Anantapur: అనంత గర్భం.. అరుదైన ఖనిజం​

Huge Lithium Reserves in Anantapuram District - Sakshi

జిల్లాలో భారీగా లిథియం నిల్వలు

తురకవారిపల్లె, దాడితోట ప్రాంతాల్లో గుర్తింపు

రాతపూర్వకంగా వెల్లడించిన కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి

లిథియం ఖనిజానికి అంతర్జాతీయ మార్కెట్లో భారీ గిరాకీ

సాక్షి ప్రతినిధి, అనంతపురం: అరుదైన ఖనిజాలకు నిలయమైన ‘అనంత’లో మరో విలువైన ఖనిజం ఉనికి లభింంది. ప్రపంచంలోనే అత్యంత అరుదుగా లభించే లిథియం ఖనిజ నిక్షేపాలు జిల్లాలో భారీగా ఉన్నట్లు జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జీఎస్‌ఐ) సర్వేలో గుర్తించారు. ఇదే విషయాన్ని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి కూడా ధ్రువీకరించారు. లిథియం ప్రాజెక్టుపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు కోటగిరి శ్రీధర్, చింతా అనురాధ, డాక్టర్‌ ఎస్‌.సంజీవ్‌ కుమార్‌ ఈ నెల రెండో తేదీన పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇందుకు మంత్రి ప్రహ్లాద్‌ జోషి రాతపూర్వక సమాధానమిస్తూ అనంతపురం, వైఎస్సార్‌ జిల్లాల్లో ఈ నిక్షేపాలున్నట్లు గుర్తించామని వెల్లడించారు.

తాడిమర్రి మండల పరిధిలో..
జీఎస్‌ఐ శాస్త్రవేత్తలు కొన్ని నెలల క్రితం జిల్లాలోని తాడిమర్రి మండలం తురకవారిపల్లె, దాడితోట ప్రాంతాలతో పాటు సమీపంలోని వైఎస్సార్‌ జిల్లా పార్నపల్లె, లోపటనూతల ప్రాంతాల్లో ఫీల్డ్‌ సర్వే చేశారు. ఈ ప్రాంతాల్లోని మట్టి, శిలలు, ప్రవాహ అవక్షేపాలను సేకరించి పరీక్షించారు. 18 పీపీఎం నుంచి 322 పీపీఎం (పార్ట్‌ పర్‌ మిలియన్‌) మోతాదులో లిథియం నిక్షేపాలు ఉన్నట్టు గుర్తించారు.

అరుదైన ఖనిజం.. ఫుల్‌ డిమాండ్‌
లిథియం ఖనిజం చాలా అరుదుగా లభిస్తుంది. ఇప్పటివరకూ చిలీ, ఆస్ట్రేలియా, పోర్చుగల్‌ వంటి దేశాల్లో మాత్రమే ఎక్కువగా లభిస్తోంది. ఈ ఖనిజాన్ని రీచార్జ్‌బుల్‌ బ్యాటరీలు, మొబైల్‌ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, డిజిటల్‌ కెమెరాలు, ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీలో ఎక్కువగా వాడుతున్నారు. అంతేకాకుండా గుండెకు అమర్చే పేస్‌మేకర్ల తయారీలోనూ వినియోగిస్తున్నారు. ఈ ఖనిజాన్ని 1817లో స్వీడన్‌కు చెందిన రసాయన శాస్త్రవేత్త జాన్‌ అగస్ట్‌ ఆర్ఫ్‌వెడ్‌సన్‌ కనుగొన్నారు. ఇది మార్కెట్‌ను శాసించింది మాత్రం 1990 తర్వాతనే. దీన్ని ప్రపంచ దేశాలన్నిటికీ పై కొన్ని దేశాలు మాత్రమే సరఫరా చేస్తున్నాయి. ఇలాంటి అరుదైన ఖనిజం ఉనికి అనంతపురం, వైఎస్సార్‌ జిల్లాల్లో లభించడం గొప్ప విషయమని నిపుణులు అంటున్నారు. 

విలువైన ఖనిజాలకు కేరాఫ్‌
అనంతపురం జిల్లా విలువైన ఖనిజాలకు కేరాఫ్‌గా ఉంది. బంగారు, వజ్రాలు, బైరటీస్, ఇనుము తదితర ఖనిజ నిక్షేపాలు జిల్లాలో ఉన్నాయి. ఇప్పుడు లిథియం నిక్షేపాలు కూడా వెలుగు చూడడం విశేషం.

అంతర్జాతీయంగా డిమాండ్‌
లిథియం ఖనిజానికి అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉంది. దీన్ని బ్యాటరీల తయారీలో, కెమికల్స్‌లో ఎక్కువగా వినియోగిస్తారు. సముద్రగర్భాల్లో ఎక్కువగా దొరికే అవకాశముంది. అలాంటిది మన దగ్గర ఉండడం గొప్ప విషయమే. దీన్ని అవసరానికి తగ్గట్టుగానే వినియోగించుకోవాల్సి ఉంటుంది.
–సుబ్రహ్మణ్యేశ్వరరావు, గనుల శాఖడిప్యూటీ డైరెక్టర్, అనంతపురం 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top