కోవిడ్‌ బాధితులకు ఇన్‌హేలర్‌ స్టెరాయిడ్స్‌!  

Inhaler Steroids for Covid Victims Andhra Pradesh - Sakshi

కేరళలో మొదటి వేవ్‌లో వాడినట్టు అక్కడి వైద్యుల వెల్లడి

రాష్ట్రంలో వాడేందుకు ఉన్న పరిస్థితులపై  ఏపీ వైద్య బృందం కసరత్తు

సాక్షి, అమరావతి: కోవిడ్‌ బాధితులకు ముక్కు లేదా నోటి ద్వారా పీల్చుకునేందుకు వీలుగా ఉండే స్టెరాయిడ్స్‌ (ఉత్ప్రేరకాలు)పై పరిశీలించనున్నారు. సాధారణంగా ఆస్తమా పేషెంట్లు ఎక్కువగా ఇలా ఇన్‌హేలర్‌ ద్వారా మందును పీల్చుకుని ఆస్తమాను నియంత్రణలో ఉంచుకుంటారు. అయితే, కేరళలో మొదటి వేవ్‌లో ఇంట్లో చికిత్స పొందుతున్న పలువురికి బుడొజినైట్‌ స్టెరాయిడ్‌ను ఇన్‌హేలర్‌ ద్వారా ఇచ్చారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ వైద్య బృందం కేరళకు వెళ్లినప్పుడు ఈ అంశం పరిశీలనకు వచ్చింది. బాగా దగ్గు ఉండి, 94 కంటే ఆక్సిజన్‌ శాతం పడిపోయినప్పుడు ఇలా ఇన్‌హేలర్‌ స్టెరాయిడ్స్‌ ఇచ్చినట్టు కేరళ వైద్యులు తెలిపారని కేరళకు వెళ్లిన బృందం సభ్యులు డా.సాంబశివారెడ్డి తెలిపారు. దీనిపై ఆంధ్రప్రదేశ్‌లోనూ పరిశీలన చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారన్నారు.

ఇన్‌హేలర్‌ స్టెరాయిడ్స్‌పై ఏపీలోనూ పరిశీలన చేయనున్నామని, దీనివల్ల ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయా? ఇలా వాడితే ఎంతవరకు కోవిడ్‌ నియంత్రణలోకి వస్తుంది? అనే అంశాలపై అధ్యయనం చేస్తున్నామన్నారు. ఇప్పటివరకు మనం స్టెరాయిడ్స్‌ ఇంట్రా వీనస్‌ (నరాల) నుంచి పంపిస్తున్నామని, నోరు లేదా ముక్కు ద్వారా పీల్చితే ఎంతమేరకు పనిచేస్తాయన్నది చూస్తామన్నారు. కేరళలో కూడా ఫలితాలపై ప్రత్యేక డేటా ఏమీ లేదని, ఆంధ్రప్రదేశ్‌లో ముందుగా పలువురు వైద్యనిపుణులతో చర్చించిన తర్వాత అమలుకు సాధ్యాసాధ్యాలపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇదికూడా కేసులు ఎక్కువగా ఉండి, పరిస్థితి విషమంగా ఉన్నప్పుడు మాత్రమే చేయాల్సిన వైద్యమని, సాధారణ పేషెంట్లకు ఇవ్వడం కానీ, కోవిడ్‌ రాకుండా ఇవ్వడం కానీ ఉండదన్నారు. కేరళలో స్టెరాయిడ్స్‌ వాడకంపై కూడా అక్కడి వైద్యనిపుణులతో మళ్లీ సంప్రదింపులు జరిపి చర్చించనున్నట్టు తెలిపారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top