మామిడి గుజ్జు.. ఎగుమతులు నుజ్జు | Impact of economic slowdown on mango pulp exports | Sakshi
Sakshi News home page

మామిడి గుజ్జు.. ఎగుమతులు నుజ్జు

Published Wed, Mar 26 2025 5:50 AM | Last Updated on Wed, Mar 26 2025 5:50 AM

Impact of economic slowdown on mango pulp exports

మ్యాంగో పల్ప్‌ ఎగుమతులపై యుద్ధాలు, ఆర్థిక మాంద్యం ప్రభావం 

2024–25లో ఏపీ నుంచి నిలిచిపోయిన 2.75 లక్షల టన్నులు 

ఆ ప్రభావం ఈ ఏడాది తోతాపురి మామిడి ధరలపై పడే ప్రమాదం

ఆందోళనలో చిత్తూరు ప్రాంత రైతులు, ఎగుమతిదారులు

తెగుళ్లు, చీడపీడలు, వాతావరణ ప్రభావంతో తగ్గనున్న దిగుబడులు 

ఈ ప్రభావంతో ఇతర మామిడి రకాలకు మంచి ధరలు లభించే అవకాశం

సాక్షి, అమరావతి/నెట్‌వర్క్‌: విదేశాలకు మామిడి గుజ్జు (పల్ప్‌) ఎగుమతులు క్షీణించాయి. గడచిన సీజన్‌లో ఒక్క ఏపీ నుంనే 3 లక్షల టన్నుల మామిడి గుజ్జు ఎగుమతులు జరుగుతాయని అంచనా వేయగా.. ఊహించని పరిస్థితులు తలెత్తడంతో 2.75 లక్షల టన్నుల మేర నిల్వలు ఎగుమతి కాకుండా నిలిచిపోయింది. వివిధ దేశాల్లో యుద్ధాలు. ఆర్థిక మాంద్యం, పౌర అశాంతి ప్రభావంతో దేశం నుంచి ఎగుమతులు పడిపోయాయి. ఈ ఏడాది కూడా పరిస్థితులు మరింత తీవ్రం కావడంతో ఎగుమతులు మరింత క్షీణించే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. 

ఈ పరిస్థితి మామిడి ధరలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గత ఏడాది అకాల వర్షాలు, వరుస వైపరీత్యాలతో ఆశించిన స్థాయిలో దిగుబడులు రాకపోవడం, నాణ్యత లోపించడం వంటి కారణాలతో ధర లేక మామిడి రైతులు తీవ్ర నష్టాలను చవిచూశారు. అదే సమయంలో మామిడి గుజ్జు ఎగుమతులు నిలిచిపోవడం రైతులతో పాటు ఎగుమతి దారులకు ఆశనిపాతంగా మారింది. ఆ ప్రభావం ఈసారి మార్కెట్‌పై మరింతగా పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

ఏపీ నుంచి ఏటా 2.5 లక్షల టన్నులకు పైగా ఎగుమతి రాష్ట్రంలో 9.97 లక్షల ఎకరాల్లో మామిడి తోటలు విస్తరించి ఉండగా.. ఈ ఏడాది 45 లక్షల టన్నులకుపైగా దిగుబడులు వస్తాయని అంచనా వేశారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో సాగయ్యే పంటలో 65–70 శాతం పంట తోతాపురి రకమే. తోతాపురి మామిడిని గుజ్జు రూపంలో యూరప్, గల్ఫ్, ఉక్రెయిన్, శ్రీలంక, దక్షిణాఫ్రికా దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. 

రాష్ట్రం నుంచి ఏటా 2.5 లక్షల టన్నులకు పైగా మామిడి గుజ్జు ఎగుమతి అవుతుంటుంది. 2019–24 మధ్య 8.5 లక్షల టన్నుల పల్ప్‌ విదేశాలకు ఎగుమతి చేశారు. అదేవిధంగా 550 టన్నులకుపైగా మామిడి పండ్లు సైతం విదేశాలకు ఎగుమతి అయ్యాయి.  

రైతులు, ఎగుమతిదారులకు ఇది కష్టకాలమే 
2024–25లో ప్రపంచ దేశాల్లో యుద్ధాలు, ఆర్థిక మాంద్యం వంటి కారణాల వల్ల దేశం నుంచి మామి­డి గుజ్జుతో పాటు పండ్ల ఎగుమతులు నిలిచిపోయాయి. ఈ ఏడాది ఆశించిన స్థాయిలో విదేశాల నుంచి ఆర్డర్స్‌ వచ్చే పరిస్థితులు కనిపించడం లేదని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. గతేడాది తోతాపు­రి రకం టన్ను రూ.25 వేల నుంచి రూ.30 వేలు ధర పలకగా, ఈ ఏడాది టన్నుకు రూ.10 వేల నుంచి రూ.15వేలకు మించి పలకకపోవచ్చని చెబుతున్నారు. 

వాతావరణ మార్పులు, చీడపీడలు, కొత్తరకం పురుగులు మామిడిపై దాడి చేయడంతో దిగుబడులు గణనీయంగా తగ్గిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయని రైతులు ఆందోళన చెందుతు­న్నారు. మరోవైపు గుజ్జు ఎగుమతులు కాకపోతే ధరలు మరింత క్షీణించే అవకాశాలు ఉన్నాయన్న వార్తలు రైతులను మరింత కలవరానికి గురి చేస్తున్నాయి.

