి అనువైన రోజును ఎంపిక చేయాలని రెండు రాష్ట్రాల జలవనరులశాఖ ఉన్నతాధికారులను కృష్ణాబోర్డు కోరింది.

2022–23 నీటి సంవత్సరంలో ఫిబ్రవరి 28 వరకు దిగువ కృష్ణా బేసిన్‌లో 972.46 టీఎంసీల లభ్యత ఉందని.. ఇందులో ఏపీ వాటా 641.82 (66 శాతం) టీఎంసీలు, తెలంగాణ వాటా 330.64 (34 శాతం) టీఎంసీలని ఏపీ ఈఎన్‌సీ నారాయణరెడ్డి కృష్ణాబోర్డుకు లేఖ రాశారు. ఫిబ్రవరి వరకు రెండు రాష్ట్రాలు 846.72 టీఎంసీలను వాడుకున్నాయని తెలిపారు. అందులో ఏపీ 442.52 (52.2 శాతం) టీఎంసీలు, తెలంగాణ 404.20 (47.8 శాతం) టీఎంసీలు వాడుకున్నాయని వివరించారు.

వీటిని పరిగణనలోకి తీసుకుంటే ఏపీ కోటాలో ఇంకా 199.31 టీఎంసీలు మిగిలే ఉన్నాయని, తెలంగాణ ఆ రాష్ట్ర కోటా కంటే అధికంగా 73.56 టీఎంసీలు అదనంగా వాడుకుందని కృష్ణాబోర్డుకు ఫిర్యాదు చేశారు. ఇదిలాఉంటే.. ఉమ్మడి ప్రాజెక్టుల్లో కోటా కంటే ఏపీ ప్రభుత్వం అదనంగా 38.72 టీఎంసీలు వాడుకుందని, ఇకపై నీటిని వాడుకోకుండా కట్టడిచేయాలని తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్‌ కృష్ణాబోర్డుకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే నీటిలెక్కలు తేల్చి వివాదానికి తెరదించడానికి కృష్ణాబోర్డు సిద్ధమైంది.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top