మరో వారం రోజులు ఇంతే..  భగ భగలకు కారణమిదే!

High Temperature For Another Week Days In AP - Sakshi

నైరుతి గాలులు బలహీనపడటం, తేమ తగ్గటమే..

సాక్షి, అమరావతి: విస్తారంగా వర్షాలు కురవాల్సిన సమయమిది. అందుకు భిన్నంగా వారం రోజుల నుంచి ఎండలు మండుతున్నాయి. వాతావరణం వేసవిని తలపిస్తోంది. నైరుతి రుతు పవనాల ప్రభా వంతో వీచే గాలులు బలహీనపడటం.. నైరుతి, పశ్చిమ దిశగా వీయాల్సిన గాలుల్లో తేమ లేకపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తినట్టు వాతావరణ శాఖ చెబుతోంది. సాధారణంగా ఈ సీజన్‌లో పాకిస్తాన్‌ వైపు నుంచి వీచే గాలులు బంగాళాఖాతం మీదుగా అరేబియన్‌ సముద్రం వైపు వెళ్లాలి.

ఈ గాలుల్లో తేమ ఎక్కువగా ఉండాలి. అప్పుడే మేఘాలు ఏర్ప డి వర్షాలు కురుస్తాయి. వీటి ప్రభావంతో అల్పపీడనం, ఉపరితల ఆవర్తనాలు ఏర్పడి వర్షాలు కురవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ గాలులు చాలావరకు బంగాళాఖాతాన్ని తాకకుండా నేరుగా అరేబియన్‌ సముద్రం వైపు వెళ్లిపోతున్నా యి. దీనివల్ల ఆ ప్రాంతంలో అల్పపీడనం, ఉపరిత ల ఆవర్తనం ఏర్పడ్డాయి. మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీ ర్‌ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురవడానికి ఈ గాలులే కారణమని వాతావరణ శాఖ చెబుతోంది.

రాష్ట్రవ్యాప్తంగా 36 నుంచి 39 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గాలిలో తేమ లేకపోవడం వల్ల ఉక్కపోత కూడా ఎక్కువగా ఉంటోంది. కొద్దిగా వీస్తున్న గాలుల ప్రభావంతో అక్కడక్కడా స్వల్ప స్థాయిలో వర్షాలు పడుతున్నా.. మొత్తంగా రాష్ట్రమంతా వేడి వాతావరణం ఉంటోంది. ఈ పరిస్థితి మరో వారం రోజులపాటు కొనసాగే అవకాశం ఉంది. ఈ నెల 13వ తేదీ వరకు ఉష్ణోగ్రతలు ఇలాగే ఉంటాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఆ తర్వాత పరిస్థితి కొంత మారవచ్చని అంచనా వేస్తోంది.

సాధారణం కంటే 2 డిగ్రీల ఎక్కువ ఉష్ణోగ్రతలు 
పశ్చిమ, నైరుతి దిశగా వీస్తున్న గాలుల్లో తేమ లేకపోవడం వల్ల రాష్ట్రంలో వేడి వాతావరణం నెలకొంది. గాలులు బలహీనంగా ఉన్నాయి. అందువల్ల రాష్ట్రంలో సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2 డిగ్రీలు ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అన్నిచోట్లా 40 డిగ్రీలలోపే ఉష్ణోగ్రతలు ఉండొచ్చు. వారం తర్వాత వాతావరణ పరిస్థితుల్లో మార్పు రావచ్చు.
– డాక్టర్‌ స్టెల్లా, డైరెక్టర్, అమరావతి వాతావరణ కేంద్రం  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top