
సాక్షి, విశాఖ: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక, భారీ వర్షాల కారణంగా విద్యార్థుల భద్రత దృష్ట్యా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. అలాగే, ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలకు ప్రభుత్వం సెలవు ఇచ్చింది.

విద్యాసంస్థలకు నేడు సెలవు..
శ్రీకాకుళం, విశాఖ, అల్లూరి జిల్లాలోని విద్యాసంస్థలకు నేడు సెలవు ప్రకటించారు. భారీ వర్షాల దృష్ట్యా సెలవులు ఈ మూడు జిల్లాల కలెక్టర్లు సెలవు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
కోనసీమ, తూగో, పగో, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు
కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం
మత్స్యకారులు వేటకు వెళ్ళరాదు
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ.

ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు ఆనుకుని పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఇది ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు ఆనుకుని కేంద్రీకృతమైంది. ఇది పశ్చిమ, వాయవ్య దిశగా కదులుతూ ఇవాళ వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మంగళవారం మధ్యాహ్నానికి దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉందని వెల్లడించింది. అల్పపీడనం ప్రభావంతో రాబోయే రెండు మూడు రోజుల్లో కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.

తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. లోతట్టు ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, NTR, గుంటూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. కృష్ణపట్నం, వాడరేవు, నిజాంపట్నం, మచిలీపట్నం, కాకినాడ, గంగవరం, విశాఖపట్నం, కళింగపట్నం పోర్టులకు మూడో నంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేసినట్లు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో బుధవారం వరకు మత్స్యకారులు చేపలవేటకు వెళ్లరాదని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్‌జైన్ విజ్ఞప్తి చేశారు.
ఇక, తెలంగాణలో వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వచ్చే మూడు రోజుల పాటు తెలంగాణలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు జిల్లాలకి రెడ్ అలర్ట్, జయశంకర్ భూపాలపల్లికి ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. మిగిలిన ప్రాంతాల్లో మోస్తారు నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. హైదరాబాద్ నగరంలో మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది.