కుంటు‘బడి’న చదువులు! | Govt Teachers Confused by Transfers in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

కుంటు‘బడి’న చదువులు!

Jul 4 2025 6:15 AM | Updated on Jul 4 2025 6:15 AM

Govt Teachers Confused by Transfers in Andhra Pradesh

బదిలీలతో అయోమయంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు.. రిలీవర్‌ లేక ఎక్కడి టీచర్లు అక్కడే విధులు

‘డీఎస్సీ’ నియామకాలు పూర్తయ్యాక కొందరు రిలీవ్‌ అయ్యే చాన్స్‌

మొక్కుబడిగా బోధన.. విద్యార్థులకు తప్పని ఇక్కట్లు.. 25న డీఎస్సీ ఫలితాలు ప్రకటించే అవకాశం!

అన్నమయ్య జిల్లా రాయచోటి మండలంలోని ఓ మోడల్‌ ప్రైమరీ పాఠశాలలో 90 మంది విద్యార్థులు ఉండగా, ప్రభుత్వం నలుగురు టీచర్లు, ఒక హెచ్‌ఎంను కేటాయించింది. ఇందులో ఇద్దరు టీచర్లను బదిలీపై ఇక్కడ నియమించగా, వచ్చి బాధ్యతలు తీసుకున్నారు. అయితే రిలీవర్లు లేక వారు పాత స్కూల్లోనే కొనసాగుతున్నారు. ఈ మోడల్‌ ప్రైమరీ స్కూలులో ఐదుగురు టీచర్లు ఉన్నా, పనిచేస్తున్నది ముగ్గురే. ఉపాధ్యాయుల బదిలీల తర్వాత రాష్ట్రంలో వేలాది పాఠశాలల్లో ఇదే పరిస్థితి నెలకొంది.  

సాక్షి, అమరావతి: సర్కారు బడిలో చదువులు చతికిలపడ్డాయి. అస్తవ్యస్త బదిలీలతో బోధన కుంటుపడింది. ముఖ్యంగా మోడల్‌ ప్రైమరీ స్కూళ్లలో నియమించిన టీచర్లు కొత్త పోస్టులో బాధ్యతలు తీసుకున్నా, వారు పాత పాఠశాలల్లోనే పనిచేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఆయా స్కూళ్లలో అధికారికంగా టీచర్లను నియమించినా, గతేడాది ఉన్న పరిస్థితే కొనసాగుతోంది. గత నెలలో పాఠశాల విద్యాశాఖలోని దాదాపు 67వేల మంది ఉపాధ్యాయులను బదిలీ చేశారు. వీరిలో 6వేల మందికి పీఎస్‌ హెచ్‌ఎంలుగా, స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించారు.

అయితే, వీరు పదోన్నతులు తీసుకున్నా... పాత పోస్టుల్లోనే కొనసాగుతున్నారు. మరోపక్క ప్రభుత్వం ఎంతో గొప్పగా చెబుతున్న మోడల్‌ ప్రైమరీ స్కూళ్లలో ఉపాధ్యాయులు లేక అవస్థలు మొదలయ్యాయి. దాదాపు 40శాతం మంది బదిలీ అయిన స్థానాల్లో రిపోర్టు చేసి, తిరిగి పాత స్కూళ్లలోనే కొనసాగుతున్నారు. వచ్చే నెలలో విద్యార్థులకు ఫార్మెటివ్‌ అసెస్‌మెంట్‌–1 పరీక్షలు జరగనున్నాయి. కానీ, ఇక్కడ స్కూళ్లల్లో చదువు చెప్పేవారు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. 

డీఎస్సీ తర్వాతా కష్టమే? 
పాఠశాల విద్యాశాఖ ఇటీవల బదిలీల్లో 67వేల మంది టీచర్లకు స్థానచలనం కల్పించింది. వీరిలో ఎస్జీటీలు 31వేల మంది, స్కూల్‌ అసిస్టెంట్లు 28వేలు, ఎంపీఎస్‌ హెచ్‌ఎంలు 5,717, గ్రేడ్‌–2 హెచ్‌ఎంలు 1,500, భాషా పండితులు 1,199, పీఈటీలు 344 మంది ఉన్నారు. వీరిలో ఎస్జీటీల నుంచి స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందినవారు, స్కూల్‌ అసిస్టెంట్‌ నుంచి హెచ్‌ఎంలుగా పదోన్నతి పొందినవారు రిలీవర్లు లేక పాత పోస్టుల్లోనే ఉండాల్సి వచ్చింది. ప్రభుత్వం డీఎస్సీ ద్వారా ఖాళీలను భర్తీ చేశాక పదోన్నతులు పొందినవారు రిలీవ్‌ అవుతారని విద్యాశాఖ ప్రకటించింది.

రాష్ట్ర ప్రభుత్వం16,437 పోస్టుల భర్తీకి డీఎస్సీ నిర్వహించింది. ఖాళీలు అంతకు రెట్టింపు ఉన్నాయి. చాలా జిల్లాల్లో ఖాళీలు 700 ఉండగా, నోటిఫైడ్‌ పోస్టులు 200 నుంచి 250 వరకు ఉన్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం నోటిఫైడ్‌ పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తే, మిగిలిన ఖాళీల పరిస్థితి ఏమిటని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. కొత్త టీచర్లను ఇప్పుడు బదిలీ అయినవారి స్థానాల్లో నియమిస్తారా? లేక పూర్తిగా ఖాళీగా ఉన్న స్థానాల్లో నియమిస్తారా? అని అనుమానం వ్యక్తంచేస్తున్నారు. కొత్త టీచర్లతో ఖాళీలను భర్తీ చేస్తే, బదిలీ అయిన టీచర్లు పాత పోస్టుల్లోనే కొనసాగాల్సి వస్తుందని ఆందోళనకు గురవుతున్నారు. 

వచ్చేవారం డీఎస్సీ తుది ‘కీ’
డీఎస్సీ–2025 పరీక్షలు ఈ నెల 2వ తేదీతో ముగిశాయి. మొత్తం 66 పేపర్లలో సగానికి పైగా పేపర్లకు ప్రాథమిక కీ ప్రకటించగా, కొన్నింటికి సోమవారం నాటికి ‘కీ’ విడుదల చేయనున్నారు. అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించి ఫైనల్‌ ‘కీ’ని వచ్చే వారాంతానికి విడుదల చేయాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది. దానిపైనా అభ్యర్థులకు 10 రోజులు గడువిచ్చి అభ్యంతరాలు తీసుకుని ఈ నెల 25 నాటికి ఫలితాలు ప్రకటించాలని భావిస్తున్నట్టు సమాచారం. ఎలాంటి అడ్డంకులు లేకపోతే ఆగస్టులో అభ్యర్థులకు నియామకపత్రాలు అందజేయాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement