ఇక గుంటూరు బ్రాండ్‌ కారం

Guntur brand Mirchi Powder Here After - Sakshi

ప్రాసెసింగ్‌ రంగంలోకి మార్కెట్‌ కమిటీ 

రైతుల నుంచి నాణ్యమైన ఎండుమిర్చి కొని కారం తయారీ

నాణ్యత నిర్ధారణ పరికరాలు సిద్ధం

గుంటూరు యార్డు, పల్నాడు యార్డుల్లోనూ ప్రాసెసింగ్‌ యూనిట్లు 

సాక్షి, అమరావతి: కారం అంటేనే గుంటూరు..! నాణ్యమైన మిర్చికి నగరమే చిరునామా.. ఇక అదే పేరుతో మార్కెట్‌లోకి కారాన్ని వదిలితే విక్రయాలకు తిరుగుంటుందా? గుంటూరు మిర్చి పవర్‌ అలాంటిది మరి! గుంటూరు మార్కెట్‌ కమిటీ తాజాగా ప్రాసెసింగ్‌ రంగంలోకి ప్రవేశిస్తోంది. గుంటూరు మిర్చికున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని అదే బ్రాండ్‌తో కారం తయారీ, అమ్మకాలు చేపట్టాలని కమిటీ నిర్ణయం తీసుకుంది. రైతుల నుంచి కొనుగోలు చేసిన నాణ్యమైన ఎండుమిరప కాయలను ప్రాసెస్‌ చేసి కారం విక్రయాలు చేపడతారు. ఇప్పటికే మిర్చి నాణ్యతను నిర్థారించే యాంత్రిక పరికరాలను సమకూర్చుకోగా మార్కెట్‌ స్పందనను పరిశీలించి గుంటూరు మిర్చి యార్డు, పల్నాడు మార్కెట్‌ కమిటీల్లో ప్రాసెసింగ్‌ యూనిట్లు ప్రారంభించనున్నారు.

దేశ విదేశాలకు గుంటూరు ఘాటు..
ఘాటుగా ఉండే గుంటూరు మిర్చికి దేశ విదేశాల్లో మంచి డిమాండ్‌ ఉంది. గుంటూరు మిర్చి యార్డులో ఏటా రూ.6 వేల కోట్ల మేర విక్రయాలు జరుగుతున్నాయి. చైనా, థాయిలాండ్, సింగపూర్‌ తదితర దేశాలకు రూ.2,000 కోట్ల మేర మిర్చి ఎగుమతులు జరుగుతున్నాయి. ఎండుమిరప ప్రాసెసింగ్‌ ద్వారా రైతులకు అధిక ధరలతో పాటు మార్కెట్‌ కమిటీకి ఆదాయం సమకూరుతుంది. ఈ నేపథ్యంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఏసురత్నం అధ్యక్షతన జరిగిన సమావేశంలో కారం తయారీ, విక్రయాలపై నిర్ణయం తీసుకున్నారు. గుంటూరులో మిల్లులను అద్దెకు తీసుకుని వచ్చే ఏడాది మార్చిలోపు కారం తయారీకి చర్యలు తీసుకుంటున్నారు. మార్క్‌ఫెడ్‌ బ్రాండ్‌ మార్కెప్‌ పేరుతో ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. మహారాష్ట్రలో మార్కెట్‌ కమిటీలు రైతులు పండించిన పంటలను ప్రాసెసింగ్‌ యూనిట్ల ద్వారా ఉప ఉత్పత్తులు తయారు చేసి విక్రయిస్తున్నాయి. వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులు లభించడంతోపాటు కమిటీలు రైతులకు అధిక ధరలను ఇవ్వగలుగుతున్నాయి. ఇదే తరహాలో గుంటూరు మార్కెట్‌ కమిటీ కారం తయారీతో ప్రాసెసింగ్‌ రంగంలోకి ప్రవేశించనుంది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top