జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌కు ఘనంగా వీడ్కోలు 

Grand Farewell to Justice Praveen Kumar - Sakshi

ఆయన సేవల్ని కొనియాడిన సీజే జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా

తండ్రి పద్మనాభరెడ్డి, చిన్నాన్న జస్టిస్‌ చిన్నపరెడ్డే మార్గదర్శకులన్న జస్టిస్‌ ప్రవీణ్‌ 

జస్టిస్‌ ప్రవీణ్‌ దంపతులకు ఘన సన్మానం 

సాక్షి, అమరావతి: నేడు (శనివారం) పదవీ విరమణ చేయనున్న సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌కుమార్‌కు హైకోర్టు శుక్రవారం ఘనంగా వీడ్కోలు పలికింది. శనివారం హైకోర్టుకు పాలనాపరమైన సెలవు కావడంతో శుక్రవారమే ఆయనకు వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. జస్టిస్‌ ప్రవీణ్‌కు వీడ్కోలు పలికేందుకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా నేతృత్వంలో న్యాయమూర్తులందరూ ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా సీజే జస్టిస్‌ మిశ్రా మాట్లాడుతూ జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌ న్యాయవ్యవస్థకు ఎంతో సేవ చేశారన్నారు. న్యాయమూర్తిగా ఆయన 26 వేల కేసులను పరిష్కరించారని చెప్పారు. హైకోర్టు విభజన తరువాత హైకోర్టు విజయవాడకు వచ్చిన తరువాత తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఆయన సమర్థంగా బాధ్యతలు నిర్వర్తించారని తెలిపారు. భవనాలు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన విషయంలో ఎంతో కష్టపడ్డారన్నారు.

జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌ యువ న్యాయవాదులకు ఆదర్శప్రాయుడని చెప్పారు. ఏపీ జ్యుడిషియల్‌ అకాడమీ, లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ వంటి సంస్థలకు నేతృత్వం వహించి చక్కని సేవలు అందించారన్నారు. పాలనాపరమైన విషయాల్లో తనకు ఎంతో సహకరించారని జస్టిస్‌ మిశ్రా చెప్పారు. జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ తన తండ్రి పద్మనాభరెడ్డి, చిన్నాన్న జస్టిస్‌ చిన్నపరెడ్డి తనకు మార్గదర్శకులన్నారు.

అనిశ్చిత సమయాల్లో వారే తనకు మార్గదర్శనం చేశారని తెలిపారు. న్యాయవాదిగా, న్యాయమూర్తిగా తన వృత్తి జీవితం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు.  ఇన్నేళ్ల తన ప్రస్థానంలో తనకు సహకరించిన వారందరికీ ఆయన పేరుపేరున కృతజ్ఞతలు తెలిపారు.  

రాష్ట్ర అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌.శ్రీరామ్, డిప్యూటీ సొలిసిటర్‌ జనరల్‌ (డీఎస్‌జీ) ఎన్‌.హరినాథ్‌ , బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ గంటా రామారావు మాట్లాడుతూ పదవీ విరమణ తరువాత జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌ న్యాయ సేవలను కొనసాగించాలని ఆకాంక్షించారు. జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌ కుటుంబ సభ్యులు, న్యాయవాదులు, రిజిస్ట్రార్లు పాల్గొన్నారు. అనంతరం హైకోర్టు న్యాయవాదుల సంఘం జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌ దంపతులను ఘనంగా సన్మానించింది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top