పేరుకున్న రూ.1,750 కోట్ల విలువైన గుజ్జు నిల్వలు 
మామిడి గుజ్జు పరిశ్రమలన్నీ ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే ఉన్నాయి. మొత్తంగా 47 ఫ్యాక్టరీలు ఉండగా.. వాటి సామర్థ్యం 8 లక్షల టన్నులు. గతేడాది 3.50 లక్షల టన్నులకు పైగా గుజ్జు ఉత్పత్తి అయ్యింది. ఇందు­లో స్థానిక వినియోగం పోగా.. ఇంకా 2.75 లక్షల టన్నుల  నిల్వలు పేరుకుపోయాయి. వీటి విలువ రూ.1,750 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. సాధారణంగా ఏటా 10–20 శాతం వరకు గుజ్జు నిల్వలు మిగులు ఉంటుంది. 

ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి గుజ్జు ఎగుమతులు ప్రారంభం కాగా.. గతేడాది పేరుకుపోయిన నిల్వల్లో కేవలం 10 శాతం మాత్రమే ఎగుమతి అయింది. మే నాటికి పాత నిల్వలు అమ్ముడవకపోతే అప్పుల ఊబిలో కూరుకుపోతా­మ­ని వ్యాపారులు చెబుతున్నారు. తమకు ఆర్థికంగా చేయూత ఇవ్వాలని చిత్తూరు జిల్లా ఫ్రూట్‌ ప్రోసెసర్స్‌ ఫెడరేషన్‌ ప్రభుత్వాన్ని కోరినా ఫలితం లేకపోయింది.

ఈసారి కూడా మామిడి కష్టమే 
మాకు 10 ఎకరాల్లో మామిడి తోట ఉంది. ఈసారి పూత ఆలస్యమైంది. వాతావరణ ప్రభావంతో పిందె సక్రమంగా రాలే­దు. తెగుళ్లు, కొత్త రకం పురుగులు పంటను పట్టి పీడిస్తున్నాయి. ఎండ తీవ్రత అధికం కావడంతో పిందె ఎదుగుదలపై ప్రభా­వం పడుతోంది. ఇప్పటివరకు 3 సార్లు మందుల పిచికారీ చేశా. ఖర్చులు విపరీతంగా పెరిగాయి.  మరోవైపు మామిడి గుజ్జు నిల్వలు ఫ్యాక్టరీల్లో పేరుకుపోయాయి. ఈ పరిస్థితుల్లో పెట్టుబడులు దక్కు­తాయో లేదో అనుమానంగా ఉంది. – పద్మనాభరెడ్డి, ఎర్రచేను, చిత్తూరు జిల్లా 

అయోమయంలో ఉన్నాం 
మహరాష్ట్ర వెళ్లి ఎగుమతిదారులతో మాట్లాడాం. వాళ్లు ఏమాత్రం స్పందించడం లేదు. మామిడి గుజ్జు నిల్వలు అమ్ముడుపోయే పరిస్థితి కనిపించడం లేదు. యుద్ధాలు, ట్రాన్‌్పపోర్ట్‌ చార్జీలు పరిశ్రమదారులను నిండా ముంచుతున్నా­యి. అప్పులు నిలిచిపోయాయి. ఈసారి ఎలా ఉంటుందో అర్థంగాక అ­యో­మయంలో ఉన్నాం. జ్యూస్‌ తయారీ కంపెనీలు ఆర్టిఫిషియల్‌ ఉత్పత్తులపై దృష్టి సారిస్తున్నాయి. గతంలో జ్యూస్‌లో 80 శాతం గుజ్జు కలిపేవారు. ఇప్పుడు 5 శాతమే గుజ్జు కలుస్తోంది. ఇది కూడా పరిశ్రమదారులను దెబ్బతీస్తోంది. వీటిపై ప్రభుత్వాలు స్పందించి ఆదుకోవాలి. – తలపులపల్లి బాబురెడ్డి, గుజ్జు పరిశ్రమ యజమాని 

మామిడి గుజ్జు పరిశ్రమను ఆదుకోవాలి: ఏఐఎఫ్‌పీఏ 
తీవ్ర సంక్షోభంలో ఉన్న మామిడి పరిశ్రమను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయూతనివ్వాలని, చిత్తూరులో మామిడి బోర్డు ఏర్పాటు చేయాలని ఆల్‌ ఇండియా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ అసోసి­యేషన్‌ (ఏఐఎఫ్‌పీఏ) కోరింది. ఈ మేరకు అసోసియేషన్‌ సౌత్‌ జోన్‌ చైర్మన్‌ కట్టమంచి గోవర్ధన్‌ బాబీ చిత్తూరు జిల్లా ఫ్రూట్‌ ప్రాసెసింగ్‌ ఫెడరేషన్‌తో కలిసి సీఎం చంద్రబాబుకు, కేంద్రానికి లేఖ రాశారు. 

ఆర్థిక ఇబ్బందులు  ఎదు­ర్కొంటున్న పల్ప్‌ ఇండస్ట్రీని ఆదు­కునేందుకు రుణాల వసూళ్లను ఆరునెలలు వాయిదా వేసేలా బ్యాంకర్లకు ఆదేశా­లి­వ్వాలని కోరారు. మామిడి గుజ్జు నిల్వలు అమ్ముడ­య్యేందుకు వీలుగా ఆలయాలు, పర్యాటక ప్రాంతాల్లో మామిడి గుజ్జు పరిశ్రమల సమాఖ్యకు స్టాల్స్‌ కేటాయించాలని, మధ్యాహ్న భోజనం మెనూలో మామిడి ఉత్పత్తులు చేర్చాలని విజ్ఞప్తి చేశారు. పల్ప్‌ పరిశ్ర­మలకు పెండింగ్‌ సబ్సిడీలను వెంటనే విడుదల చేయాలని కోరారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement