టార్గెట్లతో ఎక్సైజ్ శాఖపై తీవ్ర ఒత్తిడి
సాధించలేక తలలు పట్టుకుంటున్న అధికారులు
అయినా వెనక్కి తగ్గని ప్రభుత్వం
ఒక్క రోజు...రూ.600 కోట్లు అమ్మకాలు చూపాలని ఆదేశం
2025–26 టార్గెట్ రూ.30,200 కోట్లుగా నిర్దేశం
దుకాణాలు, బార్ల యజమానులను
ప్రాథేయపడిన ఎక్సైజ్ అధికారులు
సాక్షి, అమరావతి: ప్రజలతో తెగ తాగించేందుకు చంద్రబాబు సర్కారు పన్నుతున్న కుట్రలో ఎక్సైజ్ అధికారులు సమిథలవుతున్నారు. ప్రభుత్వ టార్గెట్లు వారికి ప్రాణసంకటంగా మారుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో మద్యం విక్రయాల లక్ష్యాన్ని చేరేందుకు చివరి రోజు మార్చి 31న అధికారులు నానాపాట్లు పడ్డారు. మద్యం దుకాణాలు, బార్ల యజమానుల వద్దకు వెళ్లి మద్యం కొనుగోలు చేయాల్సిందిగా ప్రాథేయపడ్డారు. 2025–26లో మద్యం అమ్మకాలు రూ.30,200 కోట్ల మార్కు దాటించడం కోసం రాత్రి పొద్దుపోయే వరకు తీవ్ర అవస్థలు పడ్డారు.
రూ.35వేల కోట్లు కాలేదు.. రూ.30 వేల కోట్లు దాటాలి
మద్యం అమ్మకాలతో వచ్చే ఆదాయాన్నే చంద్రబాబు సర్కారు ప్రధాన ఇంధనంగా చేసుకుందన్నది సుస్పష్టం. 2025–26లో ఏకంగా రూ.35 వేల కోట్ల మేర మద్యం అమ్మకాలు సాధించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్సైజ్ శాఖకు లక్ష్యం నిర్దేశించారు. ప్రతీ వారం సమీక్షించి ఎలాగైనా టార్గెట్ చేరుకోవాలని ఎక్సైజ్ శాఖ కమిషనరేట్ ఆదేశించింది. మద్యం దుకాణాలు, బెల్ట్ దుకాణాలు, బార్ల ద్వారా వేళా పాళా లేకుండా మద్యం అమ్మకాలకు తలుపులు బార్లా తెరచింది.
ఎంత చేసినా ఈ ఏడాది ఫిబ్రవరి 28 నాటికి ఏపీ బెవరేజస్ కార్పొరేషన్ రూ.27వేల కోట్ల మద్యాన్నే దుకాణాలు, బార్లకు విక్రయించగలిగింది. దీంతో ప్రభుత్వ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము నిర్దేశించిన రూ.35వేల కోట్ల మార్కుకు చేరలేకపోతున్నారని మండిపడ్డారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మద్యం అమ్మకాలు కనీసం రూ.30,200 కోట్లు అయినా దాటించాలని నిర్దేశించారు. ఏం చేస్తారో తెలీదు.. ఇచి్చన టార్గెట్ మేర దుకాణాలు, బార్ల యజమానులతో మద్యం కొనిపించాల్సిందేనని తేల్చి చెప్పారు.
తీవ్ర ఒత్తిడికి గురైన ఎక్సైజ్ సిబ్బంది
దీంతో ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు జిల్లా అధికారులకు భారీ టార్గెట్లు పెట్టారు. మార్చిలో రూ.3,200 కోట్ల మేర మద్యం అమ్మకాలు సాధించాలని స్పష్టం చేశారు. గత ఏడాది మార్చిలో రూ.2,400 కోట్ల మద్యం అమ్మకాలు జరిపారు. సాధారణంగా దానిపై సుమారు 10 శాతం పెంచి లక్ష్యంగా నిర్దేశిస్తారు. అంటే ఈ ఏడాది
మార్చిలో రూ.2,600 కోట్ల మద్యం అమ్మకాలు లక్ష్యమని ఎక్సైజ్ అధికారులు భావించారు. కానీ ఆ శాఖ ఉన్నతాధికారులు ఏకంగా రూ.3,200కోట్ల మద్యం అమ్మకాలు సాధించాలని ఆదేశించడంతో జిల్లాల్లో ఎక్సైజ్ శాఖ అధికారులు కంగుతిన్నారు. ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు మార్చి నెలంతా రోజూ సమీక్షలు చేస్తూ మద్యం అమ్మకాలు పెంచేందుకు తీవ్ర ఒత్తిడి చేశారు. దీంతో సిబ్బంది సతమతమయ్యారు.
చివరి రోజు ఆపసోపాలు
ఉన్నతాధికారుల ఒత్తిడి భరించలేక మార్చి నెలంతా దుకాణాలు, బార్ల యజమానుల వద్దకు వెళ్లి ఎక్సైజ్ సిబ్బంది కాళ్లావేళ్లా పడ్డారు. అమ్మకాలు పెంచాలని వేడుకున్నారు. డిమాండ్ మేరకే మద్యం కొనగలమని, అంతుకుమించి కొనలేమని దుకాణాలు, బార్ల యజమానులు తేల్చిచెప్పారు. అయినా సరే ఎక్సైజ్ అధికారులు పట్టు వీడక దుకాణాలు, బార్లపై ఒత్తిడి పెంచుతూనే ఉన్నారు. మార్చి 30నాటికి రూ.2,600 కోట్ల మద్యం అమ్మకాలే జరిపారు. అంటే మార్చి లక్ష్యం రూ.3,200 కోట్లకు రూ.600 కోట్లు తక్కువ.
ఇక ఒక్క రోజు అంటే మార్చి 31(మంగళవారం) మాత్రమే ఉంది. దీంతో ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు జిల్లా అధికారులపై అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క మంగళవారమే రూ.600కోట్ల మద్యం అమ్మకాలు జరపాల్సిందేనని తేల్చి చెప్పారు. దీంతో ఎక్సైజ్ శాఖ అధికారులు మంగళవారం ఉదయాన్నే దుకాణాలు, బార్ల యజమానుల వద్దకు వెళ్లి రోజువారి ఇండెంట్ కంటే ఎక్కువ కొనాలని వేడుకున్నారు. అయితే అవసరానికి మించి కొనుగోలు చేయలేమని కొందరు తేల్చిచెప్పారు. మరి కొందరు తమ వద్ద అందుబాటులో ఉన్న నగదు మేరకే కొంటామని వివరించారు. దీంతో కొందరు ఎక్సైజ్ శాఖ అధికారులు మద్యం దుకాణాలు, బార్ల యజమానులపై బెదిరింపులకు దిగారు.
తాము చెప్పిన మేర మద్యం కొనకుంటే తర్వాత తీవ్ర పరిణామాలు ఉంటాయని, తనిఖీలు కఠినంగా ఉంటాయని పరోక్షంగా హెచ్చరించారు. మరికొందరు అధికారులైతే అప్పు ఇప్పిస్తామని, రోజువారీ ఇండెంట్ కంటే ఎక్కువ మద్యం కొనాలని దుకాణదారులకు ప్రతిపాదించారు. ఓ అధికారి అయితే ఓ బార్ యజమానికి రూ.25లక్షలు అప్పు ఇచ్చి మరీ కొనుగోలు చేయించారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ మంగళవారం ఇదే పరిస్థితి కొనసాగింది. అయినా సరే మంగళవారం రాత్రి వరకు అనుకున్న లక్ష్యం పూర్తికాలేదు. దీంతో ఉన్నతాధికారులు టెలికాన్ఫరెన్స్‌ల ద్వారా వెంటపడడం గమనార్హం. దీంతో మద్యం అమ్మకాలు తగ్గితే ప్రభుత్వ వ్యవస్థ నిలిచిపోతుందన్నట్టుగా పరిస్థితి తయారైందని ఎక్సైజ్ శాఖ అధికారులు తలలు పట్టుకోవడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది.


