వికేంద్రీకరణకే జై | Sakshi
Sakshi News home page

వికేంద్రీకరణకే జై

Published Sun, Oct 2 2022 4:02 AM

Intellectuals comments at round table meeting on Decentralization - Sakshi

సాక్షి ప్రతినిధి, కాకినాడ/ఎచ్చెర్ల క్యాంపస్‌:  రాష్ట్ర భవిష్యత్తు బంగారు బాట పట్టాలంటే మూడు రాజధానులతో కూడిన వికేంద్రీకరణతోనే సాధ్యమవుతుందని పలువురు మేధావులు జైకొట్టారు. స్వాతంత్య్రానంతరం నాలుగుసార్లు రాజధాని మార్పుతో జరిగిన నష్టాన్ని గుర్తించి యువత పరిపాలనా వికేంద్రీకరణ కోసం ఉద్యమించాల్సిన తరుణం ఆసన్నమైందని ఏకాభిప్రాయం వ్యక్తమైంది. అధికారం అంతా ఒకేచోట కేంద్రీకృతం కాకుండా ప్రభుత్వ మూడు రాజధానుల ప్రతిపాదనకు సంఘటితంగా మద్దతు తెలపాలని వక్తలంతా అభిప్రాయపడ్డారు.

ఇందుకోసం ఉద్యమ స్ఫూర్తితో యువత, విద్యావంతులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వికేంద్రీకరణపై కాకినాడలో శనివారం నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి ఐఎంఏ, ప్రొఫెసర్లు, వైద్యులు, రిటైర్డ్‌ ఉద్యోగులు, విద్యార్థి, వ్యాపార, వాణిజ్య, జర్నలిస్టు, రవాణా, ప్రజా సంఘాలు, వైఎస్సార్‌సీపీ నేతలు, ప్రజాప్రతినిధులతోపాటు 52 అసోసియేషన్ల నుంచి పెద్దఎత్తున ప్రతినిధులు హాజరయ్యారు. సమావేశానికి అధ్యక్షత వహించిన రాజనీతి శాస్త్రజ్ఞుడు ప్రొ. చంద్రశేఖర్‌ మాట్లాడుతూ.. అభివృద్ధిని కాంక్షించే ప్రపంచమంతా వికేంద్రీకరణ వైపు అడుగులేస్తున్న వైపే మనం కూడా అడుగులు వేయాలన్నారు.

చాలా దేశాల్లో పరిపాలన అంతా ఒకేచోట కేంద్రీకృతం కాకుండా ఉండటాన్ని మనం ఆకళింపుచేసుకోవాలన్నారు. ఇంజనీర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధి బాదం సుందరరావు మాట్లాడుతూ.. వికేంద్రీకరణతో అధికారులు అటూఇటూ తిరగాల్సి రావడంతో ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుందనేది ఒట్టి మాటన్నారు. తానే రాజు.. తానెక్కడ ఉంటే అక్కడే రాజధాని ఉండాలనుకోవడం సరికాదని ప్రముఖ విద్యావేత్త డాక్టర్‌ చిరంజీవినీకుమారి అభిప్రాయపడ్డారు. వికేంద్రీకరణతోనే అభివృద్ధిలో సమతుల్యత సాధ్యమవుతుందన్నారు.

బాబు ఒక్కటైనా శాశ్వత కట్టడం కట్టారా?
కాకినాడ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఏలూరు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. చంద్రబాబు ఒక్కటైనా శాశ్వత భవనం నిర్మించారా అని ప్రశ్నించారు. 23 గ్రామాల ప్రజలు అమరావతే రాజధాని అంటూ పాదయాత్ర చేసి.. మిగిలిన రాష్ట్రమంతా కలిసి వికేంద్రీకరణ కోసం పాదయాత్ర చేస్తే ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్నారు.

ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు చిట్లా కిరణ్, వాడ్రేవు రవి, ఎస్‌సీహెచ్‌ఎస్‌ రామకృష్ణ, ఈషా ఫౌండేషన్‌ కృష్ణప్రియ మాట్లాడుతూ.. వ్యవస్థలు కేంద్రీకృతమైతే జరిగే నష్టాన్ని గుర్తించి సీఎం వైఎస్‌ జగన్‌ ముందుచూపుతో ప్రతిపాదిస్తున్న వికేంద్రీకరణకే ఓటేయాలన్నారు. ఇక వికేంద్రీకరణ కోసం మేధావులు మౌనం వీడి ప్రజల తరఫున గళం వినిపించాలని యునైటెడ్‌ ఎస్సీ, ఎస్టీ ఫెడరేషన్‌ అధ్యక్షుడు బయ్యా రాజేంద్రకుమార్, మైనార్టీ ప్రతినిధి సయ్యద్‌ సాలార్‌ పిలుపునిచ్చారు.

టీడీపీ, ఎల్లో మీడియా కుట్ర
మంత్రులు బొత్స సత్యనారాయణ, చెల్లుబోయిన వేణు, దాడిశెట్టి రాజా మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర జిల్లాలు అభివృద్ది చెందకూడదని చంద్రబాబు, ఎల్లోమీడియా కుట్ర పన్నుతున్నాయన్నారు. మేధావులంతా కలిసి ఐక్య కార్యచరణకు సిద్ధంకావాలన్నారు. చంద్రబాబు చెప్పినట్లు రూ.5 లక్షల కోట్లు ఖర్చుచేసినా అమరావతి నిర్మాణం సాధ్యంకాదన్నారు.

ఇక ఎంపీలు పిల్లి సుభాష్‌చంద్రబోస్, వంగా గీత స్పందిస్తూ.. భవిష్యత్తులో రాష్ట్రం ఐక్యంగా ఉండాలంటే వికేంద్రీకరణ అనివార్యమన్నారు. సీఎం తలపెట్టిన మూడు రాజధానుల కోసం ప్రతిఒక్కరూ ముందుకు రావాలని మాజీమంత్రి కురసాల కన్నబాబు, ఎమ్మెల్యేలు జ్యోతుల చంటిబాబు అన్నారు. మంత్రి తానేటి వనిత, ఎంపీ భరత్‌రామ్, ఎమ్మెల్యే పెండెం దొరబాబు, హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దవులూరి దొరబాబు, షర్మిలారెడ్డి వివిధ రంగాల ప్రతినిధులూ పాల్గొన్నారు.

వికేంద్రీకరణతోనే ఉత్తరాంధ్ర ప్రగతి 
మరోవైపు.. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయంలో జరిగిన చర్చావేదికలో కూడా 26 జిల్లాలూ సమాన ప్రగతి సాధించాలంటే అభివృద్ధి వికేంద్రీకరణ తప్పనిసరని ఉత్తరాంధ్ర మేధావుల ఫోరం అభిప్రాయపడింది. వికేంద్రీకరణ జరగకపోతే భవిష్యత్తులో కళింగాంధ్ర, సీమాంధ్ర ఉద్యమాలు తప్పదని వక్తలు హెచ్చరించారు. ప్రస్తుత ప్రభుత్వం దూరదృష్టితో, మేధావుల సూచనలతో మూడు రాజధానుల నిర్ణయానికి వచ్చిందన్నారు.

సభకు అధ్యక్షత వహించిన ప్రొ.బిడ్డిక అడ్డయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలూ సమాన అభివృద్ధి సాధించాలన్నారు. ఏయూ విశ్రాంత ప్రొఫెసర్‌ కె. తిమ్మారెడ్డి మాట్లాడుతూ.. సీఎం జగన్‌ ఆలోచనలకు అందరి మద్దతు అవసరమన్నారు. ఇక ఉత్తరాంధ్ర వెనుకబాటుకు శాశ్వత పరిష్కారం విశాఖపట్నం పరిపాలనా రాజధానేనని కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు విభాగం సభ్యుడు అట్టాడ అప్పలనాయుడు, న్యాయవాది బైరి దామోదరరావు అభిప్రాయపడ్డారు.

ప్రజల మనోభావాలను గౌరవించి మూడు రాజధానులకు మద్దతివ్వాలని ఏయూ విశ్రాంత ప్రొఫెసర్‌ కెంబూరు చంద్రమౌళి, సీనియర్‌ జర్నలిస్టు నల్లి ధర్మారావు  అన్నారు. అమరావతి రాజధానిగా ఉండాలని అరసవల్లికి రావటం నిజంగా హాస్యాస్పదమని.. ఉద్యమాలకు పుట్టినిల్లు శ్రీకాకుళం జిల్లా అని.. వీర గుణ్ణమ్మ స్ఫూర్తితో జిల్లాలో ఉద్యమం సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా హాజరై మాట్లాడారు.  

Advertisement
 
Advertisement
 
Advertisement