‘కొంప’ముంచిన ‘కార్తికేయ’ | Sakshi
Sakshi News home page

‘కొంప’ముంచిన ‘కార్తికేయ’

Published Sun, Apr 2 2023 8:30 AM

Karthikeya Cooperative Building Society Depositors Anguish - Sakshi

సాక్షి ప్రతినిధి, కాకినాడ: సహకార చట్టాలను చట్టుబండలు చేస్తూ కొన్ని కోఆపరేటివ్‌ బిల్డింగ్‌ సొసైటీలు ఖాతాదారుల కొంప ముంచేస్తున్నాయి. కాకినాడ జయలక్ష్మి మ్యూచువల్లీ కోఆపరేటివ్‌ బ్యాంకు రూ.560 కోట్లకు బోర్డు తిప్పేసి, సుమారు 20 వేల మంది ఖాతాదారులకు కుచ్చుటోపీ పెట్టిన వ్యవహారం మరచిపోకుండానే మరో సంస్థ అయిన కార్తికేయ కోఆపరేటివ్‌ బిల్డింగ్‌ సొసైటీ డిపాజిటర్ల సొమ్ములు తిరిగి ఇవ్వకుండా దాటవేస్తోంది. దీంతో వారందరూ లబోదిబోమంటున్నారు.

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఈ సొసైటీకి 300 మందికి పైగానే డిపాజిటర్లు ఉన్నారు. అత్యధికంగా డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో ఉన్నారు. కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో ఒకే సామాజికవర్గానికి చెందిన సుమారు 100 మంది డిపాజిటర్లు తాము మోసపోయామంటూ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. నగరంతో పాటు కోనసీమలో నాలుగైదు, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, మెట్ట ప్రాంతం, తూర్పు గోదావరి జిల్లాలోని పలు మండలాలకు చెందిన వారు ఈ సొసైటీలో డిపాజిట్లు చేశారు. పదిహేనేళ్ల క్రితం కాకినాడ ప్రధాన కూడలి నూకాలమ్మ ఆలయానికి సమీపాన సహకార రంగంలో కార్తికేయ కోఆపరేటివ్‌ బిల్డింగ్‌ సొసైటీ ఏర్పాటైంది. ఇది డిపాజిట్ల రూపంలో రూ.12 కోట్లు సేకరించింది. రూ.5 కోట్ల వరకూ రుణాలూ ఇచ్చింది.

మెచ్యూరిటీ గడువు తీరినా..
ఇక ఈ డిపాజిట్లలో రూ.10 కోట్ల డిపాజిట్ల గడువు తీరిపోయింది. డిపాజిటర్లను రేపు మాపు అని బ్యాంకు సిబ్బంది నాలుగైదు నెలలుగా తిప్పి పంపేస్తున్నారు. దీంతో బాధితులు జిల్లా సహకార అధికారులకు ఫిర్యాదు చేశారు. అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ ఎస్‌వీఎస్‌ దుర్గాప్రసాద్‌ ఆధ్వర్యాన ప్రాథమిక విచారణ జరిగింది. సొసైటీ ఇచ్చిన రుణాల్లో రూ.4.50 కోట్లకు సంబంధించి తనఖా కింద ఎటువంటి డాక్యుమెంట్లూ లేవని తేలింది. సొసైటీ ఆడిట్‌ కూడా ప్రైవేటు ఆడిటర్లతో నిర్వహిస్తున్నారు. మరోవైపు.. డిపాజిటర్లు సహకార అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. కానీ, డిపాజిట్లు, రుణాలకు సంబంధించిన రికార్డుల కోసం సహకార శాఖ సమన్లు జారీచేసినా సొసైటీ నిర్వాహకుల నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతోంది. దీంతో ఈ మొత్తం వ్యవహారాన్ని నిగ్గు తేల్చేందుకు సహకార శాఖ విచారణకు ఆదేశించింది.

డిపాజిట్లు సరిచూసుకోవాలి
డిపాజిటర్లు తమ సొమ్ము సొసైటీ ఖాతాలో డిపాజిట్‌ అయ్యిందో లేదో నిర్ధారించు­కోవాలి. సొసై­టీ వద్ద విచారణాధికారి అందు­బాటులో ఉన్నారు. సొమ్ము డిపాజిటర్ల ఖాతాలో జమకాకుంటే చర్యలు తీసుకుంటాం. 
– దుర్గాప్రసాద్, జిల్లా సహకార అధికారి, కాకినాడ

రూ.7.80 లక్షలు డిపాజిట్‌ చేశాం
కార్తికేయ సొసైటీలో నేను, నా భార్య కలిసి రూ.7.8 లక్షలు డిపాజిట్‌ చేశాం. నాలుగేళ్ల పాటు వడ్డీ  ఇచ్చారు. ఏడాది నుంచి ఇవ్వడంలేదు. సమాధానం కూడా చెప్పడంలేదు. దీనిపై నగరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాం. 
– సజ్జాద్‌ హుస్సేన్, బాధితుడు, నగరం

రూ.44 లక్షలు డిపాజిట్‌ చేశాం
ప్రలోభాలకు గురిచేసి మాతో ఈ బ్యాంకులో డిపాజిట్‌ చేయించారు. నగరం నుంచి సుమారు రూ.7 కోట్లు డిపాజిట్‌ చేశారు. మా కుటుంబ సభ్యులు రూ.44 లక్షలు డిపాజిట్‌ చేశాం. బాధ్యులపై చర్యలు తీసుకుని, మా సొమ్ములు మాకు ఇప్పించాలి.
– అన్వర్‌ తాహిర్‌ హుస్సేన్, బాధితుడు, నగరం
 

Advertisement

తప్పక చదవండి

Advertisement