రూ.40 కోట్ల పన్ను ఎగవేత!? | Key documents of several companies were seized by Visakha IT authorities | Sakshi
Sakshi News home page

రూ.40 కోట్ల పన్ను ఎగవేత!?

Aug 30 2021 5:37 AM | Updated on Aug 30 2021 5:37 AM

Key documents of several companies were seized by Visakha IT authorities - Sakshi

సాక్షి, విశాఖపట్నం: విజయనగరం జిల్లా గరివిడిలోని పలు సంస్థల కీలక పత్రాలను విశాఖ పట్నం ఆదాయపు పన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 26న ఈ సంస్థలపై వారు దాడులు నిర్వహించారు. ఇందులో రూ.40 కోట్ల మేర అక్రమ లావాదేవీలకు పాల్పడినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) వెల్లడించింది. వివరాలివీ.. గరివిడిలో మోర్‌ అల్లాయిస్, రాధికా మినరల్స్‌ అండ్‌ మెటల్స్, రాధికా వెజిటబుల్‌ ఆయిల్స్‌ తదితర గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీలు వాటికి వస్తున్న ఆదాయానికి తగ్గట్టుగా పన్నులు చెల్లించడంలేదన్న అనుమానంతో విశాఖ ఐటీ అధికారులు ఇటీవల దాడులు నిర్వహించారు. ఈ సంస్థలన్నింటికీ డైరెక్టర్లు ఒక్కరేనని గుర్తించారు. నాగ్‌పూర్‌కు చెందిన విష్ణు మోర్, మన్విందర్‌ మోర్‌ కుటుంబాలు ఈ వ్యాపారాలు నిర్వహిస్తున్నాయి. వీరికి నాగ్‌పూర్‌లోనూ కొన్ని కంపెనీలు ఉండడంతో కొందరు డైరెక్టర్లు నాగ్‌పూర్, రాయ్‌పూర్‌లో, మరికొందరు విశాఖపట్నంలోనూ ఉంటున్నట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. 

ఆయా సంస్థలలో జరుగుతున్న ఉత్పత్తి, వస్తున్న ఆదాయం, చెల్లిస్తున్న పన్నులు.. బ్యాలెన్స్‌షీట్లో ఉన్న ఆస్తులకు ఏమాత్రం పొంతన లేదని వారు వివరించారు. అంతేకాక.. వీరు వివిధ బ్యాంకుల నుంచి రుణాలు కూడా తీసుకున్నారని.. వాటికి సంబంధించిన వివరాల్లోనూ అవకతవకలు ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో జరిగిన దాడుల్లో పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నామని.. వాటిల్లో వారి రిటరŠన్స్‌కు, వారి వద్ద ఉన్న సమాచారానికి పొంతనలేదని స్పష్టమైందని అధికారులు వెల్లడించారు. అయితే.. మరికొన్ని కీలక డాక్యుమెంట్ల కోసం.. డైరెక్టర్లు, సంస్థ కీలక అధికారుల సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లతో పాటు, కార్యాలయాలు, డైరెక్టర్ల ఇళ్లల్లో ఉన్న కంప్యూటర్లలోని డేటా బ్యాకప్‌ తీసుకున్నామని వారు తెలిపారు. పన్నుల విలువ నిర్ధారించేందుకు రెండు నెలల సమయం పడుతుందని, స్వాధీనం చేసుకున్న డేటాని, తమ వద్ద ఉన్న డేటాతో సరిపోల్చిన తర్వాత నోటీసులు జారీచేస్తామని ఐటీ అధికారులు వెల్లడించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement